Ameer Log Movie Review
చిత్రం : అమీర్ లోగ్
రేటింగ్ : 2.75/5
నటీనటులు : ఎం.సి. హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు
బ్యానర్: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్
నిర్మాత : మాధవి రెడ్డి సోమ
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : రమణారెడ్డి సోమ
సంగీత దర్శకుడు : స్మరణ్ సాయి
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : ఎస్వీకే
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
విడుదల తేదీ: 20 ఆగస్టు 2026
Ameer Log Movie Review
కథ విషయానికొస్తే :
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఓ బస్తీలో శ్రీను (ఎం.సి. హరి), ఫరూక్ (మనోజ్), మల్లేష్ (శశిధర్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. పనిపాటలు లేకుండా కాలం గడుపుతూ, చిన్న చిన్న గొడవలు చేసుకుంటూ తమదైన లోకంలో జీవిస్తుంటారు. అయితే వీరి నిర్లక్ష్య జీవనశైలి కారణంగా ఇంట్లో వాళ్లు ఎప్పటికప్పుడు మందలిస్తూ ఉంటారు. అదే బస్తీలో ఉండే గీత (వేద జలంధర్) ఈ ముగ్గురిని తన తమ్ముళ్లలా భావించి జీవితంలో ఎదగాలని, బాధ్యతగా ఉండాలని సలహా ఇస్తుంది. ఆమె మాటలతో శ్రీను ఉద్యోగంలో చేరగా, మిగిలిన ఇద్దరిలోనూ మార్పు తీసుకురావాలనే ప్రయత్నం మొదలవుతుంది. ఇదే సమయంలో క్రికెట్ మ్యాచ్, బస్తీ వర్సెస్ ఆఫీస్ టీమ్ పోటీ, ఆ తర్వాత కథలో కీలకంగా మారే బిర్యానీ ఎపిసోడ్ వీరి జీవితాన్ని మరో మలుపు తిప్పుతాయి. చాచా పాత్ర, గీత జీవితంలోకి వచ్చే రవి కారణంగా ఈ ముగ్గురు స్నేహితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరికి వారు తమ జీవితాల్లో సెటిల్ అయ్యారా? అన్నదే ‘అమీర్ లోగ్’ కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
సినిమాకు ప్రధాన బలం ముగ్గురు యువ నటులే. ఎం.సి. హరి, మనోజ్, శశిధర్ తమ పాత్రల్లో సహజంగా కనిపించారు. ముఖ్యంగా స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాల్లో వీరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. బస్తీ యువకుల బాడీ లాంగ్వేజ్, మాటతీరు, అల్లరి స్వభావాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. వేద జలంధర్ పాత్రకు ఉన్న పరిమితిలో చక్కగా నటించింది. గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, కథలో ఒక మార్పుకు కారణమయ్యే పాత్రలో కనిపించడం విశేషం. చాచాగా విశ్వేందర్ రెడ్డి కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకుంటారు. రావణ్ నిట్టూరు, సాయియోగి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. కొత్త నటీనటులు, లోకల్ టాలెంట్‌కు అవకాశం ఇవ్వడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు.

టెక్నీకల్ టీమ్ గురించి..
దర్శకుడు రమణారెడ్డి సోమ చాలా సింపుల్ పాయింట్‌ను హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంతో చెప్పే ప్రయత్నం చేశారు. కథ కొత్తది కాకపోయినా, లోకల్ ఫ్లేవర్‌తో నడిపించడం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కథకు బలం చేకూరుస్తాయి. స్మరణ్ సాయి అందించిన పాటలు వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కొన్ని కీలక సన్నివేశాలకు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఎస్వీకే కెమెరా పనితనం హైదరాబాద్ బస్తీ వాతావరణాన్ని తెరపై సహజంగా చూపించడంలో ఉపయోగపడింది. రియల్ లొకేషన్స్ ఈ సినిమాకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రికెట్ ఎపిసోడ్లో కొన్ని షాట్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది.
సినిమా ఎలా ఉందంటే..
‘అమీర్ లోగ్’ పూర్తిగా మాస్ కమర్షియల్ సినిమా కాదు, అలాగే చాలా కొత్త కథతో వచ్చే ప్రయోగాత్మక సినిమా కూడా కాదు. ఇది ముగ్గురు సాధారణ బస్తీ యువకుల జీవితాల్లో వచ్చే మార్పును, స్నేహాన్ని, కుటుంబ బంధాలను, వారి ఎదుగుదలను సింపుల్‌గా చెప్పే ప్రయత్నం. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, వారి అల్లరి, బస్తీ జీవితం మీద ఎక్కువ సమయం తీసుకోవడంతో కథ నెమ్మదిగా సాగిన ఫీలింగ్ వస్తుంది. అయితే హీరోల జీవితాల్లో మార్పు మొదలయ్యే దగ్గర నుంచి కథ కాస్త వేగం అందుకుంటుంది. క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో బిర్యానీ చుట్టూ తిరిగే ఎపిసోడ్స్‌తో పాటు ఎమోషన్, కామెడీ కలగలిసి కథను ముందుకు తీసుకెళ్తాయి. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తే, మరికొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్ కూడా కథకు ఓ మంచి ముగింపు ఇస్తూనే, భవిష్యత్తులో మరో భాగానికి అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే సినిమాలో తెలుగు కంటే హిందీ, ఉర్దూ సంభాషణలు ఎక్కువగా ఉండటం అందరికీ ఒకే స్థాయిలో కనెక్ట్ కాకపోవచ్చు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కల్చర్‌కు అలవాటున్న ప్రేక్షకులకు ఇది ప్లస్ అయితే, ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు కొన్ని చోట్ల అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్
ముగ్గురు ప్రధాన నటుల సహజమైన నటన
స్నేహం, ఎమోషన్
క్రికెట్ ఎపిసోడ్
సెకండాఫ్‌లో వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు
పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
లోకల్ ఫ్లేవర్‌తో తెరకెక్కిన కథనం
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథాంశం
కొన్ని అనవసరంగా సాగిన సన్నివేశాలు
హిందీ, ఉర్దూ డైలాగ్స్ ఎక్కువగా ఉండటం
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘అమీర్ లోగ్’ – బస్తీ ఫ్లేవర్, స్నేహం, ఎమోషన్, బిర్యానీతో కూడిన ఓ సింపుల్ ఎంటర్టైనర్.