Hanuman Ansh OTT Release
భక్తి భావంతో చిన్న సినిమాగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ భక్తిరస చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు కూడా చూసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది.
Hanuman Ansh OTT Release
‘హనుమాన్ అంశ్’ సినిమా రెండు ప్రముఖ ఓటీటీ వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నవంబర్ 27 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వేదికపై హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. తాజాగా నెట్ఫ్లిక్స్ కూడా ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుని మరో ప్రకటన చేసింది. నవంబర్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను తమ భాషలో వీక్షించే అవకాశం దక్కింది.
ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలుత పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. అయితే క్రమంగా మౌత్ టాక్తో పుంజుకుని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సుమారు రూ.2 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.452.86 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్న సినిమాలు కూడా బలమైన కంటెంట్, ప్రేక్షకుల నమ్మకంతో ఎంతటి విజయాన్ని అందుకోగలవో ఈ చిత్రం మరోసారి నిరూపించింది.
ఈ సినిమా ఇంతటి భారీ విజయాన్ని సాధించినప్పటికీ, పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో ప్రశంసలు, స్పందన రాలేదని దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్లు, ప్రముఖ నిర్మాణ సంస్థల అండ ఉంటేనే సినిమాలు విజయం సాధిస్తాయనే అభిప్రాయాన్ని ‘హనుమాన్ అంశ్’ చెరిపేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులే అసలైన నిర్ణేతలని, మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాను కూడా ప్రేక్షకులు పెద్ద విజయంగా నిలబెడతారని ఆయన అభిప్రాయపడ్డారు.
డాక్టర్ విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభినవ్ సత్యా, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు రచించిన ‘డివైన్ డిటూర్: దట్ చేంజ్డ్ మై లైఫ్’ పుస్తకం ఆధారంగా నీమ్ కరోలి బాబా జీవిత విశేషాలను ఈ సినిమాలో ఆవిష్కరించారు. హనుమంతుడిపై అపారమైన భక్తి కలిగిన నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.