Kaarthi Sardar 2 Movie Review Telugu
చిత్రం : సర్దార్ 2
రేటింగ్ : 1.5/5
నటీనటులు : కార్తీ, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, ఎస్.జే. సూర్య, రజీషా విజయన్, యోగిబాబు, ఆశిష్ విద్యార్థి తదితరులు
బ్యానర్ : ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు : ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : పి.ఎస్. మిత్రన్
సంగీత దర్శకుడు : సామ్ సీఎస్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : జార్జ్ సి. విలియమ్స్
ఎడిటర్ : విజయ్ వేలుకుట్టి
విడుదల తేదీ : 10 సెప్టెంబర్ 2026
Kaarthi Sardar 2 Movie Review Telugu
కథ విషయానికొస్తే..
‘సర్దార్’లోని స్పై ప్రపంచాన్ని మరింత విస్తరించే ప్రయత్నమే ‘సర్దార్ 2’. ఇండియన్ రా (RAW)లో సీనియర్ ఏజెంట్ అయిన వాల్రస్ (అచ్యుత్ కుమార్) అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోవడంతో అతని కోసం రా బృందం తీవ్రంగా గాలిస్తుంటుంది. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు ఓ అండర్‌కవర్ ఆపరేషన్ చేపడతారు. అయితే తన పైఅధికారి (ఆశిష్ విద్యార్థి)కి తెలియకుండా ఆ ఆపరేషన్‌లో కింది స్థాయి రా ఏజెంట్ విజయ్ (కార్తీ) కూడా ఇన్వాల్వ్ అవుతాడు. వాల్రస్ను పట్టుకునే ప్రయత్నంలో విజయ్‌కు ఫైజా (ఆషికా రంగనాథ్) తారసపడుతుంది. అయితే అనూహ్యంగా ఓ టెర్రరిస్ట్ వారిద్దరినీ టార్గెట్ చేస్తాడు. వాల్రస్, ఫైజాలను చంపేందుకు జరిగిన దాడి చివరకు తీవ్ర ఘర్షణకు దారితీస్తుంది. ఈ ఘటనలో వాల్రస్ ప్రాణాలు కోల్పోతాడు. అయితే పైఅధికారి అనుమతి లేకుండా ఆపరేషన్లోకి వెళ్లడంతో పాటు, జరుగుతున్న ఆపరేషన్‌కు ఆటంకం కలిగించాడనే కారణంతో విజయ్ (కార్తీ), అతని టీమ్‌పై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఇదిలా ఉండగా, మరణానికి ముందు వాల్రస్ విజయ్ను చూసి అతన్ని ‘సర్దార్’గా భావిస్తాడు. అంతేకాదు.. కత్తి ఆకారంలో ఉన్న ఓ రహస్యమైన కీని విజయ్‌కు అందిస్తాడు. అసలు ఆ కీ వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది విజయ్‌కు కూడా అంతుచిక్కదు. మరోవైపు మరో సీనియర్ రా ఏజెంట్ జారా (మాళవిక మోహనన్)* బాంబ్ బ్లాస్ట్‌లో మరణించిందని ఆమె కూతురు ఫైజా (ఆషికా రంగనాథ్) నిర్ధారిస్తుంది. అయితే చనిపోయే ముందు జారా తన కూతురికి ఓ గిఫ్ట్ బాక్స్ పంపిస్తుంది. ఆ గిఫ్ట్ బాక్స్ ఆధారంగా విజయ్‌కు మరో కీలకమైన కీ లభిస్తుంది. ఈ రెండు కీల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో విజయ్ జీవితంలోకి ‘బ్లాక్ డాగ్’ యోగి (ఎస్.జె. సూర్య) ప్రవేశిస్తాడు. విజయ్, జారా విషయంలో యోగికి ఉన్న సమస్య ఏంటి? వారిద్దరినీ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అతని అసలు లక్ష్యం ఏమిటి? ఇక ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకంగా మారేది ‘ఆపరేషన్ డోకు’. అసలు ఆపరేషన్ డోకు ఏంటి? దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? విజయ్ చేతికి వచ్చిన ఆ కీలతో దీనికి ఉన్న సంబంధం ఏంటి. అన్నింటికంటే ముఖ్యంగా.. అందరూ చనిపోయాడని భావిస్తున్న ‘సర్దార్’ నిజంగానే చనిపోయాడా? లేక ఈ మొత్తం వ్యవహారం వెనుక అతని పాత్ర ఉందా?. ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు వరుస ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలతో మిగతా కథ ఆసక్తికరంగా సాగుతుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
కార్తీ తనదైన సహజమైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అతని ఎనర్జీ కనిపిస్తుంది. అయితే తండ్రి పాత్రకు సంబంధించిన మేకప్, కొన్ని సన్నివేశాల్లో డబ్బింగ్ అంతగా సెట్ కాలేదు. మాళవిక మోహనన్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించినా, క్యారెక్టర్‌ను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. ఆషికా రంగనాథ్ పాత్ర పరిమితంగానే అనిపిస్తుంది. రజీషా విజయన్ తన పరిధిలో బాగానే చేసింది. ఎస్.జే. సూర్య తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో విలన్‌గా ఆకట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే కొన్ని చోట్ల అతిగా అరవడం, ఓవర్ ది టాప్ యాక్టింగ్ వల్ల సీరియస్ సీన్ల ఇంపాక్ట్ తగ్గిపోయింది. యోగిబాబు కామెడీ కూడా కథలో సహజంగా కలిసిపోకుండా ప్రత్యేకంగా పెట్టినట్టుగా అనిపిస్తుంది.
