Srinivasa Mangapuram Movie Review Telugu
చిత్రం : శ్రీనివాస మంగాపురం
రేటింగ్ : 2/5
నటీనటులు : జై కృష్ణ, రాషా తడానీ, మోహన్ బాబు, నరేష్ విజయకృష్ణ, బ్రహ్మాజీ, కిక్ శ్యామ్, అజయ్, వాసుకి తదితరులు..
సమర్పణ : వైజయంతీ మూవీస్, అశ్వినీదత్
బ్యానర్: చందమామ కథలు
నిర్మాతలు : పి.కిరణ్
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : అజయ్ భూపతి
సంగీత దర్శకుడు: జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ): జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: మాధవ్ కుమార్ గుల్లపల్లి
విడుదల తేదీ: 30/07/ 2026
నిడివి : 2 గంటల 35 నిమిషాలు
కథ విషయానికొస్తే :
తిరుపతిలో పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) అంటే భయపడే పరిస్థితి. అతని కుటుంబానికి ఎదురు తిరిగిన వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చూసిన శ్రీను (జై కృష్ణ) కూడా మొదట షాక్‌కు గురవుతాడు. అయితే అదే కుటుంబానికి చెందిన మంగా (రాషా తడాని)ని చూసిన క్షణం ప్రేమలో పడిపోతాడు. ఆమె వెంటపడుతూ ప్రేమను గెలుచుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే ఆమెకు పెళ్లి కుదిరిపోతుంది. ఇదే సమయంలో శ్రీను జీవితంలో దాగి ఉన్న వాసుబాబు అనే గతం బయటపడుతుంది. అతనికి బళ్లారి జిల్లాకు చెందిన వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు)తో ఉన్న సంబంధం ఏంటి? శ్రీను తిరుపతికి ఎందుకు వచ్చాడు? చివరకు మంగా-శ్రీను ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేదే సినిమా.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
జై కృష్ణ తొలి సినిమానే అయినప్పటికీ కష్టపడి నటించిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్, డ్యాన్స్‌ల్లో మంచి ఎనర్జీ చూపించాడు. అయితే నటన, ఎక్స్ప్రెషన్స్ పరంగా ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది. కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు స్టైల్‌ను అనుకరించే ప్రయత్నం చేసినట్లు అనిపించడం కూడా మైనస్‌గా మారింది. రాషా తడాని స్క్రీన్‌పై అందంగా కనిపించినా, నటనలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తుంది. మోహన్ బాబు కనిపించిన కొద్దిసేపే సినిమాకు కొంత బలం తీసుకొచ్చారు. కానీ ఆయన పాత్రకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. బ్రహ్మాజీ, నరేష్ తమ పాత్రల మేరకు ఫర్వాలేదనిపించారు. అజయ్, వాసుకి తదితరులు కూడా తమ పరిధిలో నటించారు.

టెక్నీకల్ టీమ్ గురించి..
జీవీ ప్రకాష్ సంగీతం ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఒక్క పాట మినహా మిగతా పాటలు గుర్తుండిపోయేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపింది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకు ప్లస్. తిరుపతి పరిసరాలను అందంగా చూపించారు. విజువల్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఎడిటింగ్ మాత్రం బలహీనంగా అనిపిస్తుంది. అనవసరంగా సాగిన సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా మరింత క్రిస్పీగా ఉండేది. నిర్మాణ విలువలు మాత్రం చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌లో నిర్మాతల ఖర్చు కనిపిస్తుంది.
సినిమా ఎలా ఉందంటే..
సినిమా మొదలైన కొద్దిసేపటికే ఇది పూర్తిగా పాత తరహా కమర్షియల్ ఫార్ములాలోనే సాగబోతోందనే విషయం అర్థమవుతుంది. హీరో హీరోయిన్ వెంటపడటం, పవర్ఫుల్ విలన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్లాష్‌బ్యాక్, చివర్లో భారీ క్లైమాక్స్… ఇలా ఎన్నోసార్లు చూసిన అంశాలనే మరోసారి తెరపై చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు అజయ్ భూపతి నుంచి ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తారు. కానీ ఈసారి ఆయన తన మార్క్‌ను పూర్తిగా మిస్ అయ్యాడు. కథలో గానీ, స్క్రీన్‌ప్లేలో గానీ ఎక్కడా సర్ప్రైజ్ అనిపించే అంశాలు కనిపించవు. చాలా సన్నివేశాలు ముందే ఊహించేయొచ్చు. ఫస్ట్ హాఫ్ పూర్తిగా నెమ్మదిగా సాగుతుండగా, సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా పెద్దగా ప్రభావం చూపలేవు. లవ్ ట్రాక్ కూడా బలంగా కనెక్ట్ కాదు. హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకుడిని కదిలించలేకపోతాయి. కథను మరింత కట్టుదిట్టంగా చెప్పే అవకాశం ఉన్నా, దర్శకుడు దానిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. కామెడీ కోసం పెట్టిన నరేష్, బ్రహ్మాజీ ట్రాక్ కొన్ని చోట్ల నవ్వించినా, మొత్తం కథనం నుంచి ప్రేక్షకుడి దృష్టి మరల్చినట్టే అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు అవసరానికి మించి సాగడం వల్ల సినిమా నిడివి కూడా భారంగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :
జై కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్
మోహన్ బాబు నటన
సినిమాటోగ్రఫీ, విజువల్స్
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
కొన్ని కామెడీ సన్నివేశాలు (నరేష్, బ్రహ్మాజీ)
మైనస్ పాయింట్స్ :
రొటీన్, పాత కథ
బలహీనమైన స్క్రీన్‌ప్లే
కనెక్ట్ కాని లవ్ ట్రాక్
సాగదీతగా అనిపించే నిడివి
గుర్తుండిపోయే పాటలు లేకపోవడం
ఊహించదగిన ట్విస్టులు, క్లైమాక్స్
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘శ్రీనివాస మంగాపురం’లో కొత్త హీరో జై కృష్ణను మంచి కమర్షియల్ హీరోగా పరిచయం చేయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ విషయంలో కొంతవరకు సక్సెస్ అయినా, సినిమా మాత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వలేకపోయింది. పాత కథ, రొటీన్ స్క్రీన్‌ప్లే, బలహీనమైన లవ్ ట్రాక్, ప్రభావం చూపని ఎమోషన్స్ సినిమాను వెనక్కి లాగాయి. దర్శకుడు అజయ్ భూపతి నుంచి ఆశించిన స్థాయి మ్యాజిక్ ఇందులో కనిపించదు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారికి ఓసారి చూసే అవకాశం ఉన్నా, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నిరాశనే మిగులుస్తుంది.