Srinivasa Mangapuram: Rasha Thadani Interview
బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ, వైజయంతి మూవీస్ సమర్పిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. అలాగే ఇదే చిత్రంతో ఘట్టమనేని వారసుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించగా, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా సందర్భంగా రాషా తన సినీ ప్రయాణం, సినిమా విశేషాలను పంచుకున్నారు.
Srinivasa Mangapuram: Rasha Thadani Interview
‘శ్రీనివాస మంగాపురం’ కథ విన్న క్షణమే దర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పిన తీరు, పాత్రల ఎమోషన్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ప్రతి పాత్రను ఆయన ఎంత ప్రేమతో తీర్చిదిద్దారో కథ వింటూనే అర్థమైంది. ఈ సినిమాలో నేను చేసిన ‘మంగా’ పాత్రకు రెండు భిన్నమైన కోణాలు ఉంటాయి. ఒకవైపు బబ్లీ, ఎనర్జిటిక్ అమ్మాయిగా కనిపిస్తే.. మరోవైపు హుందాతనం, భావోద్వేగాలతో కూడిన పాత్రగా కనిపిస్తుంది. నటిగా నాకు మంచి స్కోప్ ఇచ్చిన క్యారెక్టర్ ఇది. తెలుగు పూర్తిగా మాట్లాడలేకపోయినా, దర్శకుడు అజయ్ భూపతి ప్రతి డైలాగ్ అర్థం, ప్రతి భావాన్ని ఓపిగ్గా వివరించి చెప్పడంతో పాత్రలో పూర్తిగా లీనమయ్యాను. అందుకే మంగా పాత్ర నాకు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గరైంది. జయకృష్ణ ఘట్టమనేని చాలా కూల్ అండ్ స్వీట్ పర్సన్. సెట్స్‌లో ఎప్పుడూ సరదా వాతావరణం ఉండేది. షూటింగ్ మొత్తం ఎంతో ఆనందంగా సాగింది. మోహన్ బాబు గారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన సెట్స్‌లో ఎప్పుడూ ఉత్సాహంగా, సరదాగా ఉండేవారు. ఆయన అనుభవం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది. వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అశ్విని దత్ గారు నన్ను కుటుంబ సభ్యురాలిలా చూసుకున్నారు. ఆయన చూపిన ఆప్యాయత ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
‘శ్రీనివాస మంగాపురం’లో యాక్షన్, ప్రేమ, ఎమోషన్, కామెడీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేసే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. దర్శకుడు అజయ్ భూపతి హీరోయిన్ పాత్రలను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఈ సినిమాలో కూడా నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంది. అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలు చూసి ఆయన దర్శకత్వ శైలికి అభిమానిని అయ్యాను. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. మొత్తం ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ మూవీ షూటింగ్ నాకు సినిమా కంటే ఒక అందమైన వెకేషన్‌లా అనిపించింది. ప్రతి రోజు ఎంతో ఆనందంగా గడిచింది. నా తొలి తెలుగు సినిమా షూటింగ్ తిరుపతిలో జరగడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ప్రేక్షకుల ఆశీర్వాదాలతో ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తెలుగు సినిమాపై నాకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన అభిమానం ఉంది. ‘బాహుబలి’ చూసిన తర్వాత ఈ ఇండస్ట్రీలో తప్పకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ప్రతి సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే పరిశ్రమగా తెలుగు సినిమాను చూస్తాను. తెలుగు ఇండస్ట్రీలో పని చేయడం చాలా మంచి అనుభవమని మా అమ్మ రవీనా టాండన్ ముందే చెప్పారు. ఇక్కడి సానుకూల వాతావరణం, టీమ్ వర్క్ గురించి ఆమె చెప్పిన ప్రతి మాట షూటింగ్ సమయంలో నిజమైంది. అలాగే తెలుగు భాష కూడా నేర్చుకోవాలని ఆమె ప్రోత్సహించారు. నేను తెలుగు సినిమా చేయడం మా నాన్నకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకు కూడా తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. నేను ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఆయనకు గర్వంగా అనిపించింది. నాకు అన్ని జోనర్ సినిమాల్లో నటించాలని ఉంది. ప్రస్తుతం నా తదుపరి చిత్రం కామెడీ జోనర్లో రూపొందుతోంది. భవిష్యత్తులో యాక్షన్, పీరియడ్, రొమాంటిక్, అన్ని రకాల కథల్లో నటించాలని కోరుకుంటున్నాను.