మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే సాగించిన పోరాటాన్ని నేటి తరానికి పరిచయం చేసే చిత్రం ‘ఫూలే’. ప్రముఖ దర్శకుడు అనంత్ నారాయణ్ మహదేవన్ తెరకెక్కించిన ఈ బయోపిక్ ఇప్పటికే హిందీలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. సుపదా క్రియేషన్స్ బ్యానర్‌పై డా. పొన్నం రవిచంద్ర నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గురువారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రతీక్ గాంధీతో పాటు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు సురేష్ లాల్, నిర్మాత మధుర శ్రీధర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ, నటుడు రచ్చ రవి, ఐఏఎస్ అధికారి శ్యామ్ ప్రసాద్ లాల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులంతా ‘ఫూలే’ చిత్రాన్ని అభినందిస్తూ, ఇది ప్రతి ఒక్కరిలోనూ సామాజిక చైతన్యాన్ని నింపే చిత్రమని, తెలుగు ప్రేక్షకుల ఆదరణతో ఘనవిజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రతీక్ గాంధీ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఫూలే దంపతులు 200 ఏళ్ల క్రితమే మహిళా విద్య, సమానత్వం కోసం వేసిన పునాదుల ప్రభావం నేటికీ కనిపిస్తోందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధించడానికి వారి పోరాటం కూడా ఒక ముఖ్యమైన కారణమని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు.
చిత్ర నిర్మాత డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. ‘ఫూలే’ ప్రతి మహిళ తప్పక చూడాల్సిన చిత్రమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల వరకు ఈ సినిమా సందేశాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. తెలుగు వెర్షన్ కోసం చేతన్ కత్తి అద్భుతమైన సంభాషణలు అందించారని, ప్రత్యేకంగా ఓ పాటను కూడా రూపొందించామని తెలిపారు.
దర్శకుడు అనంత్ నారాయణ్ మహదేవన్ వీడియో సందేశం ద్వారా తెలుగు ప్రేక్షకుల ఆదరణపై ఆశాభావం వ్యక్తం చేశారు. సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ ఈ చిత్రానికి సంగీతం అందించడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. నిర్మాత మధుర శ్రీధర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు కూడా చిత్రాన్ని అభినందించారు.
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను మరింతమందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.