Legendary Actor Giribabu Passes Away
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాలకు పైగా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన గిరిబాబు మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Legendary Actor Giribabu Passes Away
సినిమాలంటే చిన్నప్పటి నుంచే పిచ్చి
ప్రకాశం జిల్లా రావినూతల గ్రామానికి చెందిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయనకు చిన్నతనం నుంచే సినిమాలంటే ఎనలేని ఆసక్తి. గ్రామంలోని టూరింగ్ టాకీస్‌లో ఎక్కువ సమయం గడుపుతూ సినిమాలు చూడటంతో అందరూ ఆయన్ని సినిమా పిచ్చోడని పిలిచేవారట. సినిమాలపై ఆసక్తితో పాటు నాటకాలపైనా మక్కువ పెంచుకున్న ఆయన సొంతంగా నాటక సమాజాన్ని కూడా నిర్వహించారు.
నటుడిగా వెండితెరపై వెలిగిపోవాలన్న బలమైన కోరికతో మద్రాసు చేరుకున్న గిరిబాబు అక్కడ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నటుడు మోహన్‌బాబుతో ఆయనకు పరిచయం ఏర్పడింది. 1969లో ఇద్దరూ చెరో రూ.20 వేసుకుని, నెలకు రూ.40 అద్దె ఉన్న ఓ చిన్న గదిలో ఉంటూ సినిమా అవకాశాల కోసం పోరాడారు. ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఎన్నో కష్టాలను అధిగమించి సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
‘జగమే మాయ’తో సినీ రంగ ప్రవేశం
హీరో కావాలనే కలతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన గిరిబాబు ఎన్నో ప్రయత్నాల తర్వాత 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. తొలినాళ్లలో హీరోగా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, విలన్ పాత్రలే ఆయనకు విశేష గుర్తింపును తీసుకొచ్చాయి. గంభీరమైన స్వరం, పదునైన సంభాషణలు, విలక్షణమైన హావభావాలతో తెరపై ఆయన కనిపిస్తే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి కలిగేది. కేవలం ప్రతినాయకుడిగానే కాకుండా హాస్యం, భావోద్వేగం, క్యారెక్టర్ రోల్స్‌లోనూ తనదైన ముద్ర వేశారు.
ఐదు దశాబ్దాలు.. 650కు పైగా సినిమాలు
దాదాపు ఐదు దశాబ్దాలుగా సాగిన తన సినీ ప్రయాణంలో గిరిబాబు 650కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి దిగ్గజ నటుల నుంచి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తదితర స్టార్ హీరోల వరకు మూడు తరాల నటులతో కలిసి తెరను పంచుకున్నారు. అన్నదమ్ముల అనుబంధం, కరుణామయుడు, కాళి, పసివాడి ప్రాణం, హలో బ్రదర్, సిసింద్రీ, అతడు, భైరవ ద్వీపం, నిన్నే పెళ్లాడతా, నువ్వే కావాలి, ఖడ్గం, గమ్యం, గీత గోవిందం వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. పాత్ర ఏదైనా తనదైన శైలిలో ఒదిగిపోయి మెప్పించడం గిరిబాబు ప్రత్యేకత. చివరిగా ఆయన నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2023లో విడుదలైంది. ఇలా తరాలు మారుతున్నా తన నటనతో కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఆయన చేరువయ్యారు.
సూపర్ స్టార్ కృష్ణతో ప్రత్యేక అనుబంధం
గిరిబాబు సినీ జీవితంలో సూపర్ స్టార్ కృష్ణతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. కృష్ణతో కలిసి ఆయన 150కి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్య కేవలం సినిమా పరిచయమే కాకుండా మంచి స్నేహబంధం కూడా ఉండేది. 1987లో విడుదలైన ‘దొంగోడు వచ్చాడు’ చిత్రంలో గిరిబాబు విలన్‌గా నటించారు. ఈ సినిమా విజయం సాధిస్తుందని ముందుగానే అంచనా వేసిన కృష్ణ.. సినిమా 14 వారాలు ఆడితే అందులో నాలుగు వారాలు తన వల్ల, మిగిలిన పది వారాలు గిరిబాబు కామెడీ, నటన వల్లే ఆడుతుందని చెప్పారట. అంతేకాదు, సినిమా విజయం సాధించిన తర్వాత స్వయంగా ఫోన్ చేసి గిరిబాబును అభినందించారట. ఓ సూపర్ స్టార్ మరో నటుడి ప్రతిభను ఇంత గొప్పగా గుర్తించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటన వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది.
నటుడిగానే కాదు.. దర్శక నిర్మాతగానూ సత్తా
నటనతోనే తన ప్రయాణాన్ని పరిమితం చేసుకోకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా గిరిబాబు తన ప్రతిభను చాటుకున్నారు. సింహగర్జన, మెరుపుదాడి, ఇంద్రజిత్ వంటి చిత్రాలతో పాటు దాదాపు పది సినిమాలను నిర్మించారు. అలాగే రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుకున్నా వంటి సుమారు ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇలా నటన, నిర్మాణం, దర్శకత్వం.. చిత్ర పరిశ్రమలోని పలు విభాగాల్లో తనదైన ముద్ర వేశారు.
తండ్రి బాటలోనే కుమారులు
గిరిబాబు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన భార్య శ్రీదేవి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు రఘుబాబు, బోసుబాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో రఘుబాబు ప్రస్తుతం టాలీవుడ్లో ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. మరో కుమారుడు బోసుబాబు తండ్రి దర్శకత్వం వహించిన ‘ఇంద్రజిత్’ (1990) చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నిమజ్జనం, చెమ్మచెక్క, స్టంట్ మ్యాన్ వంటి చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. అయితే ఈ సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆయన నటనకు దూరమయ్యారు.
వెండితెరపై చెరగని ముద్ర
హీరోగా ఎదగాలనే కలతో మద్రాసు వెళ్లి, విలన్‌గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న గిరిబాబు ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఐదు దశాబ్దాల పాటు 600కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, వెండితెరపై పోషించిన విలక్షణమైన పాత్రలు, గుర్తుండిపోయే సంభాషణలు, అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.