Vijay Ranabali: The History We Forgot
చరిత్ర అంటే పుస్తకాల్లో చదివిన కొన్ని సంఘటనలు మాత్రమే కాదు.. దాని వెనుక దాగి ఉన్న నిజాలను తెలుసుకునే కొద్దీ ఎన్నో కొత్త ప్రశ్నలు ఎదురవుతాయి. ఇప్పుడు అలాంటి ప్రశ్నలనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి అనుబంధంగా విడుదల చేస్తున్న ‘Never Forget the Truth’ డాక్యుమెంటరీ సిరీస్ ఆసక్తిని పెంచుతోంది.
Vijay Ranabali: The History We Forgot
నాలుగు ఎపిసోడ్లుగా వస్తున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో రెండో ఎపిసోడ్ ‘The History We Forgot’ తాజాగా యూట్యూబ్‌లోకి వచ్చింది. ఈసారి సినిమా కథ కంటే.. మనకు తెలిసిన చరిత్రలో మిస్ అయిన అంశాలపై ఫోకస్ పెట్టింది ఈ ఎపిసోడ్.
రైల్వేలు.. అభివృద్ధి కోసమా? వలస పాలన అవసరాల కోసమా?
భారత్‌లో రైల్వే వ్యవస్థను బ్రిటీష్ పాలనలో విస్తరించిన విషయం తెలిసిందే. అయితే రైల్వేల నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటనే ప్రశ్నను ‘రణబాలి’ డాక్యుమెంటరీ ప్రస్తావిస్తోంది. దేశంలోని వ్యవసాయ ప్రాంతాల నుంచి పంటలు, ఇతర వనరులను పోర్టులకు వేగంగా తరలించేందుకు రైల్వే నెట్వర్క్ ఎలా ఉపయోగపడిందనే అంశాన్ని ఇందులో చర్చించారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రైల్వేలను బ్రిటీష్ వాళ్లు భారతదేశానికి నిర్మించి ఇచ్చారనే సాధారణ అభిప్రాయం వెనుక మరో కోణం ఉందని తెలిపారు. భారతీయుల శ్రమతో నిర్మించిన రైల్వే వ్యవస్థను బ్రిటీష్ పాలన తమ వాణిజ్య, పరిపాలనా ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించుకుందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో భారతదేశంలోని వ్యవసాయ వనరులు, ధాన్యం, పత్తి, మసాలా దినుసులు వంటి వస్తువులు రైల్వే మార్గాల ద్వారా పోర్టులకు చేరి విదేశాలకు తరలించబడిన విషయాన్ని కూడా డాక్యుమెంటరీ హైలైట్ చేస్తోంది.
రీసెర్చ్ చేస్తేనే తెలిసిన నిజాలంటున్న రశ్మిక
ఈ డాక్యుమెంటరీ కోసం పరిశోధన చేస్తున్న సమయంలో అప్పటి పరిస్థితుల గురించి తనకు ఎన్నో విషయాలు కొత్తగా తెలిసాయని రశ్మిక మందన్న చెప్పింది. చరిత్రలోని కొన్ని వాస్తవాలు మనకు తెలియకపోవడానికి అవి తగినంతగా చర్చకు రాకపోవడం కూడా ఒక కారణమని ఆమె అభిప్రాయపడింది. అప్పటి ప్రజల జీవనం, పరిస్థితులు, బ్రిటీష్ పాలన ప్రభావం గురించి లోతుగా తెలుసుకున్న తర్వాత భావోద్వేగానికి గురైనట్లు రశ్మిక చెప్పుకొచ్చింది.
సినిమా కంటే ముందే ఆసక్తి పెంచుతున్న డాక్యుమెంటరీ
‘రణబాలి’ సినిమాకు ముందు ఈ డాక్యుమెంటరీ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆ కాలానికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ తర్వాత రెండో ఎపిసోడ్ కూడా చరిత్రలోని మరో కోణాన్ని చర్చకు తీసుకురావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.
‘The History We Forgot’ తర్వాత మూడో ఎపిసోడ్ ‘The Men We Forgot’ అక్టోబర్ 2న స్ట్రీమింగ్ కానుంది. నాలుగో ఎపిసోడ్ ‘The Last Load’ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.