SS Thaman OG Tour India
సంగీత ప్రియులకు ఓ అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సిద్ధమవుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ కాన్సర్ట్ జూన్ 13న హైదరాబాద్‌లోని బౌండరీ హిల్స్ వేదికగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏసీటీసీ ఈవెంట్స్ ప్రతినిధులు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలను వెల్లడించారు.
SS Thaman OG Tour India
ఈ సందర్భంగా ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ..‘ఓజీ’ సినిమా మ్యూజిక్కు ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుత స్పందనను సెలబ్రేట్ చేసుకునేందుకే ‘ఓజీ టూర్ ఇండియా’ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంగీత ప్రేమికులను ఆకట్టుకున్న అనిరుధ్ నిర్వహించిన ‘హుకుం టూర్’ తరహాలోనే, ‘ఓజీ టూర్’ కూడా ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తుందని చెప్పారు. సినిమా ఆడియో వేడుకలు, విజయోత్సవ సభల్లో ప్రేక్షకులను తరచూ కలుస్తూనే ఉంటానని, అయితే ‘ఓజీ టూర్ ఇండియా’ ద్వారా నేరుగా అభిమానులను కలవడం ఎంతో ఆనందంగా ఉందని తమన్ అన్నారు. ఈ టూర్లో భాగంగా జూన్ 13న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే కార్యక్రమం తర్వాత జూలై 11న బెంగళూరు, ఆగస్టు 15న చెన్నై, సెప్టెంబర్ 25న విశాఖపట్నంలో కూడా భారీ సంగీత వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తాను నిర్వహించే ప్రతి లైవ్ షో ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌ను చారిటీ కార్యక్రమాలకు అందిస్తుంటానని, ఈ కాన్సర్ట్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాల వివరాలను కూడా షో పూర్తైన తర్వాత వెల్లడిస్తానని తమన్ చెప్పారు.
SS Thaman OG Tour India
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తాను స్వరపరిచిన సూపర్ హిట్ పాటలను ప్రత్యేకంగా ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు, అద్భుతమైన కొరియోగ్రఫీ, ఫైర్వర్క్స్, భారీ ఎల్ఈడీ స్క్రీన్స్, 3డీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కాన్సర్ట్ కోసం తాను కూడా ప్రత్యేకంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని, పూర్తి స్థాయి లైవ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు.
అలాగే ప్రస్తుతం తాను సంగీతం అందిస్తున్న NBK111, Mega158, ‘ఆదర్శ కుటుంబం’, ‘లెనిన్’, ‘ఇట్లు అర్జున’ చిత్రాలు అద్భుతంగా రూపొందుతున్నాయని, అవన్నీ ప్రేక్షకుల ఆదరణతో పెద్ద విజయాలు సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏసీటీసీ నిర్వాహకుడు సరవణన్ వాసు మాట్లాడుతూ, తమన్‌తో కలిసి ఈ టూర్‌ను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నేటి జెన్-జీ యువతలో తమన్ పాటలకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ కాన్సర్ట్‌ను ప్లాన్ చేశామని, సంగీతం, డ్యాన్స్, సాంకేతిక హంగులతో కూడిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు గొప్ప ఎంటర్టైన్మెంట్ను అందించబోతుందని తెలిపారు.