Newton’s Third Law Telugu Movie Review
చిత్రం: న్యూటన్స్ థర్డ్ లా
రేటింగ్: 1.75/5
నటీనటులు: సుమంత్, జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, నేహా పఠాన్, రవివర్మ తదితరులు
సమర్పణ: ఈటీవీ విన్
నిర్మాత: కె. హరీష్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేష్ కర్ణ
సంగీతం: సింజిత్ యర్రమిల్లి
సినిమాటోగ్రఫీ: వేదవ్యాస్ గొట్టిపాటి
ఎడిటింగ్: పి. అనిల్ కుమార్
విడుదల: 31 జూలై 2026
Newton’s Third Law Telugu Movie Review
కథ విషయానికొస్తే..
సిక్కింలోని జులుక్లో ‘న్యూటన్స్ థర్డ్ లా పార్ట్-1’ అనే పుస్తకాన్ని చదువుతున్న డేవిడ్ అలియాస్ కిషోర్ (అవసరాల శ్రీనివాస్)తో సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కథ 1999లోకి వెళ్తుంది. ఒకే సమయంలో రెండు విషాదకర ఘటనలు చోటుచేసుకుంటాయి. భర్త మరణ వార్త తెలుసుకుని కూతురు శ్రావ్యతో కలిసి తణుకు బయలుదేరిన జ్యోతి (నేహా పఠాన్) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతుంది. మరోవైపు అపార్ట్మెంట్ టెర్రస్‌పై ఫోన్ మాట్లాడుతున్న వినయ్ (త్రినాథ్ వర్మ) అనుమానాస్పద పరిస్థితుల్లో కిందపడి చనిపోతాడు. మొదట ఇది ప్రమాద మరణంగానే కనిపించినా, పోస్ట్‌మార్టంలో వినయ్ తలలో బుల్లెట్ బయటపడటంతో కేసు ఊహించని మలుపు తిరుగుతుంది. దీంతో విచారణ బాధ్యతలు చేపట్టిన పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్) ఈ కేసు వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభిస్తాడు. దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ప్రతి పాత్రపై అనుమానాలు పెరుగుతాయి. గతంలో జరిగిన సంఘటనలు, దాచిపెట్టిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. చివరికి వినయ్, జ్యోతి మరణాల వెనుక అసలు కారణం ఏమిటి? మెర్క్యూరీ (జగపతి బాబు) పాత్ర ఈ ఘటనలతో ఎలా ముడిపడి ఉంది? కార్తీక్ (గౌతమ్ పండిట్)కు వినయ్‌తో ఉన్న విభేదాల వెనుక నిజం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
సుమంత్ తన పాత్రను చాలా అండర్ప్లేగా చేశారు. పోలీస్ అధికారిగా అవసరమైన సీరియస్‌నెస్ చూపించినా… పాత్రకు బలమైన ఎమోషనల్ లేదా హీరోయిజం మూమెంట్స్ లేకపోవడంతో గుర్తుండిపోయే అవకాశం దక్కలేదు. జగపతిబాబు స్క్రీన్‌పై కనిపించేది చాలా తక్కువసేపే. అయినా ఆయన ప్రెజెన్స్ సినిమాకు కొంత వెయిట్ తీసుకొస్తుంది. అయితే ఆయన పాత్రను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. అవసరాల శ్రీనివాస్‌కు కూడా పరిమిత స్క్రీన్ టైమ్ మాత్రమే ఉంది. నేహా పఠాన్ డ్యూయల్ షేడ్‌లో కనిపిస్తారు. త్రినాథ్ వర్మ మాత్రం తన పాత్రలో బాగానే నటించాడు. సాధారణ యువకుడిగా, మరోవైపు నేర ప్రపంచంలోకి వెళ్లిన వ్యక్తిగా రెండు కోణాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. రవి వర్మ, షెల్లీ ఎన్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధిలో ఓకే అనిపిస్తారు.
టెక్నికల్‌గా ఎలా ఉంది?
