NivethaThomas Srimathi Trailer
పెళ్లి.. కొత్త జీవితం.. కొత్త బంధాలు.. ఎన్నో బాధ్యతలు. కానీ వీటి మధ్య ఓ మహిళకు తనకంటూ ఉండే ఆశలు, ఆశయాలు, కలలకు చోటు ఉంటుందా? ఇదే ఆసక్తికరమైన ప్రశ్నతో రూపొందిన చిత్రం ‘శ్రీమతి’. నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ జీ5 ఒరిజినల్ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
కొత్తగా పెళ్లైన మధుశ్రీ పాత్రలో నివేదా థామస్ కనిపించగా, ఆమె భర్త వాసుదేవ్‌గా తిరువీర్ నటించారు. పెళ్లి తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టిన ఓ అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం చేయాలనే కోరికకు ఎదురయ్యే ప్రశ్నలు.. ఇలా ఒక సాధారణ గృహిణి జీవితంలోని భావోద్వేగాలను ట్రైలర్లో చూపించారు. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత కూడా మహిళకు తనకంటూ ఓ వ్యక్తిత్వం, లక్ష్యాలు ఉంటాయనే విషయాన్ని ఈ కథ బలంగా ప్రశ్నిస్తోంది.
కుటుంబ బంధాలు, సమాజపు ఆలోచనా ధోరణులు, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు విశ్వక్ ఖండేరావు తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నివేదా థామస్ నటనతో పాటు తిరువీర్, హరితేజ, రేణూ దేశాయ్, గోపరాజు రమణ తదితరుల పాత్రలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. ఇందులో రేణూ దేశాయ్ డ్యాన్స్ మెంటర్ పాత్రలో కనిపించనున్నారు.
NivethaThomas Srimathi Trailer
కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రఫీ అందించగా, ఈ.ఎల్. విశ్వనాథ్ సంగీతం సమకూర్చారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా వ్యవహరించారు. కేవలం వినోదానికే పరిమితం కాకుండా మహిళల జీవితంలోని ఓ ముఖ్యమైన అంశాన్ని చర్చకు తీసుకొచ్చేలా ‘శ్రీమతి’ రూపొందినట్లు ట్రైలర్ హింట్ ఇస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 4 నుంచి జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.