PRABHAS UNLEASHED AS FAUZI
నీడల్లో నడిచే యుద్ధం.. శత్రువులకు అంతుచిక్కని వ్యూహం.. మాతృభూమి కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టే ఓ తిరుగుబాటు యోధుడు.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘ఫైల్ నంబర్ 25’ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్‌లో ప్రభాస్‌ను పరిచయం చేస్తూ, చరిత్ర, దేశభక్తి, గూఢచర్యం, హై-వోల్టేజ్ యాక్షన్ కలగలిసిన ఓ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాకు ఈ గ్లింప్స్ బలమైన పునాది వేసింది.
PRABHAS UNLEASHED AS FAUZI
1942 మే 29.. బెర్లిన్. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్ చరిత్రలో కీలకమైన ఘట్టాన్ని పరిచయం చేస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సమావేశంతో కథనం మొదలవుతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న నేతాజీ, జర్మనీ మద్దతును కోరే సందర్భంలో భారత్ స్వాతంత్ర్య సాధ్యతపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత్ ఓడించగలదా? అనే ప్రశ్నకు నేతాజీ ఇచ్చే సమాధానం కథలోని అసలు పాయింట్‌ను పరిచయం చేస్తుంది. స్వాతంత్ర్యం కోసం రగిలే సంకల్పాన్ని ఏ శక్తీ ఆపలేదనే భావనతో పాటు, యుద్ధంలో గెలవడానికి కేవలం ఆయుధ బలం మాత్రమే సరిపోదని, తెలివితేటలు, వ్యూహాలు, ఇంటెలిజెన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఈ సన్నివేశాలు స్పష్టం చేస్తాయి. సైనిక బలగాలతో నేరుగా తలపడటమే యుద్ధం కాదు.. శత్రువు వేసే ఎత్తులను ముందే పసిగట్టి, వారి వ్యూహాలనే వారి మీద ప్రయోగించడం అసలైన యుద్ధ నైపుణ్యం. ఈ ఆలోచనకు ప్రతిరూపంగా నేతాజీ ఓ అసాధారణ భారతీయ ఆపరేటివ్ కథను ప్రస్తావిస్తారు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ రహస్య యోధుడు తన తెలివితేటలతో శత్రువుల ప్రణాళికలను పదేపదే దెబ్బతీస్తుంటాడు.
బ్రిటిష్ సైనిక బలగాలను దారి మళ్లించడం, కీలకమైన మిషన్లను అడ్డుకోవడం, శత్రువుల వ్యూహాలను ముందుగానే పసిగట్టి వాటిని నిర్వీర్యం చేయడం.. ఇలా ప్రతి అడుగులోనూ తన ముద్ర వేస్తుంటాడు. అయితే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్నప్పటికీ అతని అసలు గుర్తింపు మాత్రం ఎవరికీ తెలియదు. ఆ రహస్యమే ‘ఫౌజీ’ కథలో ఉత్కంఠను పెంచే ప్రధాన అంశంగా కనిపిస్తోంది.
‘ఫైల్ నంబర్ 25’లో మరో ఆసక్తికరమైన అంశం ప్రభాస్ ఉపయోగించే కమ్యూనికేషన్ వ్యవస్థ. భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన రహస్య కోడ్ ద్వారా తన సమాచారాన్ని చేరవేస్తూ, శత్రువులకు చిక్కకుండా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటాడు ఈ యోధుడు. జర్మనీకి చెందిన ఎనిగ్మా కోడ్‌తో పోల్చదగినంత సంక్లిష్టమైన ఈ వ్యవస్థను ఛేదించడం అంత సులభం కాదనే అంశం గ్లింప్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఓవైపు యుద్ధరంగంలో సైనిక బలం.. మరోవైపు కనిపించని ఇంటెలిజెన్స్ వార్! ఈ రెండు ప్రపంచాల మధ్య కథానాయకుడి ప్రయాణాన్ని పరిచయం చేస్తూ, ‘ఫౌజీ’ సాధారణ యాక్షన్ సినిమాకు భిన్నమైన అనుభూతిని అందించబోతోందనే సంకేతాలను గ్లింప్స్ ఇస్తోంది.
బ్రిటిష్ అధికారుల రికార్డుల్లో 1932 నుంచి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఈ రహస్య యోధుడిని ‘ఫౌజీ’గా గుర్తిస్తారు. కానీ ఆ పేరుకు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అతని లక్ష్యం ఏమిటి? అతడిని పట్టుకోవడానికి బ్రిటిష్ పాలకులు ఎందుకు ఇంతగా ప్రయత్నిస్తున్నారు? అనే ప్రశ్నలు కథపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
తన మాతృభూమిని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ రెబల్ సోల్జర్ ప్రస్తుతం కలకత్తాలో ఉన్నాడని నేతాజీ వెల్లడించే అంశం కథకు మరో కీలక మలుపునిస్తుంది. తన గుర్తింపును రహస్యంగా ఉంచుకుంటూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించే ఈ యోధుడి వెనుక ఉన్న అసలు కథను తెరపై చూడాలనే ఆసక్తిని ‘ఫైల్ నంబర్ 25’ పెంచుతోంది.
గ్లింప్స్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ హైలైట్‌గా నిలుస్తుంది. పెదవుల మధ్య సిగరెట్, చేతిలో భారీ తుపాకీ, ముఖంలో రాజీలేని ఆగ్రహం.. వలస పాలకులకు తలవంచని తిరుగుబాటు సైనికుడిగా ప్రభాస్ కనిపించిన తీరు అదిరిపోయింది. ఆయన బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు కావాల్సిన పవర్‌ను అందిస్తున్నాయి.
ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ సంగీతం, అనిల్ విలాస్ జాదవ్ ప్రొడక్షన్ డిజైన్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.