Software Engineer to Director SrinathChandrasekhar
టాలీవుడ్లో తెలంగాణ కథలు, తెలంగాణ యాస, ఇక్కడి మట్టివాసనతో కూడిన సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే ‘బలగం’, ‘పరేషాన్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు ఇదే బాటలో మరో తెలంగాణ దర్శకుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన శ్రీనాథ్ చంద్రశేఖర్ ‘చంద్రయాన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. నవంబర్ 13న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన తన సినీ ప్రయాణం, సినిమా కథ వెనుక ఉన్న ఆలోచనల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Software Engineer to Director SrinathChandrasekhar
“ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. సిద్దిపేట సమీపంలోని హుస్నాబాద్ నా స్వస్థలం. బీటెక్ చదువుతున్న సమయంలోనే ఛార్మి నటించిన ‘మంగళ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ తర్వాత ‘3G లవ్’ సినిమాకు దర్శకత్వ శాఖలో వర్క్ చేశాను”అని చెప్పారు.
అయితే సినిమా ప్రయాణం అంత సులభంగా సాగలేదని ఆయన వెల్లడించారు. కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, మ్యాథ్స్ ట్యూటర్‌గా పనిచేసినా.. సినిమాపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగాలను వదిలిపెట్టి పూర్తిస్థాయిలో ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారట. రచయితగా, ఘోస్ట్ రైటర్‌గా పలు సినిమాలతో పాటు ఈటీవీ, జెమిని, జీ టీవీ సీరియల్స్‌కు పనిచేశారు. దర్శకులు నీలకంఠ, కన్మణి దగ్గర కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇలా దాదాపు పదేళ్లకు పైగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు దర్శకుడిగా తన కలను నిజం చేసుకున్నానని చెప్పారు.
ఇక ‘చంద్రయాన్’ కథ ఆలోచన వెనుక కూడా ఒక ఆసక్తికరమైన సందర్భం ఉందట. తన ఊరిలో ఉన్నప్పుడే ఈ కథకు బీజం పడిందని శ్రీనాథ్ తెలిపారు. ప్రేమించిన అమ్మాయి ఇతరులతో పోలుస్తూ.. ‘నువ్వు ఏమీ చేయలేవా?’ అని ప్రశ్నిస్తే, ఆ కుర్రాడు ఏకంగా రాకెట్ తయారు చేసి చంద్రుడిపైకి వెళ్లాలని ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి కథ పుట్టిందని వివరించారు. అలా ఓ చిన్న ఆలోచనను తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక కథగా మలిచినట్లు చెప్పారు.

పల్లెటూరి కుర్రాళ్ల స్నేహాలు, వారి మధ్య జరిగే సరదా సంఘటనలు, ప్రేమ, గ్రామీణ జీవితంలోని మనుషులు.. వీటికి చంద్రుడిపైకి రాకెట్ పంపించే ప్రయత్నాన్ని జోడించి సినిమాను రూపొందించినట్లు తెలిపారు. నిజమైన లొకేషన్లలో చిత్రీకరణ చేయడం వల్ల తొలి సినిమాకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. సినిమా పూర్తయ్యాక దర్శకుడు వేణు ఉడుగుల చూసి నచ్చడంతో, ఆయనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకొచ్చారని వెల్లడించారు. తన తొలి సినిమాకు ఆయన అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
తన దగ్గర ఇప్పటికే మరికొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయని, ఒకరిద్దరు హీరోలకు కథలు కూడా వినిపించానని శ్రీనాథ్ తెలిపారు. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని, తదుపరి సినిమా ఖరారైన వెంటనే అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, ఇక్కడి జీవనశైలిని ప్రతిబింబిస్తూనే ప్రేక్షకులను అలరించే ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు.