Tabu’s Royal Avatar in King 100
అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 100వ చిత్రం ‘కింగ్ 100’. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం నుంచి వరుసగా వస్తున్న అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇందులో టబు ‘మహంతి ఝాన్సీ రాణి’గా అత్యంత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
Tabu’s Royal Avatar in King 100
టబు చెప్పే ఇంటెన్స్ వాయిస్‌ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. “ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. లక్‌ను నమ్మేవాళ్లు ఒకరు, హార్డ్‌వర్క్‌ను నమ్మేవాళ్లు మరొకరు. ఐ హేట్ లక్” అంటూ ఆమె చెప్పిన డైలాగ్ పాత్రలోని ఆత్మవిశ్వాసాన్ని, తెగువను తెలియజేస్తోంది. భారీ జనసమూహం మధ్య గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ పదవీ ప్రమాణ స్వీకారం చేసే సన్నివేశాలు గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మరోసారి కలిసి నటిస్తుండటం ఈ సినిమాపై ఉన్న ఆసక్తికి మరో ప్రధాన కారణం. అయితే ఈసారి వీరిద్దరి మధ్య కనిపించబోయేది ప్రేమకథ కాదు.. యుద్ధం నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథనం. మహంతి ఝాన్సీ రాణిగా టబు కనిపించిన తీరు, ఆమె హుందాతనం, రాజసం, అధికార దర్పం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ తనదైన కమాండింగ్ ప్రెజెన్స్‌తో ఆమె పాత్రకు ప్రత్యేకత తీసుకొచ్చారు. అందమైన చీరకట్టు, గంభీరమైన హావభావాలు, పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే శక్తిమంతమైన మహిళగా టబు పాత్రను పరిచయం చేశారు.
ఇప్పటికే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా టబు పాత్ర పరిచయ వీడియో కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఒక్కో ప్రమోషనల్ అప్డేట్తో ‘కింగ్ 100’ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. దర్శకుడు రా కార్తీక్ ఈ సినిమా కోసం ఎలాంటి వైవిధ్యమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారో తాజా గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు, భారీ ప్రొడక్షన్ గ్రాండియర్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ రాజా మహదేవన్ అందించిన స్టైలిష్ విజువల్స్ గ్లింప్స్‌కు మరింత ఆకర్షణను తీసుకురాగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంటెన్సిటీని మరో స్థాయికి తీసుకెళ్లింది. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, సతీష్ కుమార్ ఎన్ ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘కింగ్ 100’ డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.