Vedha Jalandhar Interview About Ameer Log
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నటి వేధా జలంధర్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు.
Vedha Jalandhar Interview About Ameer Log
“నేను 2019లోనే నా కెరీర్‌ను ప్రారంభించాను. నేను నటించిన రెండు సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు వెళ్లాయి. అయితే అవి రిలీజ్ కాలేదు. ఆ తర్వాత యాక్టింగ్‌పై మరింత పట్టు సాధించేందుకు థియేటర్ కూడా నేర్చుకున్నాను. యాక్టింగ్ నేర్చుకుంటూ, సినిమాలు చేస్తూ సాగుతున్న ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది. ‘అమీర్ లోగ్’లో నేను పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రలో నటించాను. మహిళలకు స్ఫూర్తినిచ్చేలా నా పాత్ర ఉంటుంది. మా అమ్మే నాకు పెద్ద స్ఫూర్తి. ఈ సినిమాలోని పాత్ర కూడా ఆమెను గుర్తు చేస్తుంది. ముక్కుసూటిగా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మా అమ్మ నుంచే నేర్చుకున్నాను. నా పాత్రలోనూ అదే లక్షణాలు కనిపిస్తాయి.
‘అమీర్ లోగ్’లో అవకాశం రావడం కూడా ఆసక్తికరంగానే జరిగింది. ‘తిమ్మరాజుపల్లి టీవీ’లో నేను చేసిన పని గురించి మా దర్శకుడు రమణ గారికి తెలియదు. బషీర్ మాస్టర్ ఈ సినిమా ఆడిషన్స్ గురించి చెప్పడంతో నేను ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడ నేను బాగా పర్ఫామ్ చేయడంతో రమణ గారు వెంటనే నన్ను ఓకే చేశారు. ఇప్పటికే సినిమా చూసినవాళ్లంతా నా పాత్ర గురించి మాట్లాడుతున్నారు. నా వర్క్ అందరికీ నచ్చుతోంది. నేను ఒకటి, రెండు సినిమాలే చేసినా నన్ను గుర్తుపడుతున్నారు. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేయాలని అనుకుంటున్నాను. అందుకే చాలా ఆచితూచి పాత్రలను ఎంచుకుంటున్నాను. ‘అమీర్ లోగ్’లో బిర్యానీకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. సినిమాలో బిర్యానీది మెయిన్ పాత్ర అని చెప్పొచ్చు. కథలో ఆ ఎలిమెంట్ చాలా బాగా కుదిరింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సింక్ సౌండ్‌తో పనిచేయడం అంత సులభం కాదు. నేను ఇంతకుముందే సింక్ సౌండ్‌తో ఒక ఫీచర్ ఫిల్మ్‌కి పనిచేశాను. మనం ఎంత ప్రొఫెషనల్‌గా ఉన్నా చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ కూడా రికార్డ్ అవుతుంటాయి. సెట్లో కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు అందరూ అద్భుతంగా సహకరించారు. బస్తీ వాసులు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రమణ గారి అత్తగారి ఏరియా కావడంతో మరింత ఎక్కువగా సహకరించారు.
‘అమీర్ లోగ్’లో ప్రతి క్యారెక్టర్‌కీ ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని పాత్రలతోనూ ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. హరి, మనోజ్, శశిలతో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. సెట్లో అందరం కలిసి సరదాగా షూటింగ్ చేశాం. దర్శకుడు రమణరెడ్డి గారు మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రతి సీన్ ఎలా ఉండాలి, ఎలా కావాలి అన్నది చాలా క్లియర్‌గా వివరించేవారు. మేం డెమో షూట్ కూడా చేశాం. మాధవి రెడ్డి గారు పుట్టి పెరిగిన ఏరియాలోనే షూటింగ్ జరిగింది. అక్కడ కూడా మమ్మల్ని అందరూ ఎంతో బాగా చూసుకున్నారు. మా డీఓపీ గారు చాలా తక్కువ మాట్లాడతారు కానీ పని మాత్రం అద్భుతంగా చేస్తారు. స్మరణ్ గారి మ్యూజిక్ మా సినిమాను పది మెట్లు పైకి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మేం సీన్స్‌లో చూపించలేని కొన్ని ఎమోషన్స్‌ను ఆయన బీజీఎంతో అద్భుతంగా ఎలివేట్ చేశారు. ఆయన మ్యూజిక్ సినిమాకు చాలా కీలకం.
మా సినిమాను స్పిరిట్ మీడియా టీమ్ చూసి ఎంతో అభినందించింది. మా ప్రీమియర్ చూసిన వీఎన్ ఆదిత్య గారు కూడా చాలా మెచ్చుకున్నారు. రెగ్యులర్ పాత్రల్లా కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యే పాత్రలు ఉన్నాయని చెప్పారు. రమణ గారి రైటింగ్, మా పర్ఫామెన్స్ చక్కగా సింక్ అయ్యాయని ప్రశంసించారు. భాష, యాస వల్ల మా సినిమాకు ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే ఎమోషన్ అనేది అందరికీ కామన్. ఏ ప్రాంతంలో ఉన్నా భావోద్వేగాలు ఒకేలా ఉంటాయి. అందుకే ‘అమీర్ లోగ్’ అన్ని వర్గాల ప్రేక్షకులను, అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా.
ఆరేళ్లలో ఒకటి, రెండు సినిమాలే రిలీజ్ అయ్యాయనే బాధ నాకు లేదు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి అనేదానికంటే ప్రేక్షకులు మనల్ని ఎంతగా యాక్సెప్ట్ చేశారు, ఎలాంటి పాత్రలను ఎంచుకుంటున్నామనేదే ముఖ్యమని నేను భావిస్తాను. నా ఆరేళ్ల జర్నీలో నేను చేసిన పాత్రలు నాకు సంతృప్తినిచ్చాయి. మనం చేసిన సినిమాల్లో ఎన్ని రిలీజ్ అవుతాయనేది పూర్తిగా మన చేతుల్లో ఉండదు”అని వేధా జలంధర్ తెలియజేశారు.