Summer Holidays Friendship Song Out
చిన్ననాటి స్నేహాలు, వేసవి సెలవుల జ్ఞాపకాలు, స్నేహితులతో కలిసి చేసే అల్లరి.. ఇవన్నీ గుర్తొస్తే మనసులో తెలియని ఆనందం కలుగుతుంది. అలాంటి బాల్య జ్ఞాపకాలను అందమైన కథగా తెరపైకి తీసుకొస్తున్న చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు శ్రీకర్ తెరకెక్కిస్తున్నారు.
Summer Holidays Friendship Song Out
సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని.. తన ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిన్నారుల ప్రపంచం, వారి స్నేహాలు, సరదాలు, బాల్యంలోని మధురమైన అనుభూతులను ప్రధానంగా తీసుకుని సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలవుతున్న పాటలు మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన ‘క్రష్ సాంగ్’, ‘స్కూల్ సాంగ్’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకోగా.. తాజాగా ‘ఫ్రెండ్షిప్ సాంగ్’ను మేకర్స్ విడుదల చేశారు.
చిన్నారుల స్నేహం, వారి అల్లరి, ప్రకృతితో కలిసి గడిపే ఆహ్లాదకరమైన క్షణాలను కళ్లకు కట్టినట్టుగా చూపించేలా ఈ పాటను రూపొందించారు. సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేసిన ఈ పాటకు పల్లవిని పూర్ణాచారి రాయగా, చరణం, హుక్ లైన్‌ను కిట్టు విస్సాప్రగడ అందించారు. శ్రీ రామచంద్ర తన గాత్రంతో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.
‘ఓ రెండు తోకచుక్కలు తొడిగాయి చిన్ని రెక్కలు.. గోదారి దారిపొడవునా ఎగిరాయే..’ అంటూ సాగే లిరిక్స్ చిన్ననాటి స్నేహాం, స్వేచ్ఛగా సాగిపోయే బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. యేటి గట్టు, మావి చెట్టు, నీటి తొట్టి, కాగితాల పడవలు.. ఇలా చిన్నారుల ప్రపంచంలోని ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఈ పాటలో చూపించడం ఆకట్టుకుంది. ఈ ఫ్రెండ్షిప్ సాంగ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, సింగర్ శ్రీ రామచంద్ర కూడా కనిపించడం విశేషం.