Producer Bandla Ganesh Gets Jail Term
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. రూ.95 లక్షల విలువైన చెక్ చెల్లకపోవడంతో దాఖలైన కేసులో ఒంగోలు కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఏడాది జైలు శిక్ష విధించడంతో పాటు రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా బాధితుడి కోర్టు ఖర్చులను కూడా భరించాలని తీర్పులో పేర్కొంది.
Producer Bandla Ganesh Gets Jail Term
వివరాల్లోకి వెళితే.. 2018లో జరిగిన ఓ ఆర్థిక లావాదేవీ ఈ వివాదానికి కారణమైంది. ప్రకాశం జిల్లాకు చెందిన జానకి రామయ్య వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అయితే జానకి రామయ్య మరణానంతరం ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లు ఈ మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బండ్ల గణేశ్ అప్పు చెల్లింపునకు సంబంధించి రూ.95 లక్షల చెక్కును ఆయనకు అందజేశారు.
అయితే, ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో బౌన్స్ అయింది. దీంతో పలుమార్లు డబ్బు కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో జెట్టి వెంకటేశ్వర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ వ్యవహారంపై ఒంగోలు కోర్టులో విచారణ కొనసాగుతోంది.
తాజాగా కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం బండ్ల గణేశ్‌ను దోషిగా తేల్చింది. ఏడాది జైలు శిక్ష విధిస్తూ, రూ.95 లక్షలు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతానని ఆయన వెల్లడించారు.