Jigithara Song Out from Chennai Love Story
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి మరో అందమైన ప్రేమ గీతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ‘జిగితార..’ అనే మెలోడీ సాంగ్‌ను విడుదల చేసి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. శనివారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించిన గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్‌లో ఈ పాటను అభిమానుల సమక్షంలో రిలీజ్ చేయడం విశేషం.
Jigithara Song Out from Chennai Love Story
‘జిగితార..’ పాటలో ప్రేమలో మునిగిపోయిన యువకుడి మనసులోని భావాలను ఎంతో నేచురల్‌గా చూపించారు. “జిగితార.. జిగితార.. దిగినావా మనసారా… ఆకాశాన్ని వీడి ఈ ఆకతాయికై భూమి చేరినావు…” అంటూ సాగే సాహిత్యం ప్రేమికుల హృదయాలను తాకేలా ఉంది. ప్రతి క్షణం తన ప్రేయసి కోసం జీవించాలనుకునే ప్రేమికుడి భావోద్వేగాలతో ఈ పాట ఆకట్టుకుంటుంది.
అనంత శ్రీరామ్ తనదైన శైలిలో అందమైన పదాలను అందించగా, కార్తీక్ తన మధురమైన స్వరంతో పాటకు మరింత ప్రాణం పోశారు. ఇక మెలొడీ బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన బాణీ పాటకు ప్రధాన బలంగా నిలిచి, వినగానే మళ్లీ మళ్లీ వినాలనిపించే అనుభూతిని కలిగిస్తోంది.
“చెన్నై లవ్ స్టోరీ”లో కిరణ్ అబ్బవరం సరసన శ్రీ గౌరి ప్రియ హీరోయిన్గా నటిస్తోంది. “కలర్ ఫొటో”, “బేబి” వంటి భావోద్వేగభరిత చిత్రాలను అందించిన నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథను సాయి రాజేశ్ అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రేమ, భావోద్వేగాలు, సంగీతానికి పెద్దపీట వేస్తూ రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలైలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.