RaviTeja Irumudi Movie Review Telugu
చిత్రం : ఇరుముడి
రేటింగ్ : 3/ 5 ⭐⭐⭐
నటీనటులు : మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ తదితరులు
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవి శంకర్
కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : శివ నిర్వాణ
సంగీత దర్శకుడు : జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : విష్ణు శర్మ
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
విడుదల తేదీ : 21 ఆగస్టు 2026
RaviTeja Irumudi Movie Review Telugu
కథ విషయానికొస్తే :
కుటుంబం అంటే ప్రాణం పెట్టే ఓ సాధారణ వ్యక్తి జీవితం ఒక్క సంఘటనతో ఊహించని మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా తన కూతురితో అతనికున్న అనుబంధం, ఆమె కోసం అతను చేసే పోరాటం కథకు ప్రధాన బలంగా నిలుస్తుంది. పొల్లూరులో త్రినాథ్ (రవితేజ)కి అరటి తోట ఉంది. భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర) అలియాస్ మణెమ్మలే త్రినాథ్‌కి లోకం. త్రినాథ్ ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేస్తుంటాడు. దీక్షలో ఉన్నంతసేపు 41 రోజులు మందు ముట్టకుండా ఉంటాడు. దీక్ష విరమించిన దగ్గర్నుంచీ ఎప్పుడూ మందులోనే ఉంటాడు. అయినప్పటికీ కుటుంబాన్ని ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఆడ పిల్లల జోలికొస్తే మాత్రం ఎంతటివారినైనా ఇరగదీస్తాడు. కూతురుని గారాబంగా చూసుకునే త్రినాథ్ తను 5వ తరగతి పాస్ అయ్యిందని ఊరంతా భోజనాలు పెడతాడు. అయితే హై స్కూల్‌కి వెళ్లాలంటే సీలేరు వెళ్లాల్సి రావడంతో ఊ ఊరికి బస్ వచ్చిన తర్వాతే అక్కడికి పంపుతాను అంటాడు. అప్పుడు గురుస్వామి గోపరాజు (సాయి కుమార్) ఈ సమస్యపై మాట్లాడటానికి స్థానిక ఎమ్మెల్యే (రమేష్ ఇందిరా)ను కలిసి సమస్యను వివరిస్తాడు. దీంతో వెంటనే ఊ ఊరికి బస్ వెళ్లేలా చేసి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చెబుతాడు. దీంతో ఊర్లో అమ్మాయిలు వేరే ఊరికి వెళ్లి హైస్కూల్ చదువుకుంటారు. అయితే సడెన్‌గా ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ తర్వాత బస్‌లో అమ్మాయిలను కొందరు కుర్రాళ్ల వేధించడంతో మణియమ్మ చెబుతుంది. వారిని చితకబాదుతాడు త్రినాథ్. గురుస్వామి కూతురు గాయత్రి పదో క్లాస్ చదువుతుంది. ఆమెకి మెరిట్ స్టూడెంట్ అని టీచర్ స్పెషల్ క్లాస్‌లు చెబుతుంది. అంతకు ముందే ఆ టీచర్ ఒక అమ్మాయిని చితకబాదినందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మళ్లీ రావడంతో స్టూడెంట్స్ భయపడుతుంటారు. గాయత్రి కూడా భయపడుతుంది. ఎక్స్ ట్రా క్లాస్ లు అని గాయత్రిని ఇంటికి పిలిపించుకుంటుంది. మరి ఇంటికి పిలిపించి ఆ టీచర్ ఏం చేసింది? టీచర్ని చూసి ఇతర అమ్మాయిలు ఎందుకు స్కూల్ మానేశారు. గాయత్రి రోజూ ఎందుకు టెన్షన్ పడుతుంది? ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఎమ్మెల్యేలోని మరో రూపం ఏంటి? గాయత్రికి సంబంధించి, టీచర్‌కి సంబంధించి, ఎమ్మెల్యేకి సంబంధించి మణియమ్మ చూసిన నిజం ఏంటి? ఆ విషయాన్ని తండ్రి త్రినాథ్‌కి చెప్పిందా? గురుస్వామి పాత్రలోని ట్విస్ట్ ఏంటి? ఆ తర్వాత ఎలాంటి ఆసక్తికర, భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయి? కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగిలిన కథ.

నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
రవితేజను చాలా కాలం తర్వాత కేవలం మాస్ యాక్షన్ హీరోగా కాకుండా, ఎమోషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలో చూడొచ్చు. తన కూతురి కోసం తపించే తండ్రిగా ఆయన నటన సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కొన్ని సన్నివేశాల్లో రవితేజ తన ఎనర్జీతో పాటు మంచి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా తండ్రీ–కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. బేబీ నక్షత్ర పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుంది. ఆమె, రవితేజ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ఎమోషనల్ వెయిట్ తీసుకొచ్చింది. ప్రియా భవానీ శంకర్ తన పాత్ర పరిధిలో సహజంగా నటించింది. గురుస్వామి పాత్రలో సాయి కుమార్ తన అనుభవాన్ని మరోసారి చూపించారు. సినిమా ప్రారంభంలో స్వాసిక పాత్రలో మరింత డెప్త్ ఉండేలా చూపించారు కానీ.. అంతలా వర్కవుట్ అవదు. ఇక ఎమ్మెల్యేగా నటించిన రమేష్ ఇందిర గ్రే షేడ్‌లో కనిపించారు. మిగతా నటీనటులు కథకు అవసరమైన మేర తమ పాత్రలకు న్యాయం చేశారు. అజయ్ ఘోష్, కిషోర్ కంచెరపాలెం తదితరులు తమ పాత్రలతో సినిమాకు సహకరించారు.
టెక్నీకల్ టీమ్ గురించి..
దర్శకుడు శివ నిర్వాణ ఈసారి తనకు పరిచయమైన ఎమోషనల్ స్పేస్‌లోనే కథను నడిపించినప్పటికీ, తండ్రీ–కూతుళ్ల అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కథలోని భావోద్వేగాలే సినిమాకు అసలు డ్రైవింగ్ ఫోర్స్‌గా మారాయి. అయితే కొన్ని చోట్ల కథనం మరింత బిగుతుగా ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు మంచి ప్లస్. ముఖ్యంగా నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తుంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు మంచి అందాన్ని తీసుకొచ్చింది. కొన్ని కీలక సన్నివేశాలను ఆయన కెమెరా వర్క్ మరింత ప్రభావవంతంగా చూపించింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓవరాల్‌గా బాగానే ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని సన్నివేశాలకు కాస్త ట్రిమ్మింగ్ అవసరమనే భావన కలుగుతుంది. నిర్మాణ విలువలు మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.

సినిమా ఎలా ఉందంటే..
‘ఇరుముడి’ పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ కంటే ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఫ్యామిలీ డ్రామా. రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే హై ఎనర్జీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక బలమైన తండ్రీ–కూతుళ్ల అనుబంధాన్ని దర్శకుడు శివ నిర్వాణ చూపించే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభ భాగం పాత్రలు, వాటి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ కొంత నెమ్మదిగా సాగుతుంది. కానీ కథ అసలు ఎమోషనల్ పాయింట్లోకి వెళ్లిన తర్వాత ఆసక్తి పెరుగుతుంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. ముఖ్యంగా రవితేజ పాత్రకు సంబంధించిన కీలక ఘట్టాలు సినిమాకు బలం. అయ్యప్ప స్వామి మాల నేపథ్యం ఉన్నప్పటికీ కథను ఎమోషనల్‌గా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. తండ్రీ కూతుళ్ల బాండింగ్, కూతుళ్లను ఎలా పెంచాలని చూపించే సన్నివేశాలు మనుసుకు హత్తుకుంటాయి. తన ఆడ పిల్లలో తన కూతురుని చూసుకునే బలహీనత ఉందని రవితేజ చెప్పే డైలాగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. అయితే కథనం కొన్ని చోట్ల ఊహించదగ్గ విధంగా సాగడం, కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి లాగినట్టు అనిపించడం మైనస్‌గా మారాయి. కమర్షియల్ అంశాలు, ఎమోషనల్ డ్రామా మధ్య మరింత మెరుగైన బ్యాలెన్స్ ఉంటే సినిమా ఇంకో స్థాయిలో ఉండేది.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్
తండ్రీ–కూతుళ్ల అనుబంధం
బేబీ నక్షత్ర పాత్ర, నటన
కొన్ని మనసుకు హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలు
క్లైమాక్స్ ట్విస్ట్
జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
కొన్ని చోట్ల ఊహించదగ్గ స్క్రీన్‌ప్లే
ఇంత థ్రిల్లర్‌లో ఒక పోలీస్ పాత్ర కూడా కనిపించకపోవడం
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘ఇరుముడి’ ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.