రాజేష్ కర్ణ దగ్గర మంచి కథ ఉంది. కానీ ఆ కథను తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం విఫలమయ్యాడు. క్రైమ్ థ్రిల్లర్‌కు స్క్రీన్‌ప్లేనే ప్రాణం. అదే ఇక్కడ బలహీనంగా మారింది. సినిమాటోగ్రఫీ సహజంగా ఉండే ప్రయత్నం చేసింది. అయితే నిర్మాణ విలువలు చాలా చోట్ల తక్కువగా కనిపిస్తాయి. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి సాగిన భావన కలుగుతుంది. సింజిత్ యెర్రమిల్లి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కొంత టెన్షన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ సౌండ్ మిక్సింగ్ సరిగా లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ పూర్తిగా వర్క్ అవ్వలేదు.
సినిమా ఎలా ఉందంటే..
క్రైమ్ థ్రిల్లర్ అంటే ప్రేక్షకుడు ప్రతి సీన్ తర్వాత ఒక ప్రశ్న వేసుకోవాలి… “ఇప్పుడు ఏం జరుగుతుంది?” అని. అదే జానర్‌కు అసలు బలం. కానీ ‘న్యూటన్స్ థర్డ్ లా’ ఆ ఆసక్తిని మొదటి నుంచి చివరి వరకు నిలబెట్టలేకపోయింది. కథలో ట్విస్టులు ఉన్నాయి. అనుమానాస్పద పాత్రలు ఉన్నాయి. హత్య మిస్టరీ ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది. కానీ ఇవన్నీ పేపర్‌పై మాత్రమే బాగుంటాయి. తెరపైకి వచ్చేసరికి ఎలాంటి ఉత్కంఠను కలిగించవు. ఒక్కో క్లూ బయటపడుతున్నా ప్రేక్షకుడిలో ఎగ్జైట్మెంట్ కనిపించదు. ట్విస్ట్ రివీల్ అయినా ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే స్క్రీన్‌ప్లే దానికి అవసరమైన బిల్డ్అప్ ఇవ్వలేదు. ప్రతి కీలక సన్నివేశం ఫ్లాట్‌గా వెళ్లిపోతుంది. మరో సమస్య ఏమిటంటే… పాత్రల మధ్య భావోద్వేగాలు కూడా బలంగా కనెక్ట్ కావు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నా అవి హృదయాన్ని తాకవు. విలన్ ట్రాక్ కూడా పెద్దగా ప్రభావం చూపదు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని ట్విస్టులు వచ్చినా అప్పటికే సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది. చివర్లో ఇచ్చిన వివరణ కూడా పెద్దగా సంతృప్తిని ఇవ్వదు.
అందుకే సినిమా పూర్తయ్యాక గుర్తుండేది కథ కాదు… మిస్ అయిన అవకాశమే.
ప్లస్ పాయింట్స్
సుమంత్, త్రినాథ్ వర్మ నటన
జగపతిబాబు స్క్రీన్ ప్రెజెన్స్
మైనస్ పాయింట్స్
ఎంగేజ్ చేయని స్క్రీన్‌ప్లే
పేలవమైన ట్విస్టుల ప్రజెంటేషన్
నెమ్మదైన నేరేషన్
బలహీనమైన ఎమోషన్స్
ప్రొడక్షన్ వాల్యూస్
షార్ప్‌నెస్ లేని ఎడిటింగ్
ఫైనల్‌గా…
‘న్యూటన్స్ థర్డ్ లా’లో క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నా.. వాటితో ప్రేక్షకుడిని కుర్చీలో కట్టిపడేసేలా మలచలేకపోయారు. మంచి మిస్టరీని ఉత్కంఠభరితమైన అనుభవంగా మార్చాల్సిన చోట, సాధారణ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా మిగిలిపోయింది. ట్విస్టులు ఆశ్చర్యపరచవు, భావోద్వేగాలు కదిలించవు, కథనం ఉత్కంఠ కలిగించదు. క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఎక్కువగా ఆస్వాదించే ప్రేక్షకులకు కూడా ఇది నిరాశనే మిగుల్చే అవకాశం ఉంది.