Cool Rocky Cool – A Real Story of Youth & Relationships
ప్రస్తుత జనరేషన్లో ప్రేమ, స్నేహం, రిలేషన్షిప్స్, ఘోస్టింగ్.. ఇలా యువత జీవితాల్లో ఎన్నో భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. వాటికి డార్క్ కామెడీ, ఎమోషన్స్‌ను జోడిస్తూ తెరకెక్కుతున్న చిత్రమే ‘కూల్ రాఖీ కూల్’. ఇంక్ స్పైర్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా టైటిల్, పోస్టర్స్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహ్మద్ సాయిద్ సమి రచన, దర్శకత్వం, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించడంతో పాటు హీరోగానూ నటిస్తున్నారు. తన స్నేహితుల జీవితాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
Cool Rocky Cool – A Real Story of Youth & Relationships
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ.. ఒకే వ్యక్తి హీరోగా నటిస్తూ, కథ రాసి, దర్శకత్వం వహించి, ఎడిటింగ్ కూడా చేయడం అభినందనీయమని అన్నారు. చిన్నప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్ రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్న సమికి కుటుంబ సభ్యులు అండగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. కొత్తవారిలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని, ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
సినిమా కథ గురించి సమి మాట్లాడుతూ.. ఇది పూర్తిగా తన స్నేహితుల నిజ జీవిత అనుభవాల నుంచి పుట్టిన కథ అని తెలిపారు. ప్రస్తుత సమాజంలో ప్రేమ, రిలేషన్షిప్స్, బ్రేకప్స్, ఘోస్టింగ్ వంటి అంశాలు యువత జీవితాల్లో కీలకంగా మారాయని, వాటిని సహజంగా తెరపై చూపించే ప్రయత్నం చేశామని చెప్పారు. కథలోని భావోద్వేగాలు, పరిస్థితులు నేటి యువతకు తప్పకుండా కనెక్ట్ అవుతాయని పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో తానే హీరోగా నటించడానికి కూడా ఓ ప్రత్యేక కారణం ఉందని సమి వెల్లడించారు. కథలోని ఎమోషన్స్‌ను తాను అనుకున్న విధంగా మరొకరు తెరపైకి తీసుకురాలేరని భావించానని, ఇది తనకు తెలిసిన వ్యక్తుల నిజ జీవిత కథ కావడంతో తానే నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకే మరో నటుడిని సంప్రదించకుండా హీరోగా కూడా బాధ్యతలు తీసుకున్నట్లు వివరించారు.
ఈ సినిమాను సమి తల్లి ఎస్. ఖుస్నుమ నిర్మించడం విశేషం. సినిమా బడ్జెట్, పెట్టుబడి గురించి ఆమె మాట్లాడుతూ.. డబ్బు శాశ్వతం కాదని, తన కుమారుడు జీవితంలో ఒక స్థాయికి ఎదగాలన్నదే తన కోరికని తెలిపారు. డిగ్రీ పూర్తయ్యాక ఏదైనా ఉద్యోగం లేదా ఇతర పని చేయమని సూచించినప్పటికీ, సమి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనలోని ప్రతిభను నిరూపించుకున్నాడని చెప్పారు. అందుకే అతని కలకు మద్దతుగా సినిమా నిర్మాణానికి ముందుకొచ్చానని, లాభనష్టాల కంటే తన కుమారుడి ప్రతిభ ప్రేక్షకులకు చేరడం ముఖ్యమని పేర్కొన్నారు.
సినిమాలో అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయనే విషయంపై సమి స్పందిస్తూ.. 18+ కంటెంట్ అంటే కేవలం కొన్ని డైలాగ్స్ మాత్రమేనని, ప్రత్యేకంగా అడల్ట్ సీన్స్ ఏమీ ఉండవని స్పష్టం చేశారు. మనుషులు తీవ్రమైన భావోద్వేగాల్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారో, అదే సహజత్వాన్ని సినిమాలో చూపించేందుకు కొన్ని పచ్చి పదాలను ఉపయోగించామని వివరించారు. ముఖ్యంగా జెన్‌జీ ఆలోచనలు, వారి సంభాషణలకు దగ్గరగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నామని, కేవలం ప్రేక్షకులను ఆకర్షించేందుకు అలాంటి డైలాగ్స్ పెట్టలేదని తెలిపారు.
ఈ సినిమా టైటిల్ వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉందని సమి చెప్పారు. రవితేజ నటించిన ‘దుబాయ్ సీను’ సినిమాలో బ్రహ్మానందం చెప్పే ‘కూల్ రాఖీ కూల్’ డైలాగ్ మీమ్‌గా బాగా పాపులర్ అయిందని గుర్తుచేశారు. సినిమాలో హీరో పేరు రాకీ అని, అతని పాత్ర ఎక్కువ సమయం ఫ్రస్ట్రేషన్లో ఉంటుందని చెప్పారు. అలాంటి సందర్భాల్లో స్నేహితులు ‘కూల్ రాఖీ కూల్.. ఎందుకు అంత టెన్షన్?’ అంటూ ఆటపట్టిస్తుంటారని, సినిమాలో ఈ డైలాగ్ పదేపదే రావడంతో అదే టైటిల్‌గా ఖరారు చేసినట్లు వెల్లడించారు.
కర్నూలు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కడి ప్రాంతీయ యాస, స్థానిక స్లాంగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. బెంగళూరుకు చెందిన కన్నడ అమ్మాయి హీరోయిన్గా నటిస్తుండగా, ఆమె తెలుగు నేర్చుకుంటూ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని సమి తెలిపారు. సినిమాలోని పాత్రలన్నింటికీ కొత్తవారినే ఎంపిక చేసుకోవడంతో పాటు తన స్నేహితుల బృందంతోనే ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపినట్లు చెప్పారు. ఫ్రెండ్స్ మధ్య ఉండే అనుబంధం, ప్రేమకథను సమాంతరంగా నడిపిస్తూ డార్క్ కామెడీతో పాటు భావోద్వేగాలకు చోటు కల్పించామని చిత్రబృందం తెలిపింది.