Dulquer Salmaan Stylish Gambler Thriller
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మరోసారి పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఐ యామ్ గేమ్’ పేరుతో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆయన ఓ స్టైలిష్ గ్యాంబ్లర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఆసక్తిని పెంచిన ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ఎన్టీఆర్ స్పందిస్తూ.. “ఇది చాలా ఎంగేజింగ్‌గా ఉంది. నా బ్రదర్ దుల్కర్ మరో స్పెషల్ మూవీతో వస్తున్నాడు” అంటూ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందజేశారు.
Dulquer Salmaan Stylish Gambler Thriller
ఇక ట్రైలర్ విషయానికొస్తే… ప్రారంభంలోనే “మన జీవితం అంతా దేవుడికి… సైతాన్‌కి మధ్య జరిగే గ్యాంబిల్” అనే దుల్కర్ డైలాగ్ కథలోని కాన్ఫ్లిక్ట్ను ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. స్పోర్ట్స్ బెట్టింగ్ చుట్టూ తిరిగే ఈ కథలో, సాధారణ బెట్టింగ్‌లకు భిన్నంగా ఓ కొత్త తరహా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే యువకుడిగా దుల్కర్ కనిపిస్తాడు. అయితే అదే యాప్ అతని జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పుతుంది. ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలు, వాటి నుంచి బయటపడే ప్రయత్నాలే సినిమా ప్రధాన కథగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ మొత్తం స్టైలిష్ విజువల్స్, ఫాస్ట్-పేస్డ్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా “గ్యాంబ్లింగ్ అయినా… లైఫ్ అయినా… ఎప్పటికీ మర్చిపోకూడని ప్రిన్సిపుల్ ఒక్కటే… నెవర్ గివ్ అప్” అంటూ దుల్కర్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది.
ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ స్వయంగా జోమ్ వర్గీస్‌తో కలిసి నిర్మించారు. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించగా, షాబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథను అందించారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. దుల్కర్‌తో పాటు ఆంటోనీ వర్గీస్, దర్శకుడు-నటుడు మిస్కిన్, కయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటించారు. ఓనం సందర్భంగా ఆగస్టు 20న తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమింగ్, స్పోర్ట్స్ బెట్టింగ్, థ్రిల్, ఎమోషన్ వంటి అన్ని ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.