Summer Holidays – A Nostalgic Journey
చిన్నప్పుడు గడిపిన వేసవి సెలవులు, అమ్మమ్మ ఊరు, స్నేహితులతో అల్లరి, ఆటపాటలు.. ఈ జ్ఞాపకాలు జీవితంలో ఎప్పటికీ చెరిగిపోవు. అలాంటి మధురమైన బాల్యాన్ని మరోసారి కళ్లముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది ‘సమ్మర్ హాలిడేస్’. ముఖ్యంగా ఇది కేవలం పిల్లల కోసం రూపొందించిన సినిమా కాదని, పెద్దలను సైతం చిన్ననాటి రోజుల్లోకి తీసుకెళ్లే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చిత్రబృందం చెబుతోంది.
Summer Holidays – A Nostalgic Journey
ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకర్ నయన్ దర్శకత్వం వహించారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రల్లో నటించగా.. సహజనటి జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 6న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అరవింద్, హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ వేడుకలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకు తెలియకుండానే ఎన్నో భావోద్వేగాలు కనెక్ట్ అవుతాయి. మనం మర్చిపోయిన జ్ఞాపకాలను గుర్తుచేస్తూ అమ్మమ్మ ఊరికి తీసుకెళ్తుంది. ఇది చిన్న సినిమా, పిల్లల సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు పెద్దలు కూడా పిల్లలైపోయి ఎంజాయ్ చేస్తారు. ఈ దీపావళికి కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి’’ అని అన్నారు.
నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా అని అభివర్ణించారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత చిన్ననాటి స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుందని, అంతలా పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని చెప్పారు. దర్శకుడు బాబీ కూడా పిల్లల స్వచ్ఛమైన మనస్తత్వాన్ని ప్రతిబింబించే మంచి సినిమా ఇదని ప్రశంసించారు.
జయసుధ మాట్లాడుతూ.. ఇది పిల్లల సినిమా కాదని, ఇద్దరు చిన్న హీరోలు నటించిన సినిమా అని పేర్కొన్నారు. అల్లు అరవింద్ చిత్రాన్ని నాస్టాల్జిక్ ఫిల్మ్‌గా అభివర్ణిస్తూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు శ్రీకర్ నయన్ మాత్రం ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.