January 12 Vidudala Venky Anil KalyanRam
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్‌కు జంటగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
January 12 Vidudala Venky Anil KalyanRam
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా తనకు కలిసొచ్చిన సంక్రాంతికే రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన అనిల్ రావిపూడి.. తాజాగా తన మార్క్ ఎంటర్టైనింగ్ వీడియోతో బుధవారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఈ వీడియో ద్వారా ప్రకటించారు. ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన కామెడీ టచ్‌తో రూపొందించారు. ముఖ్యంగా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో కనిపించే చమత్కారమైన డైలాగ్స్, కామెడీ టైమింగ్‌ను గుర్తు చేసేలా వీడియోను తీర్చిదిద్దడం ఆకట్టుకుంటోంది.
వీడియోలో ‘‘ఏ అప్పారావు?’’ అని అడగ్గా.. ‘‘ఏ. అప్పారావు’’ అని చెప్పే సన్నివేశం నవ్వులు పూయిస్తుంది. ఇదే తరహాలో ఈవీవీ మార్క్ కామెడీని గుర్తు చేసే పలు సరదా సన్నివేశాలతో టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను ఆసక్తికరంగా రూపొందించారు.
ఇక అసలు హైలైట్ విషయానికి వస్తే.. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతిశెట్టి కలిసి అనిల్ రావిపూడిని సినిమా పేరు ఏంటని అడుగుతారు. అందుకు అనిల్ రావిపూడి మాత్రం ‘‘జనవరి 12 విడుదల’’ అని చెబుతారు. దీంతో వారు అది రిలీజ్ డేట్.. సినిమా పేరు చెప్పమని అడుగుతారు. అయినా అనిల్ రావిపూడి పదే పదే ‘‘జనవరి 12 విడుదల’’ అని చెప్పడంతో అక్కడ కామెడీ మరింత పండుతుంది. అంతేకాదు.. ‘సంక్రాంతికి వచ్చే మన సినిమా పేరు.. జనవరి 12 విడుదల’ అంటూ బావ బామ్మర్ది సౌజన్యంతో అనే సరదా క్యాప్షన్‌తో ఈ టైటిల్‌ను ప్రకటించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టైటిల్ విషయంలోనే ఇంత క్రియేటివిటీ చూపించిన అనిల్ రావిపూడి.. ఇక సినిమా మొత్తం ఏ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
వెంకటేష్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్కు తోడు కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతిశెట్టి వంటి నటీనటుల కాంబినేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన వెంకటేష్, కళ్యాణ్ రామ్ లుక్స్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఈ టైటిల్ రివీల్ చేసినదానిబట్టి.. ఇందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బామ్మర్దిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈవీవీ సత్యనారాయణ చమత్కారాలను గుర్తు చేసేలా అనిల్ రావిపూడి చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి సంక్రాంతి బరిలో ‘జనవరి 12 విడుదల’ ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.