NTR-Trivikram GodOfWar Movie Update
టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొల్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై తాజాగా ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ‘అరవింద సమేత’ తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేయనున్నట్లు ఐదు నెలల క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్‌తో కుమారస్వామి కథాంశం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.
NTR-Trivikram GodOfWar Movie Update
ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. అయితే ఇటీవల ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదలై ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో ఈ భారీ ప్రాజెక్టుపై సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతల నుంచి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తప్పుకోనుందని, నిర్మాణ సంస్థలో మార్పులు ఉండబోతున్నాయనే వార్తలు తెరపైకి వచ్చాయి.
ఈ ప్రచారానికి తెరదించుతూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ శుక్రవారం ఓ ఆసక్తికరమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు కలిసి ఉన్న ఈ ఫొటోతో ప్రాజెక్టుపై వస్తున్న సందేహాలకు స్పష్టత ఇచ్చింది. ఈ కాంబినేషన్లో ఎలాంటి మార్పులు లేవని, సినిమా అనుకున్నట్లుగానే ముందుకు సాగుతోందనే సంకేతాన్ని ఇచ్చింది.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ భారీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.
‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణ సంస్థ మార్పుపై వచ్చిన ప్రచారానికి ఫొటోతోనే సమాధానం ఇవ్వడంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే ఆసక్తి మరింత పెరిగింది.