Phule: A Story of Revolution : Ponnam Ravichandra
సమాజంలో మార్పు రావాలంటే ముందుగా ఆలోచనల్లో మార్పు రావాలి. విద్యతోనే ఆ మార్పు సాధ్యమని నమ్మి, ఎన్నో అవమానాలు, అడ్డంకులను ఎదుర్కొని సామాజిక సంస్కరణల కోసం జీవితాంతం పోరాడిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే. ముఖ్యంగా మహిళలకు విద్య అందించేందుకు వారు చేసిన కృషి భారతీయ సామాజిక చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనది. అలాంటి గొప్ప జీవిత ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ‘ఫూలే’ చిత్రం నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Phule: A Story of Revolution : Ponnam Ravichandra
కేవలం ఒక చారిత్రక బయోపిక్‌గా కాకుండా, నేటి తరానికి అవసరమైన సామాజిక సందేశంతో ఈ సినిమా రూపొందింది. కులవివక్ష, అంటరానితనం, మహిళలపై ఆంక్షలు, సామాజిక అసమానతలపై ఫూలే దంపతులు సాగించిన పోరాటాన్ని ఈ చిత్రం ప్రధానంగా చూపించనుంది. సుమారు రెండు శతాబ్దాల క్రితం వారు ఎదుర్కొన్న పరిస్థితులు, సమాజంలో మార్పు కోసం చేసిన త్యాగాలు నేటి ప్రేక్షకులను ఆలోచింపజేయనున్నాయి.
ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రతీక్ గాంధీ జ్యోతిరావ్ ఫూలేగా, పత్రలేఖ సావిత్రిబాయి ఫూలేగా నటించారు. సుపదా క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి డా. పొన్నం రవిచంద్ర నిర్మాత. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు వెర్షన్‌కు చేతన్ కత్తి మాటలు అందించారు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ఫూలే దంపతుల సేవలు, మహిళా విద్య కోసం వారు చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో నిర్వహించిన ప్రెస్మీట్లో విమలక్క, పసునూరి రవీందర్, డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్రానికి మద్దతు తెలిపారు.
మహిళలు చదువుకోవాలనే ఆలోచన కూడా నిషేధంగా భావించిన రోజుల్లో విద్య కోసం ఉద్యమించిన సావిత్రిబాయి ఫూలే గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని విమలక్క పేర్కొన్నారు. ఫూలే జీవితాన్ని తెరపైకి తీసుకురావడం అభినందనీయమని అతిథులు కొనియాడారు.
నవంబర్ 26న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నట్లు నిర్మాత పొన్నం రవిచంద్ర తెలిపారు. ఇందులో ప్రతీక్ గాంధీ పాల్గొననున్నారు. నవంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రం ద్వారా ఫూలే దంపతుల పోరాటం, ఆశయాలు మరింతమందికి చేరువ కావాలని చిత్రబృందం ఆకాంక్షిస్తోంది.