Srikanth Daughter Megha Makes Her Acting Debut
టాలీవుడ్లో మరో స్టార్ డాటర్ హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. నటులు శ్రీకాంత్, ఊహల కుమార్తె మేధ మేక హీరోయిన్గా వెండితెరకు పరిచయం అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభం కానుంది. జై జాస్తి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.
Srikanth Daughter Megha Makes Her Acting Debut
మార్కెటింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన మేధ, ‘మైత్రీ ఇన్ లవ్’తో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తున్న మేధ.. తన తొలి సినిమాతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తల్లిదండ్రుల సినీ అనుభవం ఆమెకు నేపథ్యంగా ఉండగా, నటిగా తనదైన గుర్తింపు సంపాదించుకోవడం ఆమె ముందున్న లక్ష్యం.
‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి భారీ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్.. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలోనూ ముందుంటోంది. గతంలో ‘ఉప్పెన’తో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను పరిచయం చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు జై జాస్తి, మేధ మేకలను కొత్త జంటగా ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి. క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాలతో గుర్తింపు పొందిన మహేష్ బాబు పి. భాగస్వామ్యం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది.


ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో జై జాస్తి, మేధ మేక జంటగా అందంగా కనిపిస్తున్నారు. జైను ఆప్యాయంగా హత్తుకుని ప్రేమగా చూస్తున్న మేధ.. తన చిరునవ్వుతో ఆకట్టుకుంటున్నారు. క్యాజువల్ లుక్‌లో జై కనిపిస్తుండగా, ఇద్దరి మధ్య సహజంగా కనిపిస్తున్న కెమిస్ట్రీ పోస్టర్‌కు రొమాంటిక్ టచ్‌ను తీసుకొచ్చింది. కొత్త జంటగా వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందనే ఆసక్తిని ఈ ఫస్ట్ లుక్ పెంచుతోంది.
‘30 వెడ్స్ 21’, ‘మిడిల్ బెంచ్ రవి’ వంటి పాపులర్ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు పొందిన పృథ్వీ వనం.. ఈ సినిమాతో ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేమ, హాస్యం, కుటుంబ భావోద్వేగాలను మేళవిస్తూ నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఈ రొమాంటిక్ కామెడీని రూపొందిస్తున్నారు.
రామజోగయ్య శాస్త్రి తనయుడు సాయి హర్ష ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సహజమైన భావోద్వేగాలు, ఆసక్తికరమైన కథనంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తెరకెక్కనుంది.
తాజాగా నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. సాహు గారపాటి, అర్చన కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నందిని రెడ్డి క్లాప్ కొట్టారు. సౌమ్య యెర్నేని తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.