Ram Pothineni 24-Hour Shoot for RaPo23
హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని డెడికేషన్
హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇప్పుడు దర్శకుడిగానూ మెగా ఫోన్ పట్టుకుని ‘RaPo23’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్న ఆయన, సినిమా కోసం అసాధారణ స్థాయిలో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
Ram Pothineni 24-Hour Shoot for RaPo23
ఇటీవల పుదుచ్చేరి శివార్లలో జరిగిన షూటింగ్లో రామ్ ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా పనిచేశారు. హీరోగా కెమెరా ముందు నటిస్తూనే.. దర్శకుడిగా కెమెరా వెనుక ఉండి సన్నివేశాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్, యాక్షన్, టెక్నికల్ అంశాలను పర్యవేక్షించారు.
‘RaPo23’ కోసం పుదుచ్చేరిలో భారీ స్థాయిలో ప్రత్యేకమైన సెటప్‌ను రూపొందించారు. దాదాపు తొమ్మిది రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. అయితే అనూహ్యంగా కురిసిన వర్షాల కారణంగా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో చిత్రబృందం హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. మిగిలిన సన్నివేశాలను అదే భారీ సెటప్‌లో పూర్తి చేసేందుకు త్వరలోనే యూనిట్ మరోసారి పుదుచ్చేరికి వెళ్లనుంది. ఇప్పటికే విడుదలైన సినిమా వివరాలు, రామ్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ‘RaPo23’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
డార్క్, ఇంట్రెస్టింగ్ నియో-నోయిర్ నేపథ్యంతో సాగే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథ, విజువల్స్, యాక్షన్‌కు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు (తిర్రు) కెమెరామెన్‌గా పనిచేస్తుండగా.. యాక్షన్ కొరియోగ్రఫీని పీటర్ హెయిన్, విక్రమ్ మోర్ కలిసి నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ కథకు తగ్గట్టుగా భారీ సెట్స్‌ను రూపొందిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.
హీరోగా, దర్శకుడిగా ఒకేసారి రెండు బాధ్యతలు నిర్వహిస్తూ రామ్ పోతినేని చూపిస్తున్న ఈ డెడికేషన్ ‘RaPo23’పై అంచనాలను మరింత పెంచుతోంది. సినిమా తారాగణం, పాత్రలు, తదుపరి షెడ్యూల్స్కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.