Dads Little Friend – A Heartwarming Family Drama
కుటుంబ బంధాలు, ప్రేమానుబంధాలు, భావోద్వేగాల కలయికగా తెరకెక్కిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై దీపక్ నిర్మాణంలో శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. బేబీ పరిణిత రుద్రరాజు కీలక పాత్రలో కనిపించనుంది. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.
Dads Little Friend – A Heartwarming Family Drama
ఈ సందర్భంగా హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ.. చిత్ర బృందం అంతా సమష్టిగా కష్టపడి మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చామని తెలిపారు. ట్రైలర్ చూసిన ప్రతిసారీ తాను భావోద్వేగానికి గురవుతున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో తప్పులు జరుగుతాయని, వాటిని గుర్తించి సరిదిద్దుకుంటూ ముందుకు సాగేవాడే సంపూర్ణమైన వ్యక్తి అనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశారని వివరించారు. మంచి సంభాషణలు, సహజమైన నటన, హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన బలమని, ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు.
దర్శకుడు శరత్ మాట్లాడుతూ.. హీరో రజత్ రాఘవ్‌తో తనకు ఏడేళ్లుగా మంచి స్నేహం ఉందని, తాను రాసే ప్రతి కథను ముందుగా ఆయనతోనే పంచుకుంటానని వెల్లడించారు. ఈ కథ రజత్‌కు నచ్చడంతో సినిమా కార్యరూపం దాల్చిందన్నారు. నిర్మాత దీపక్ సినిమా అవుట్‌పుట్‌పై ఎంతో నమ్మకంగా ఉన్నారని, ప్రేక్షకులను కట్టిపడేసేలా తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించామని తెలిపారు. సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయని అన్నారు.
నిర్మాత దీపక్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్‌లో హీరో రజత్ రాఘవ్‌ను కలిసిన సందర్భంలోనే ఈ సినిమా ప్రయాణం మొదలైందని గుర్తు చేసుకున్నారు. కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను తప్పకుండా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. తాను విన్న కథ కంటే మరింత అందంగా దర్శకుడు శరత్ సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు. వినోదంతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, నిజమైన ప్రేమకు అర్థం చెప్పే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని అన్నారు. సినిమా కోసం రజత్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, ఆయన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉందని, ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ.. సినిమాలో తండ్రి పాత్రలో నటించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ప్రతి తండ్రి తన పిల్లల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటారని, తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రను ఈ సినిమాలో పోషించానని చెప్పారు. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను కదిలిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.