టెక్నీకల్ టీమ్ గురించి..
పి.ఎస్. మిత్రన్ ‘సర్దార్’తో స్పై జానర్‌కు కొత్త టచ్ ఇచ్చాడు. అదే స్థాయి మ్యాజిక్‌ను సీక్వెల్లో కొనసాగించలేకపోయాడు. కథలో ఐడియాలు ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ వాటిని తెరపైకి తీసుకొచ్చే విధానం తడబడింది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో బాగానే ఉన్నా, సినిమా మొత్తం మూడ్‌ను ఎలివేట్ చేసే స్థాయిలో మాత్రం అనిపించదు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఉన్న భారీ స్కేల్‌ను చూపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌కు భారీగా ఖర్చు పెట్టిన విషయం తెరపై కనిపిస్తుంది. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాలు కథకు అవసరమైన ఉత్కంఠ కంటే ఎక్కువగా సాగడంతో ప్రభావం తగ్గింది.
సినిమా ఎలా ఉందంటే..
‘సర్దార్ 2’ ఆసక్తికరమైన పాయింట్‌తో మొదలవుతుంది. మొదటి భాగంలో స్పై మిషన్, ఫ్లాష్‌బ్యాక్, ఇంటర్వెల్ బ్లాక్ వంటి అంశాలు కొంత ఆసక్తిని కలిగిస్తాయి. కానీ కథలోని చాలా విషయాలు ముందే ఊహించేలా ఉండటం సమస్యగా మారుతుంది. అసలు ఇబ్బంది సెకండాఫ్‌లో మొదలవుతుంది. విలన్ ట్రాక్, యాక్షన్ బ్లాక్స్, పొడవైన క్లైమాక్స్ కారణంగా సినిమా సాగతీతగా అనిపిస్తుంది. దాదాపు మూడు గంటల రన్‌టైమ్ కూడా ఈ అనుభూతిని మరింత పెంచుతుంది. స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన ట్విస్టులు, టెన్షన్, ఎమోషనల్ ఇంపాక్ట్ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఒక మంచి ఐడియాను తీసుకుని దానికి ఎక్కువ హంగులు జోడించడంతో అసలు కథ వెనక్కి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
ప్లస్ పాయింట్స్ :
కార్తీ నటన
కొన్ని యాక్షన్ సన్నివేశాలు
ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు
భారీ ప్రొడక్షన్ వాల్యూస్
పాటలు లేకపోవడం
మైనస్ పాయింట్స్ :
బలహీనమైన స్క్రీన్‌ప్లే
లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు
సెకండాఫ్‌లో సాగతీత
బలంగా పండని విలన్ ట్రాక్
ఓవర్ ది టాప్ యాక్షన్
దాదాపు మూడు గంటల రన్‌టైమ్
ఆకట్టుకోని క్లైమాక్స్
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘సర్దార్’ ఇచ్చిన ఇంపాక్ట్‌తో ‘సర్దార్ 2’పై అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. అయితే ఆ అంచనాలను అందుకునే స్థాయిలో సీక్వెల్ నిలవలేకపోయింది. ఆసక్తికరమైన స్పై కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, బలమైన కథనం లేకపోవడం, సెకండాఫ్‌లో పెరిగిన సాగతీత, అవసరానికి మించిన యాక్షన్ సినిమాకు మైనస్‌గా మారాయి. భారీ మిషన్.. కానీ ఆశించిన థ్రిల్ మాత్రం మిస్సయింది.