Nani’s Crazy ‘Paradise’ Updates
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో పాటు, విడుదలైన పాటలు, గ్లింప్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో నాని, శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Nani’s Crazy ‘Paradise’ Updates
ముఖ్యంగా ‘ది ప్యారడైజ్’కు ట్రైలర్ ఉండదని నాని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమా గురించి ఎంతో కంటెంట్ బయటకు వచ్చినా ట్రైలర్ ఇవ్వకపోవడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందని నాని వెల్లడించారు. అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలంటే సినిమా పనులన్నీ పక్కనపెట్టి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్ సహా టీమ్ మొత్తం దానిపైనే పనిచేయాల్సి ఉంటుందని, అందుకే టీమ్ అంతా కలిసి ‘ప్యారడైజ్’కు ట్రైలర్ వద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
‘వెయ్యి మందితో ఫైట్’.. అసలు నిజమేంటి?
‘ప్యారడైజ్’కు సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయని చెప్పిన నాని, కొన్ని వార్తలకు క్లారిటీ ఇచ్చారు. సినిమాలో వెయ్యి మందితో భారీ ఫైట్ ఉండదని, అలాగే అండర్‌వాటర్ సీక్వెన్స్ కూడా లేదని స్పష్టం చేశారు. అయితే సినిమాలో యాక్షన్‌కు మాత్రం ఎలాంటి కొదవ ఉండదని తెలిపారు. చాలా యాక్షన్ బ్లాక్స్, హై ఇచ్చే సన్నివేశాలు ఉంటాయని, ముఖ్యంగా వైలెన్స్‌లో ఉన్న ఎమోషన్‌ను ప్రేక్షకులు ఫీల్ అవుతారని నాని చెప్పడం సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.
జడల బరువు.. యాక్షన్‌లో నానా కష్టాలు!
‘ది ప్యారడైజ్’లో నాని హెయిర్ స్టైల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆయన జడల బరువుపై వచ్చిన వార్తలపై నాని స్పందించారు. షూటింగ్ సమయంలో జడలను ఒరిజినల్ హెయిర్‌కు అటాచ్ చేసేవారని, దాంతో సహజంగానే వాటి బరువు పెరిగేదని చెప్పారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆ జడలు రోప్‌కు తగిలి ఇరుక్కుపోయేవని, అందువల్ల వాటితో యాక్షన్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని నాని వెల్లడించారు. ఈ సినిమాలో తాను మాత్రమే కాకుండా తన గ్యాంగ్‌లో నటించిన ప్రతి ఒక్కరూ గాయాలపాలయ్యారని, తాము ఎంత కష్టపడి ఈ సినిమా చేశామో థియేటర్లో ప్రేక్షకులకు అర్థమవుతుందని నాని అన్నారు.
‘నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా’
‘ది ప్యారడైజ్’ తన కెరీర్లోనే అత్యంత కష్టపడి చేసిన సినిమా అని నాని చెప్పడం ఈ ప్రెస్మీట్లో మరో కీలకమైన కామెంట్‌గా మారింది. క్యారెక్టర్ కోసం మాత్రమే కాకుండా డబ్బింగ్ విషయంలోనూ చాలా కష్టపడ్డానని ఆయన తెలిపారు. సినిమాలో ఒక సన్నివేశంలో గొంతు చించుకుని అరవాల్సి ఉంటుందని, ఆ డబ్బింగ్ చెప్పిన తర్వాత తన గొంతు పోయిందని చెప్పారు. “చాలా మనసుపెట్టి చేశాను” అంటూ నాని చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని చూపిస్తున్నాయి.
‘సినిమా మొత్తం హైలెట్‌గా ఉంటుంది’.. కాకుల ఎపిసోడ్‌పై నాని ట్విస్ట్!
‘ది ప్యారడైజ్’లో కాకులకు సంబంధించిన ఒక ఎపిసోడ్ చాలా హైలెట్‌గా ఉంటుందనే ప్రచారంపై కూడా నానిని ప్రశ్నించారు. అయితే దీనికి ఆయన ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా ఉంది. కేవలం ఒక్క ఎపిసోడ్ మాత్రమే హైలెట్ కాదని, సినిమా మొత్తం హైలెట్‌గా ఉంటుందని నాని చెప్పారు. తన క్యారెక్టర్ లుక్ నుంచి ప్రతి చిన్న విషయాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంతో పర్ఫెక్ట్గా డిజైన్ చేశారని తెలిపారు.
‘శ్రీకాంత్ మొండివాడు’.. కానీ ఆ మొండితనం మంచికే!
సినిమా ఆలస్యం కావడానికి శ్రీకాంత్ ఓదెల మొండితనం కారణమా అని నానిని ప్రశ్నించగా ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా “కచ్చితంగా. అతను మొండివాడు” అంటూ సమాధానం ఇచ్చారు. అయితే అదే సమయంలో ఆ మొండితనం వెనుక ఒక విజన్ ఉందని నాని చెప్పారు. తనకు ఏం కావాలో స్పష్టంగా తెలిసిన శ్రీకాంత్ ఓదెల, ఆ విజన్‌ను తెరపైకి తీసుకురావడంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరని తెలిపారు. అతని మొండితనం సినిమా మంచికే అని నాని చెప్పుకొచ్చారు.
ఇక సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రేక్షకులకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే తమ లక్ష్యమని నాని చెప్పారు. ఇప్పటివరకు తన సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్దగా ఫోకస్ చేయలేదని నాని తెలిపారు. కానీ ‘ది ప్యారడైజ్’లోని రెండు డాన్స్ నంబర్స్ కోసం ప్రత్యేకంగా కష్టపడ్డానని చెప్పారు. ముఖ్యంగా ‘ఆయా షేర్’ పాటలో ఫ్లోర్ మూమెంట్ కోసం చాలా కష్టపడ్డానని వెల్లడించారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన తనను ఎంతో హ్యాపీ చేసిందని నాని తెలిపారు. పాటల విషయంలో శ్రీకాంత్ ఓదెలకు చాలా మంచి టేస్ట్ ఉందని ప్రశంసించారు. అమెరికాలో జరిగిన కాన్సర్ట్‌లో ‘ఆయా షేర్’కు వచ్చిన రెస్పాన్స్‌ను నాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ యుఫోరియా అనిరుధ్ వల్లే సాధ్యమైందని అన్నారు. ఆ పాటకు వచ్చిన ఎనర్జీ అన్బిలీవబుల్గా ఉందని తెలిపారు.
‘ప్యారడైజ్’ అసలు కథపై శ్రీకాంత్ ఓదెల క్లారిటీ
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ను కేవలం యాక్షన్ సినిమాగా చూడొద్దనే సంకేతాలు ఇచ్చారు. ఇది ఒక రివల్యూషనరీ ఎమోషనల్ ఫిలిం అని చెప్పారు. ఒక తల్లి, కొడుకుల కథతో పాటు ఒక సవారీ జాతి కథ ఇందులో ఉంటుందని వెల్లడించారు. దేశం కోసం పోరాడినప్పటికీ అదే దేశంతో సంబంధం లేని వారిగా మిగిలిపోయిన ఒక జాతి కథను సినిమాలో చూపిస్తున్నామని ఆయన వివరించారు.
అలాగే రన్‌టైమ్ విషయంలోనూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చారు. సినిమా 2 గంటల 49 నిమిషాల నిడివితో ఉంటుందని, ఇదే ఫైనల్ కట్ అని తెలిపారు.