టాలీవుడ్ చరిత్రలో స్పెషల్ డే.
మహేష్ సూపర్ హిట్ కొట్టినరోజే.. ప్రభాస్ ఇండస్ట్రీ హిట్..
తెలుగు సినిమా చరిత్రలో (ఏప్రిల్ 28) ఈరోజు స్పెషల్ డే. ఒకేరోజు రెండు మైల్ స్టోన్ మూవీస్‌గా నిలిచాయి. ఒకటి స్టార్‌డమ్‌ను తిరగరాసిన సినిమా, మరొకటి ఇండస్ట్రీ హద్దులను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. ‘పోకిరి’, ‘బాహుబలి: ది బిగినింగ్’.. ఈ రెండు చిత్రాలు విడుదలైన తేదీ ఒకటే కావడం, వాటి ప్రభావం వేర్వేరు దశల్లో తెలుగు సినిమాను మరో స్టేజ్‌కు తీసుకెళ్లాయి.
‘‘పోకిరి” : స్టార్డమ్కు కొత్త అర్ధం చెప్పిన రోజు (ఏప్రిల్ 28, 2006)
మహేష్ బాబు కెరీర్లోనే కాకుండా టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న మాస్ కమర్షియల్ ఫార్ములాను పూర్తిగా మార్చేసింది. ఈ చిత్రంలో మహేష్ బాబు చూపించిన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, అటిట్యూడ్ అన్నీ కలిపి ఒక కొత్త మాస్ హీరోని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. “ఎవడు కొడితే డిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు..” లాంటి డైలాగులు అప్పట్లో యూత్‌ను ఊపేశాయి. దీని ప్రభావం బాక్సాఫీస్పైనా చూపించింది. టాలీవుడ్లో సరికొత్త కలెక్షన్ రికార్డులు
చేరాయి. రీమేక్‌లతో ఇతర భాషల్లోనూ ఈ చిత్రం సెన్సేషన్ సాధించింది. మహేష్ బాబును స్టార్ నుంచి సూపర్ స్టార్ స్థాయికి తీసుకెళ్లిన మైలురాయిగా చెప్పుకోవచ్చు. “పోకిరి” తర్వాత మాస్ సినిమాల టోన్ పూర్తిగా మారింది. హీరో క్యారెక్టర్ డిజైన్, స్టైలింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కొత్తగా మారాయి.
“బాహుబలి” : తెలుగు సినిమాను ప్రపంచానికి తీసుకెళ్లిన ఘనత (ఏప్రిల్ 28, 2015)
ప్రభాస్ కెరీర్‌ను మాత్రమే కాదు, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ ఎపిక్, టాలీవుడ్‌కు గ్లోబల్ గుర్తింపును తెచ్చింది. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ స్టోరీ ఇవన్నీ కలగలిసిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించింది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
విడుదల సమయంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి.. పాన్ ఇండియా కాన్సెప్ట్‌కు బలమైన బేస్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు అందుకుంది. “బాహుబలి” తర్వాత తెలుగు సినిమా మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. హిందీ మార్కెట్లో కూడా టాలీవుడ్ సినిమాలకు భారీ డిమాండ్ వచ్చింది.
ఈ రెండు చిత్రాలతో మారిన టాలీవుడ్ ఫేజ్
“పోకిరి” ముందు టాలీవుడ్ మాస్ సినిమాలు ఒక రేంజ్లో ఉంటే, “పోకిరి” తర్వాత అవి స్టైలిష్‌గా మారాయి. అదే విధంగా “బాహుబలి” ముందు తెలుగు సినిమా ప్రధానంగా ప్రాంతీయంగానే ఉండగా, “బాహుబలి” తర్వాత అది గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. హీరోల కెరీర్లపైనా బలంగా ప్రభావం చూపింది. మహేష్ బాబు స్టైలిష్ మాస్ ఐకాన్‌గా స్థిరపడగా, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.
ఒకే రోజు.. రెండు సినిమాలు.. రెండు యుగాలు.
పోకిరి తెలుగు సినిమాకు “మాస్ డెఫినిషన్” మార్చితే, బాహుబలి: ది బిగినింగ్ “స్కేల్” అనే పదానికి కొత్త అర్ధం చెప్పింది.
ఈ రెండు సినిమాలు కలిసి చూస్తే టాలీవుడ్ ఎలా ఎదిగిందో, ఎలా ప్రపంచాన్ని ఆకర్షించిందో స్పష్టంగా తెలుస్తుంది.







