SudhakarGoud Scholar First Look Out
యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి మహమ్మారిపై అవగాహన కల్పించడమే కాకుండా, వాటి బారిన పడినవారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలనే బలమైన సందేశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కాలర్’. కేవలం సందేశాత్మక అంశాలకే పరిమితం కాకుండా, కమర్షియల్ హంగులు, ఉత్కంఠభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిల్డ్రన్స్ డే సందర్భంగా ఘనంగా ఆవిష్కరించారు.
SudhakarGoud Scholar First Look Out
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో, న్యూజెర్సీకి చెందిన పొగాకు శిరీష మహేష్ సౌజన్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కౌశిక్, ప్రతిభా సిన్హా హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో పలు సందేశాత్మక బాలల చిత్రాలను రూపొందించిన డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
నవంబర్ 14న హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు బి.జి.ఆర్ మైనింగ్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూబ్లీహిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ చక్రవర్తి రెడ్డి, రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ పెంచల్ రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొని చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి కారణంగా ఎంతోమంది యువత జీవితాలు నాశనమవుతున్నాయని, అలాంటి పరిస్థితుల నుంచి యువతను కాపాడాలనే ఉద్దేశంతో ‘స్కాలర్’ కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. డ్రగ్స్‌కు బానిసలైన వారిని తిరిగి మామూలు మనుషులుగా మార్చేందుకు ఓ యువకుడు ప్రత్యేకమైన డ్రగ్‌ను కనిపెట్టడం, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఈ కథలోని ఆసక్తికరమైన అంశమని చెప్పారు.
అయితే, అతని ఆవిష్కరణతో డ్రగ్ మాఫియా ఆగ్రహానికి గురవుతుంది. ఆ ముఠా అతని కుటుంబాన్ని, చెల్లెలిని అంతం చేయడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక నేపథ్యాన్ని జోడిస్తూ డ్రగ్ మాఫియాపై హీరో సాగించే పోరాటం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించేలా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. త్వరలోనే షూటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
మరోవైపు, చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక బాధ్యతకు కూడా పెద్దపీట వేశారు. ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ఇతర పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెమెంటోలు, గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.