Ameer Log : A Raw & Real Family Entertainer
ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ద్వారా ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. హైదరాబాద్ బస్తీ జీవితాన్ని సహజత్వానికి దగ్గరగా చూపిస్తూ తెరకెక్కిన ఈ చిత్రానికి సింక్ సౌండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Ameer Log : A Raw & Real Family Entertainer
ఈ సందర్భంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ తన నేపథ్యం, సినిమాల్లోకి వచ్చిన విధానం, ‘అమీర్ లోగ్’ రూపకల్పన, సింక్ సౌండ్, రానా దగ్గుబాటి అందిస్తున్న సహకారం, సంగీతం, సెన్సార్ అనుభవం తదితర విషయాలను పంచుకున్నారు.
నల్గొండ నుంచి హైదరాబాద్.. ఆర్కిటెక్చర్ నుంచి సినిమాల వైపు
“మాది నల్గొండ జిల్లాలోని రాఘవపురం. 1997లోనే ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చాను. జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదివాను. చదువుకునే సమయంలోనే ఎక్కువగా సినిమాలు చూసేవాడిని. 2007లో సొంతంగా ఆఫీస్ ప్రారంభించాను. ఆర్కిటెక్చర్ ఇండస్ట్రీలో నాకు దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. కరోనా సమయంలో సొంత ఊరికి వెళ్లాను. అప్పట్లో ఖాళీ సమయం ఎక్కువగా ఉండటంతో ఓటీటీలో మరిన్ని సినిమాలు చూశాను. అప్పుడే సినిమాలపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది” అని తన నేపథ్యం గురించి తెలిపారు.
కథలు రాయడం ఇష్టం.. అలా సినిమాల వైపు అడుగులు
“నాకు కథలు చదవడం, రాయడం చాలా ఇష్టం. ఆరేడేళ్ల క్రితమే కథలు రాయడం ప్రారంభించాను. నా సొంత అనుభవాలు, నేను చూసిన సంఘటనల నుంచి ఎన్నో కథలు రాసేవాడిని. ఆ తర్వాత సినిమాల కోసం కథలు ఎలా రాయాలో ఓ స్నేహితుడి ద్వారా నేర్చుకున్నాను. యూట్యూబ్ ద్వారా కూడా కొంత తెలుసుకున్నాను. తర్వాత కొంతమంది స్నేహితుల సహాయంతో షూటింగ్ సెట్‌కు వెళ్లడం ప్రారంభించాను. అలా మెల్లగా సినిమాలతో నా జర్నీ మొదలైంది” అని చెప్పారు.
తొలి ప్రయత్నంగా షార్ట్ ఫిల్మ్
సినిమాకు ముందు తన తొలి ప్రయత్నం గురించి చెబుతూ.. “మూడేళ్ల క్రితం ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. రాత్రి కథ రాసి, ఉదయం షూటింగ్ చేసేశాం. ఊర్లో, సిటీలో కలిపి దాదాపు 33 నిమిషాల ఫుటేజ్ వచ్చింది. అవుట్‌పుట్ చూసిన తర్వాత ‘ఇలా కాదు.. ఇంకాస్త బాగా తీయాలి’ అనిపించింది. అప్పుడే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న తర్వాతే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. ఓ పాడ్‌కాస్ట్‌లో మనోజ్ బాజ్‌పేయి ‘అమీర్ లోగ్’ అనే పదాన్ని ఉపయోగించడం విన్నాను. ఆ పదం నన్ను ఆకట్టుకుంది. అక్కడి నుంచే ఈ సినిమా ప్రయాణం మొదలైంది” అన్నారు.
ముందుగా టైటిల్.. ఆ తర్వాత కథ
“ముందుగా ‘అమీర్ లోగ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత అసలు అమీర్ లోగ్ ఎవరు? అనే ఆలోచనతో రకరకాలుగా రాసుకున్నాను. ఓ బస్తీ, ముగ్గురు కుర్రాళ్లు అనే ఆలోచనతో కథను అభివృద్ధి చేశాను. హైదరాబాద్ బస్తీ జీవితాన్ని తెరపై అద్భుతంగా చూపించాలని అనుకున్నాను. రెండేళ్ల క్రితమే స్క్రిప్ట్ పూర్తయింది. చాలా మందితో చర్చించి, వారి సలహాలు తీసుకుని స్క్రిప్ట్‌ను మరింత మెరుగ్గా తయారు చేశాను. అనంతరం డెమో షూట్ చేసి చాలామందికి చూపించాం” అని తెలిపారు.
సహజత్వం కోసం సింక్ సౌండ్
‘అమీర్ లోగ్’లో సింక్ సౌండ్‌ను ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు రమణా రెడ్డి స్పందిస్తూ.. “ఆర్టిస్టులు ఎంతో సహజంగా నటించారు. కొంత డబ్బింగ్ కూడా చెప్పారు. కానీ సెట్లో నేను ఫీల్ అయిన అనుభూతి డబ్బింగ్ తర్వాత రాలేదు. సౌండింగ్ నాకు సెట్ కాలేదు. అందుకే సింక్ సౌండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి సినిమాకు ప్రతిదీ సహజంగా ఉండాలి. సెట్లు వేసే పరిస్థితి కూడా లేదు. బస్తీలోనే షూట్ చేయాలి. సింక్ సౌండ్‌తోనే ఆ సహజత్వం మరింత బాగా కనిపిస్తుందని భావించాను” అని చెప్పారు.
