కెరీర్ టర్నింగ్ పాయింట్స్
పదహారేళ్ల సినీ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు చూసిన సమంత రుత్ ప్రభు పుట్టినరోజు నేడు. 1987 ఏప్రిల్ 28 న చెన్నైలో జన్మించిన సమంత, మోడలింగ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తొలి చిత్రం ‘ఏం మాయ చేశావే’ చిత్రంతోనే టాలీవుడ్లో మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ తర్వాత ఈగ, దూకుడు, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో ఇటు సౌత్‌తోపాటు అటు నార్త్‌లోనూ పాగా వేసింది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సమంత ఈరోజు 39వ పడిలోకి అడుగుపెట్టింది. ప్రతి ఏడాది ఆమె పుట్టినరోజు అభిమానులకు ఒక వేడుకలా మారుతుంది. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రయాణం, విజయాలు, సవాళ్లు, మరియు కొత్త దిశలపై ఒక విశ్లేషణాత్మక కథనం ఇస్తూ సమంతకు పింక్విల్లాతెలుగు.కామ్ బర్త్‌డే విషెస్ తెలియజేస్తుంది.
సమంత కెరీర్లో ప్రత్యేకత ఆమె పాత్రల ఎంపికలో కనిపిస్తుంది. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఆధారిత చిత్రాలను కూడా ఎంచుకుంది. ఓవైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే, మరోవైపు రంగస్థలం లాంటి సినిమాల్లో గ్రామీణ యువతిగా మహానటి చిత్రంలో సపోర్టింగ్ రోల్, సూపర్ డీలక్స్ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్‌తో తనదైన వైవిధ్యాన్ని చూపించింది.
అలాగే ఫిమేల్ లీడ్ మూవీస్‌తోనూ మెప్పించింది. ఓ బేబీ, యశోద వంటి చిత్రాల్లో సమంత ప్రధాన పాత్ర పోషించి బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు అందుకుంది. ఇది ఆమెను లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఒక బలమైన ఎంపికగా నిలిపింది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్లింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా సమంత తన సత్తా చాటింది. ది ఫ్యామిలీమేన్ సీజన్ 2 సిరీస్‌లో
రాజీ పాత్రలో ఆమె నటించిన తీరు నేషనల్ వైడ్‌గా గుర్తింపును తీసుకొచ్చింది. ఈ పాత్ర ఆమె కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్‌గా మారింది. తమిళనాడులో పుట్టి పెరిగినప్పటికీ, తెలుగు, తమిళ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. తన సొంత డబ్బింగ్ కూడా చాలా చిత్రాలకు ఆమె చెప్పుకున్నారు. సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుండి వచ్చి, ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా, స్వశక్తితో టాప్ స్టార్‌గా ఎదిగింది.
వ్యక్తిగత జీవితం మరియు సవాళ్లు
సమంత కేవలం స్టార్ హీరోయిన్గా మాత్రమే కాకుండా, అనేక ఆసక్తికరమైన, తెలియని కోణాలను తన జీవితంలో కలిగి ఉన్నారు. కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ, ఆమె జీవితంలో ఎగుడుదిగుడులు (విడాకులు, అనారోగ్యం) ఉన్నా, ధైర్యంగా ముందుకు వెళ్లడం ఆమెలోని ప్రత్యేకతకు నిదర్శనం. ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగింది. ఈ విషయాల్లో ఆమె చూపిన ధైర్యం అభిమానులకు ప్రేరణగా నిలుస్తోంది. సమంత తీవ్రమైన అనారోగ్య సమస్య అయిన మయోసైటిస్‌తో బాధపడుతున్నా, దేనికీ వెరవకుండా తన పని తాను చేసుకుపోతూ అందరికీ ఇన్స్పైరింగ్గా నిలిచింది. అలాంటి కష్టకాలంలో కూడా ఆమె చిరునవ్వుతో, ధైర్యంగా పోరాడుతున్న విధానం చాలామందికి తెలియని ఆమె వ్యక్తిత్వంలోని బలమైన కోణంగా నిలుస్తుంది. అలాగే సమంతకు సేవా దృక్పథం కూడా ఎక్కువే. ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అభాగ్యులకు, అనారోగ్యంతో ఉన్న పిల్లలకు, మహిళలకు అండగా నిలుస్తున్నారు.
ఇక నాగచైతన్యను 2017లో వివాహం చేసుకుని నాలుగేళ్ల తర్వాత, 2021 అక్టోబర్‌లో వారు విడాకులు తీసుకుంది. తర్వాత దర్శకుడు రాజ్ నిడిమోరును 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో వివాహం చేసుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్: హనీ బన్నీ ప్రాజెక్టుల సమయంలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంతకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం సమంత పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పాన్-ఇండియా స్థాయిలో తన స్థాయిని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. కథా ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ, కొత్త జానర్లను అన్వేషిస్తోంది. ప్రస్తుతం సమంత లీడ్‌గా నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో నటిస్తుంది. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 15న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
సాధారణ హీరోయిన్గా మొదలై, తనదైన నటనతో ఎనలేని స్టార్డమ్ తెచ్చుకున్న సమంత జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానులు మాత్రమే కాదు, సినీ పరిశ్రమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఆమె నుంచి ఇంకా ఎన్నో అద్భుతమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ పింక్విల్లాతెలుగు.కామ్ ఆమెకు మరోసారి బర్త్‌డే విషెస్ తెలియజేస్తుంది.







