Dad’s Little Friend Telugu Movie Review
చిత్రం : డాడ్స్ లిటిల్ ఫ్రెండ్ (Dad’s Little Friend)
రేటింగ్ : 3/5
నటీనటులు : రజత్ రాఘవ్, కాజల్ చౌదరి, బేబీ పరిణీత రుద్రరాజు, హసిని సుధీర్, గుండు సుదర్శన్ తదితరులు
బ్యానర్ : వెన్నెల సిల్వర్ స్క్రీన్
నిర్మాత : దీపక్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : శరత్
సంగీత దర్శకుడు : ఆర్.హెచ్. విక్రమ్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : కుశ్వంత్ కుమార్
విడుదల తేదీ: నవంబర్ 27, 2026
Dad’s Little Friend Telugu Movie Review
కథ విషయానికొస్తే..
ఆకాంక్ష (కాజల్ చౌదరి) తన కూతురు పరిణీత (బేబీ పరిణీత రుద్రరాజు)తో కలిసి జీవిస్తుంటుంది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా పరిణీత చిన్న వయసులోనే ఒంటరిగా మిగిలిపోతుంది. తల్లి జ్ఞాపకాలే తోడుగా జీవితాన్ని కొనసాగిస్తుంది. స్ట్రింగ్ ఆర్ట్‌పై ఆసక్తి ఉన్న పరిణీత తనకున్న కళతో చిన్న చిన్న సంపాదనలు చేసుకుంటూ రోజులు గడుపుతుంది. తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ తనదైన ప్రపంచంలో జీవిస్తుంటుంది. ఇలాంటి సమయంలో రాహుల్ (రజత్ రాఘవ్) తన తండ్రినంటూ పరిణీత జీవితంలోకి వస్తాడు. అయితే అతడిని తండ్రిగా అంగీకరించడానికి పరిణీత ఇష్టపడదు. ఆమెకు దగ్గరవ్వడానికి రాహుల్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఎదురయ్యే సంఘటనలు కథను ముందుకు నడిపిస్తాయి. అసలు రాహుల్ ఎవరు? పరిణీత తండ్రిగా ఎందుకు వచ్చాడు? ఆకాంక్షకు, రాహుల్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? వీరి జీవితాల్లో దాగి ఉన్న నిజాలేంటి? అనేది మిగతా కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ బేబీ పరిణీత రుద్రరాజు నటన. పరిణీత పాత్రలో ఎంతో సహజంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తన తల్లి జ్ఞాపకాలతో ముడిపడిన సన్నివేశాల్లో భావోద్వేగాలను చక్కగా పలికించింది. చిన్న వయసులోనే మంచి పరిణతితో నటించి సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. రాహుల్ పాత్రలో రజత్ రాఘవ్ తన నటనతో మెప్పించాడు. పాత్రకు తగ్గట్టుగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాజల్ చౌదరి తన పరిధి మేరకు ఆకట్టుకుంది. పరిణీత స్నేహితుడి పాత్రలో నటించిన బాలుడు నవ్వులు పంచాడు. హసిని సుధీర్ తన పాత్రకు న్యాయం చేసింది. గుండు సుదర్శన్ కూడా తనదైన కామెడీతో అలరించాడు.
టెక్నికల్ టీమ్ గురించి..
ఆర్.హెచ్. విక్రమ్ అందించిన సంగీతం సినిమాకు చక్కగా కుదిరింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కుశ్వంత్ కుమార్ సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్. కలర్‌ఫుల్ విజువల్స్‌తో సినిమాను అందంగా చూపించారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. దర్శకుడు శరత్ ఎంచుకున్న కథాంశం బాగుంది. చిన్నారుల మనస్తత్వాలు, కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల ప్రాధాన్యత వంటి అంశాలను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని సన్నివేశాలను సాగదీయడం, కథనంలో వేగం తగ్గడం ఇబ్బందిగా అనిపిస్తాయి. కొన్ని కీలక విషయాల్లో స్పష్టత లోపించినప్పటికీ సెకండాఫ్, క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా మలిచాడు.

సినిమా ఎలా ఉందంటే..
పిల్లల నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి ప్రయత్నమే డాడ్స్ లిటిల్ ఫ్రెండ్. చిన్నారి జీవితంలో తల్లిదండ్రుల ప్రేమ ఎంత ముఖ్యమో, వారి గైర్హాజరీ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌లో కథను పరిచయం చేస్తూ చిన్నారి జీవితంలోని పరిస్థితులను చూపించారు. రాహుల్ ఎంట్రీతో కథలో ఆసక్తి పెరుగుతుంది. తన తండ్రినంటూ వచ్చిన వ్యక్తిని పరిణీత అంగీకరించకపోవడం, ఆమెను ఒప్పించేందుకు రాహుల్ చేసే ప్రయత్నాలు కొన్ని చోట్ల నవ్విస్తాయి. అయితే ఈ సన్నివేశాలు మరికొంత క్రిస్పీగా ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చిన్నారికి దగ్గరవ్వడానికి రాహుల్ చేసే ప్రయత్నాలు, పుట్టినరోజు వేడుకలు, తల్లి జ్ఞాపకాలతో ముడిపడిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే పరిణామాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికే క్రమంలో కథ ఆసక్తికరంగా మారుతుంది. అయితే కథలోని కొన్ని లాజిక్స్, పాత్రల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశాలు మరింత స్పష్టంగా ఉంటే బాగుండేది. మొత్తంగా పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఒక మంచి ఉద్దేశం ఉన్న సినిమా ఇది.
ప్లస్ పాయింట్స్ :
– బేబీ పరిణీత నటన
-మంచి కథాంశం
-ఎమోషనల్ సన్నివేశాలు
-నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ
– క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
-నెమ్మదిగా సాగే కథనం
-మరింత బలంగా ఉండాల్సిన స్క్రీన్‌ప్లే
ఫైనల్‌గా చెప్పాలంటే..
డాడ్స్ లిటిల్ ఫ్రెండ్.. పిల్లల మనసులోని భావోద్వేగాలను, తల్లిదండ్రుల ప్రేమ విలువను చాటిచెప్పే ఫ్యామిలీ డ్రామా. బేబీ పరిణీత నటన, ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథనంలో అక్కడక్కడా నెమ్మదించినా క్లైమాక్స్ మెప్పిస్తుంది. పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది.