Venkatesh Maha’s ‘Attahasam’ First Look
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘కేరాఫ్ కంచెరపాలెం’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాకు ‘అట్టహాసం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Venkatesh Maha’s ‘Attahasam’ First Look
‘క’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, మహాయాన బ్యానర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చింతా వినీషా రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ‘అట్టహాసం’ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే.. రెండు జంటలు కనిపిస్తుండగా, వారి జీవితాల్లోని రెండు విభిన్నమైన ఆకాంక్షలను ప్రతిబింబించేలా ‘మాకు మోక్షం కావాలి..’, ‘మాకు ఉద్యోగం కావాలి..’ అనే క్యాప్షన్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు మాటల వెనుక ఉన్న కథేంటి? ఈ రెండు జంటలకు సినిమాతో ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు ఫస్ట్ లుక్ చూసిన వెంటనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

సాధారణ మనుషుల జీవితాలు, వారి ఆశలు, సమస్యలు, భావోద్వేగాలను సహజత్వానికి దగ్గరగా చూపించడంలో వెంకటేష్ మహా తనదైన శైలిని ఇప్పటికే చూపించారు. అదే తరహాలో ‘అట్టహాసం’ కూడా రియల్, రూటెడ్, ఆంథెంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమాలో వినోదంతో పాటు సమాజాన్ని ప్రతిబింబించే అంశాలకు కూడా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో దర్శకుడు వెంకటేష్ మహాతో పాటు కార్తీక్ రత్నం, పావని కరణం, స్రవంతి పీపకాయల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
‘అట్టహాసం’ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. స్క్రిప్ట్, దర్శకత్వ బాధ్యతలను వెంకటేష్ మహా నిర్వహిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాది సమ్మర్లో ‘అట్టహాసం’ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఫస్ట్ లుక్‌తోనే కథపై క్యూరియాసిటీ పెంచిన ‘అట్టహాసం’.. థియేటర్లలో ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.