Devisriprasad Exclusive Interview
ఒక గ్రామం మొత్తం మాట్లాడలేక, కేవలం పాటల రూపంలోనే మాట్లాడుకునే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘సింగ్ గీతం’. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూన్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ఇలా ముచ్చటించారు.
Devisriprasad Exclusive Interview
సింగీతం గారితో కలిసి పనిచేసిన అనుభవం గురించి?
సింగీతం గారికి నేను వీరాభిమానిని. ఆయన ఒక లెజెండ్. -సింగీతం గారు చేసిన ప్రయోగాలు మరెవ్వరూ చేసి ఉండరు. పుష్పక విమానం, భైరవద్వీపం, ఆదిత్య 369 వంటి చిత్రాలు నాకు చాలా ఇష్టం. చాలా ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారితో జీసస్‌పై ఒక సినిమా అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ సమయంలో సింగీతం గారు మా స్టూడియోకు వచ్చి ‘సింగ్ గీతం’ ఐడియా చెప్పారు. అది వినగానే నాకు చాలా థ్రిల్‌గా అనిపించింది. ఎప్పుడైనా ఆ సినిమా చేయాలని అనిపించింది. ఇప్పటికి అది కుదిరింది. తర్వాత నాగ్ అశ్విన్, స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో మరింత ఆనందం కలిగింది. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సింగీతం గారికి ఒక ట్రిబ్యూట్‌లా, ఆయనతో కలిసి పనిచేయడం ఒక బ్లెస్సింగ్‌లా అనిపించింది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
‘సింగ్ గీతం’ కథలో ప్రత్యేకత ఏమిటి?
-సింగీతం గారు ఎప్పుడూ ట్రెండ్‌కి తగ్గట్టు కథలు ఆలోచించలేదు. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే అది ఇంతకుముందు రానిది, తర్వాత కూడా రానిదిగా ఉంటుంది. ఆయన చేసిన సినిమాలన్నీ గమనిస్తే అలాంటివే. పుష్పక విమానం ఇప్పటికీ చాలా అడ్వాన్స్డ్ సినిమా. 50 ఏళ్ల తర్వాత చూసినా కొత్తగా అనిపిస్తాయి. ఈ ఐడియా కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఒక గ్రామం మొత్తం మాటలకన్నా పాటల ద్వారానే సంభాషించుకునే కాన్సెప్ట్ చాలా కొత్తది. ఇది కేవలం కామెడీ లేదా మ్యూజికల్ సినిమా మాత్రమే కాదు. ఇందులో బలమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. సింగీతం గారి ఆలోచన ఎంత ముందుందో ఈ సినిమా చూస్తే మరోసారి అర్థమవుతుంది.
ఈ సినిమా మ్యూజిక్ పరంగా ఎంత ఛాలెంజింగ్‌గా అనిపించింది?
నా కెరీర్లోనే ఇది అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సినిమాలో ప్రతి డైలాగ్‌ను సంగీత రూపంలోకి మార్చాల్సి వచ్చింది. సాధారణ సినిమాల్లో డైలాగ్ మారితే సర్దుబాటు చేయవచ్చు. కానీ ఇక్కడ ఒక్క పదం మారినా మొత్తం మ్యూజిక్ స్ట్రక్చర్ మారిపోతుంది. అందుకే ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాం.
ఈ ప్రయాణంలో మీకు ఉపయోగపడిన అనుభవం ఏదైనా ఉందా?
చిన్నప్పటి నుంచి ప్రతి అక్షరాన్ని సంగీతంగా మార్చే అలవాటు నాకు ఉండేది. తెలిసో తెలియకో అదే ఈ సినిమాకు ఉపయోగపడింది. ఒక సీన్ తీసుకుని మ్యూజికల్‌గా చేసి వినిపించాను. అది విని సింగీతం గారు చాలా సంతోషించారు. “మనకు కావాల్సిన మ్యూజిక్ ఇదే” అన్నారు. అది నాకు పెద్ద కాంప్లిమెంట్‌గా అనిపించింది. ఇలాంటి సినిమా చేసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది.
సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత మీ అభిప్రాయం?
మేమంతా కలిసి సినిమా చూసినప్పుడు మరోసారి సింగీతం గారి విజన్‌కు ఫిదా అయిపోయాం. ప్రతి డైలాగ్ పాట రూపంలో ఉన్నా అది చాలా సహజంగా అనిపిస్తుంది. కొద్దిసేపటికి ప్రేక్షకులు ఇది మ్యూజికల్ సినిమా అన్న విషయమే మర్చిపోయి కథలో లీనమైపోతారు.
Devisriprasad Exclusive Interview
ప్రేక్షకులు ఏం ఆశించవచ్చు?
‘సింగ్ గీతం’ కచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. సినిమా పూర్తయ్యాక కూడా ప్రేక్షకులు సరదాగా మాటలను పాటల్లా పాడుకుంటూ వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం గారు చూపించిన సృజనాత్మకత అందరికీ స్ఫూర్తినిస్తుంది.
కమల్ హాసన్ గారు ఈ సినిమా చూశారని తెలిసింది..ఆయన స్పందన ఎలా ఉంది?
ఆయన సినిమా చూసి చాలా సంతోషించారు. “ఇలాంటి సినిమాలో నేను కూడా భాగమై ఉండాల్సింది” అని చెప్పడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ అప్డేట్?
‘ఎల్లమ్మ’ పనులు ఎంతో వేగంతో సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పాటలు పూర్తి చేశాను. ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కంపోజ్ చేశాను. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మంచి కథ. ప్రస్తుతం మరిన్ని వివరాలు చెప్పలేను.