బస్తీలోనే 38 రోజుల షూటింగ్
“దాదాపు సినిమా మొత్తం బస్తీలోనే షూట్ చేశాం. డెమో షూట్‌తో కలిపి దాదాపు 43 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. అందులో బస్తీలోనే 38 రోజులు షూటింగ్ చేశాం. రాత్రి వేళల్లో షూటింగ్ చేయడం వల్ల బస్తీ ప్రజలు కాస్త ఇబ్బంది పడ్డారు” అంటూ నవ్వుతూ చెప్పారు.
రానా, స్పిరిట్ మీడియా సపోర్ట్ మరువలేనిది
రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా అందిస్తున్న సహకారం గురించి మాట్లాడుతూ.. “‘అమీర్ లోగ్’ సినిమాను స్పిరిట్ టీమ్‌కు చూపించాం. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బాగుందని చెప్పారు. సెకండాఫ్‌కు ఆడియెన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి రానా గారి టీమ్ అంతా చాలా సంతోషించారు. మాకు రానా గారు ఇస్తున్న సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మా సినిమా గురించి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. త్వరలోనే ఆయన మా సినిమాను కూడా చూస్తారు. ఆయన, స్పిరిట్ మీడియా అందిస్తున్న సహకారం మా చిత్రానికి ఎంతో బలాన్నిచ్చింది” అని అన్నారు.
హైదరాబాద్ యాసే ఉంటుంది
సినిమాలో హిందీ, ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉంటుందా అనే ప్రశ్నకు.. “మన హైదరాబాద్‌లో మాట్లాడినట్టుగానే సినిమాలో భాష ఉంటుంది. యాస మాత్రమే కనిపిస్తుంది. మన తెలుగు పదాల్లోనే ఉర్దూ పదాలు ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడు భాష అనేది అంతగా గుర్తుకు రాదు. సన్నివేశంలోని భావం అందరికీ అర్థమవుతుంది. ప్రేక్షకులందరికీ మా సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను” అని చెప్పారు.
‘ఝుండ్’, ‘గల్లీబాయ్’ చిత్రాలతో పోల్చారు
‘అమీర్ లోగ్’కు వస్తున్న స్పందన గురించి మాట్లాడుతూ.. “ఇప్పటికే సినిమాను చాలా మందికి చూపించాను. ఇటీవల చాలామంది దర్శకులు, నటులకు కూడా చూపించాం. దర్శకుడు వీఎన్ ఆదిత్య గారు ‘అమీర్ లోగ్’ను మెచ్చుకున్నారు. రైటింగ్ అద్భుతంగా ఉందని ఆయన ఇచ్చిన ప్రశంసను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఝుండ్’, రణ్వీర్ సింగ్ నటించిన ‘గల్లీ బాయ్’ చిత్రాలతో మా సినిమాను పోల్చారు. అలాంటి ప్రశంసలు రావడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
సినిమాలో 10 పాటలు.. కీరవాణి పాట ప్రత్యేక ఆకర్షణ
‘అమీర్ లోగ్’ సంగీతం గురించి చెబుతూ.. “స్మరణ్‌ను మొదట ఓ దావత్ సాంగ్ ఇవ్వమని అడిగాను. కానీ సినిమా చూసిన తర్వాత ఎక్కడెక్కడ పాటలు ఉంటే బాగుంటుందో ఆయనే సూచించారు. అలా సినిమాకు 10 అద్భుతమైన పాటలు వచ్చాయి. లిరిసిస్టులు మనోజ్, నిఖిలేష్ మంచి సాహిత్యాన్ని అందించారు. కీరవాణి గారు పాడిన పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ పాట దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని నమ్ముతున్నాను” అని తెలిపారు.
ప్రతి పాత్రకు ప్రాధాన్యత.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
సెన్సార్ అనుభవం గురించి మాట్లాడుతూ.. “సెన్సార్ నుంచి నాలుగైదు చోట్ల మ్యూట్ చేయాలని చెప్పారు. అంతకుమించి పెద్దగా మార్పులు సూచించలేదు. సినిమాలో ప్రతి ఒక్క పాత్ర మెయిన్ క్యారెక్టర్లా ఉంటుంది. ప్రతి పాత్ర కోణంలో నుంచి కథ కనిపిస్తుంది. ఆర్టిస్టులకు నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. దాంతో వాళ్లు కూడా సెట్లో కొన్ని డైలాగ్స్‌ను ఇంప్రవైజ్ చేశారు. ఆ సహజత్వం సినిమాలో బాగా కనిపిస్తుంది. ‘అమీర్ లోగ్’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది” అని దర్శకుడు రమణా రెడ్డి సోమ తెలిపారు.