Sri Vishnu Gets Nostalgic Watching Summer Holidays Trailer
చిన్నతనంలో వేసవి సెలవులు వస్తే అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లకు వెళ్లడం.. కొత్త స్నేహాలు చేసుకోవడం.. అల్లరి పనులతో రోజంతా గడపడం.. ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. కాలం మారుతున్న కొద్దీ ఆ అనుభూతులకు దూరమవుతున్న తరుణంలో.. పాత రోజులను మరోసారి గుర్తుచేసేందుకు సిద్ధమవుతోంది ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రం. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sri Vishnu Gets Nostalgic Watching Summer Holidays Trailer
తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ వేడుకకు ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ చూసిన తర్వాత తన బాల్యంలోని వేసవి సెలవుల జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని ఆయన చెప్పడం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘సమ్మర్ హాలిడేస్’ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. చిన్నప్పుడు సెలవుల్లో ఊరికి వెళ్లిన రోజులు గుర్తుకొచ్చాయి. ఈ సినిమాను తప్పకుండా చూస్తా. దీపావళికి కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాలి. రోహన్‌కు సినిమాలంటే ఎంతో ఇష్టం. తను నాతో కలిసి నటించాడు. అరుణ్‌ను చూస్తుంటే నేషనల్ అవార్డ్‌ను చాలా దగ్గరగా చూస్తున్నట్టు ఉంది. ఖుషి కూడా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. వాసుకి గారిని చూస్తుంటే ‘తొలిప్రేమ’ సినిమా గుర్తుకొస్తుంది. సమ్మర్ సెలవులు అనగానే అమ్మమ్మ, తాతయ్యల ఊరికి వెళ్లే సంప్రదాయం నేటి తరంలో తగ్గిపోతోంది. ఈ సినిమా చూస్తే ఒకప్పుడు మన వేసవి సెలవులు ఎలా ఉండేవో గుర్తుకొస్తుంది’ అని అన్నారు.
నటి వాసుకి మాట్లాడుతూ.. తాను ఎంతగానో ఇష్టపడిన కథలో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ చిత్రంలోని భావోద్వేగాలను ఆస్వాదిస్తారని, దర్శకుడు శ్రీకర్ కథను ఎంతో స్వచ్ఛంగా తెరకెక్కించారని పేర్కొన్నారు.
సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా కథలోని కుటుంబంలో ఒకరిగా భావిస్తారని మాస్టర్ అరుణ్ చెప్పాడు. తన పాత్రతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని అన్నాడు. అనుభవజ్ఞులైన నటీనటులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని మాస్టర్ రోహన్ అన్నాడు. బేబీ ఖుషి కూడా ట్రైలర్‌లోని స్నేహం, భావోద్వేగాలు, హాస్య అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
దర్శకుడు శ్రీకర్ మాట్లాడుతూ ‘ట్రైలర్‌కు వస్తోన్న రెస్పాన్స్ చాలా ఆనందాన్న ఇస్తోంది. ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించేలా సినిమాను రూపొందించాం’ అని చెప్పారు.
నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘ ఈ కథ విన్నప్పటి నుంచి ఈ మూవీని క్వాలిటీగా చేయాలని అనుకున్నాం. అమ్మమ్మ పాత్రలో జయసుధ గారు ఒదిగిపోయారు. వాసుకి గారి క్యారెక్టర్ చూస్తుంటే మా మదర్ గుర్తుకువచ్చారు. హర్షవర్థన్, రాజీవ్ కనకాల, హర్షిణి..ఇలా ప్రతి ఆర్టిస్ట్ తమ నటనతో మా సినిమాకు మరింత వ్యాల్యూ తీసుకొచ్చారు. చిన్నపిల్లల సినిమా ఎందుకు చేస్తున్నావని, థియేటర్స్ కు జనం వస్తారా అని మిత్రులు అంటున్నారు. ఇలాంటి సినిమా హిట్ అయితే వందమంది శ్రీకర్ లు ఇండస్ట్రీకి వస్తారు. ఇలాంటి కథలు ఇంకా ఉన్నాయి కానీ ఎవరూ చేసేందుకు ముందుకురావడం లేదు. ఇలాంటి సినిమా ఇతర భాషల్లో వస్తే చూసి ఎంజాయ్ చేస్తున్నాం. మా సినిమా సక్సెస్ అవుతుందనే సూపర్ కాన్ఫిడెన్స్ తో మేమంతా ఉన్నాం. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా. మా సినిమాను పిల్లల కంటే అనేక రెట్లు పెద్దలు ఎంజాయ్ చేస్తారు. “సమ్మర్ హాలిడేస్” ఏమాత్రం బోర్ కొట్టదు, నిర్మాతగా ఇది నా ప్రామిస్’ అని అన్నారు.
సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ.. సినిమా సంగీతానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నామని, నటీనటులందరూ అద్భుతంగా నటించారని తెలిపారు. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.