Ram Pothineni Heartfelt Gesture for Fan Shashi
కొన్ని అభిమానాలు కేవలం సినిమా తెర వరకే పరిమితం కావు. అభిమాన హీరోపై ఉండే ప్రేమ, ఒకరి జీవితంలో ఆశగా మారినప్పుడు ఆ బంధానికి అర్థం మరింత గొప్పగా మారుతుంది. అలాంటి హృదయాన్ని కదిలించే సంఘటనే శశి విషయంలో చోటుచేసుకుంది. తన అభిమాన హీరో రామ్ పోతినేనితో మాట్లాడాలన్న ఆమె చిన్న కోరికను తెలుసుకున్న రామ్.. స్వయంగా వీడియో కాల్ చేసి ఆమెను పలకరించడమే కాకుండా, త్వరలో కలుస్తానంటూ భరోసా ఇచ్చారు.
Ram Pothineni Heartfelt Gesture for Fan Shashi
రెండేళ్ల క్రితం వరకు శశి కూడా మిగతా పిల్లల్లాగే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ గడిపేది. అయితే పదో తరగతిలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఫిట్స్ రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో ఆమె సాధారణ జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో చురుగ్గా కనిపించిన శశి.. ఇప్పుడు కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంటూ అనారోగ్యంతో పోరాడుతోంది.
ఈ పరిస్థితుల్లోనూ ఆమె మనసులో మాత్రం ఒక అభిమానం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అది హీరో రామ్ పోతినేనిపై ఉన్న ప్రేమ. చిన్నప్పటి నుంచే రామ్ అంటే శశికి ఎంతో ఇష్టం. ఆయన పాటలు వినడం, ఫొటోలు చూడటం ఆమెకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పటికీ రామ్ పాట వినిపించినా, ఆయన ఫొటో కనిపించినా శశి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కూతురి ఆరోగ్య పరిస్థితిని చూసి ఆ తల్లి పడుతున్న బాధ వర్ణించలేనిది. అయినప్పటికీ శశి మనసులో ఉన్న చిన్న కోరికను తీర్చాలనే ప్రయత్నాన్ని మాత్రం ఆమె ఆపలేదు. ప్రతిరోజూ రామ్ పోతినేని రీల్స్, వీడియోలు చూపిస్తూ.. “రామ్ నీకోసమే వీడియో కాల్ చేశారు” అంటూ కూతురికి భోజనం పెట్టే సందర్భాలు వారి అనుబంధంలోని భావోద్వేగాన్ని తెలియజేస్తాయి.
ఇలా ఉండగా.. తన అభిమాన హీరోతో ఒక్కసారి మాట్లాడాలన్న శశి కోరిక రామ్ పోతినేని దృష్టికి వెళ్లింది. విషయం తెలుసుకున్న రామ్ స్పందించిన తీరు ఆమె కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తింది. శశితో వీడియో కాల్లో మాట్లాడిన ఆయన ఆప్యాయంగా పలకరించి, త్వరలోనే తనను కలుస్తానని మాట ఇచ్చారు.
అంతేకాదు.. శశి ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు. మందులు, భోజనం సమయానికి తీసుకోవాలని సూచిస్తూ.. “త్వరగా రికవరీ అవ్వాలి. హైదరాబాద్ నుంచి నీకు మందులు, ఫుడ్ పంపిస్తాను” అంటూ ధైర్యం చెప్పారు.
రామ్ చెప్పిన ఈ మాటలు శశికి కేవలం ఓ సినీ హీరో పలికిన మాటలు కాదు. తన అభిమాన హీరో స్వయంగా తనతో మాట్లాడటం.. త్వరలో కలుస్తానని మాట ఇవ్వడం.. ఆమెకు ఒక కొత్త ఉత్సాహాన్ని, ఆశను అందించిన క్షణాలు.
తెరపై హీరోలు పోషించే పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. కానీ నిజ జీవితంలో ఓ అభిమాని బాధను అర్థం చేసుకుని, ఆమె కోరికను గౌరవించి, ఆమెకు ధైర్యం చెప్పడం మాత్రం మానవత్వానికి అసలైన అర్థాన్ని చూపిస్తుంది.
అభిమానం అనేది ఏకపక్షం కాదని.. ఒక్కోసారి ఓ హీరో చూపించే చిన్న స్పందన కూడా ఓ అభిమాని జీవితంలో ఎంతటి వెలుగును నింపగలదో శశి కథ మరోసారి గుర్తుచేస్తోంది. రామ్ పోతినేని చేసిన ఈ మానవీయ ప్రయత్నం.. అభిమానం ముందు అనారోగ్యం కూడా ఓడిపోవాలనే ఆశను నింపే అందమైన ఉదాహరణగా నిలిచింది.