Mammootty DulquerSalmaan Box Office Clash
మలయాళ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి, ఆయన తనయుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ఈ ఇద్దరూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవంబర్ 20న మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘ఓం’ (O.M), దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలు విడుదలవుతున్నాయి. సాధారణంగా తండ్రీకొడుకుల సినిమాలు వేర్వేరు సమయాల్లో విడుదలవుతుంటాయి. కానీ ఈసారి ఇద్దరి సినిమాలు ఒకే రోజున థియేటర్లలోకి వస్తుండటంతో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Mammootty DulquerSalmaan Box Office Clash
ఇది కేవలం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాల విడుదల మాత్రమే కాదు.. రెండు విభిన్నమైన కథలు, రెండు భిన్నమైన సినిమా నేపథ్యాలు, రెండు తరాల నటీనటుల ప్రతిభ ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్న సందర్భం. అయితే ఈ పోటీని తండ్రీకొడుకుల మధ్య పోటీగా కాకుండా.. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన రెండు ఆసక్తికరమైన సినిమాల పండుగగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మమ్ముట్టి, దుల్కర్ ఇద్దరూ కేవలం మలయాళ ప్రేక్షకులకే పరిమితమైన నటులు కాదు. ఇద్దరికీ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఈ రెండూ సినిమాలు కూడా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ విడుదలకు సిద్ధమవుతున్నాయి.
మమ్ముట్టి, ధనుష్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం’ చిత్రానికి ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో ధనుష్ అండర్‌కవర్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. సాయిపల్లవి ఐపీఎస్ అధికారిణిగా నటిస్తుండగా.. మమ్ముట్టి కీలకమైన, బలమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
మరోవైపు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో రాబోతున్నారు. పవన్ సాధినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మధ్యతరగతి జీవితాలు, కలలు, ఆశయాల నేపథ్యంలో భావోద్వేగాలతో కూడిన కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ముఖ్యంగా ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయి వ్యోమగామి కావాలనే కలను నెరవేర్చుకునే ప్రయాణం ఈ కథలో కీలకంగా ఉండనుంది. సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయం అవుతుండగా, శ్రుతిహాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.