Madhav Maremma Movie Review
చిత్రం : మారెమ్మ
రేటింగ్ : 1.5/5
నటీనటులు: మాధవ్ భూపతిరాజు, దీప బాలు, వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపాలక్ష్మీ, దయానంద్ రెడ్డి తదితరులు
బ్యానర్ : మోక్ష ఆర్ట్స్
నిర్మాత : మయూర్ రెడ్డి బండారు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : మంచాల నాగరాజు
సంగీత దర్శకులు : ప్రశాంత్ ఆర్. విహారి, బిప్రాదీప్ దుత్తా
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్ : సాయి బాబు తలారి
విడుదల తేదీ : 10 సెప్టెంబర్ 2026
Madhav Maremma Movie Review
కథ విషయానికొస్తే..
తెలంగాణలోని మహిషాపురం అనే గ్రామం చుట్టూ ‘మారెమ్మ’ కథ సాగుతుంది. గ్రామంలో ఒక దశలో కరువు, అనారోగ్యం, ప్రాణనష్టం వంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. దీంతో గ్రామస్థులు తమ ఆరాధ్య దైవమైన మారెమ్మ అమ్మవారిని ఆశ్రయిస్తారు. మొక్కులు, పూజలు చేసినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించదు. చివరకు ఓ దున్నపోతును బలి ఇవ్వడంతో గ్రామానికి కష్టాలు తొలగిపోతాయి.
అప్పటి నుంచి ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దున్నపోతును బలి ఇవ్వడం గ్రామ ఆచారంగా మారుతుంది. ఇదే సమయంలో తమ గ్రామంలో ఓ ప్రత్యేకమైన దున్నపోతు జన్మిస్తుందని పూజారి చెప్పడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఆ దున్నపోతుకు ‘మారి’ అని పేరు పెట్టి, దాని సంరక్షణ బాధ్యతను కర్ణ (మాధవ్ భూపతిరాజు)కు అప్పగిస్తారు. చిన్నప్పటి నుంచే మారితో కర్ణకు విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది. మరోవైపు తన మరదలు మంజు (దీప బాలు)తో కర్ణ ప్రేమలో ఉంటాడు. అయితే మారిని బలి ఇవ్వాల్సిన సమయం దగ్గర పడటంతో కర్ణలో సంఘర్షణ మొదలవుతుంది. ఇంతగా ప్రేమగా పెంచుకున్న దున్నపోతును బలి ఇవ్వడానికి అతను సిద్ధంగా ఉండడు. సరిగ్గా బలి ఇవ్వాల్సిన సమయంలో మారి కనిపించకుండా పోతుంది. అసలు మారి ఏమైంది? దాన్ని ఎవరు తీసుకెళ్లారు? మహిషాపురం గ్రామంపై జలంధర్ (వికాస్ వశిష్ట)కు ఉన్న కక్ష ఏమిటి? మారిని కర్ణ తిరిగి కనిపెట్టగలిగాడా? చివరకు గ్రామ ఆచారం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
హీరోగా పరిచయమైన మాధవ్ భూపతిరాజు గ్రామీణ యువకుడి లుక్‌లో కనిపించడానికి చేసిన ప్రయత్నం మాత్రం కనిపిస్తుంది. అయితే నటన విషయంలో మాత్రం మరింత మెరుగుదల అవసరం అనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో భావాలను పలికించడంలో, డైలాగ్ డెలివరీలో తడబాటు కనిపిస్తుంది. మంజు పాత్రలో దీప బాలు తన పరిధిలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ పాత్రకు తగినంత బలం ఇవ్వలేదు. వినోద్ కుమార్ వంటి సీనియర్ నటుడిని మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ అది పూర్తిగా వర్కవుట్ కాలేదు. వికాస్ వశిష్ట విలన్ పాత్రలో కనిపించినా, ఆ పాత్రకు అవసరమైన స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. రూపాలక్ష్మీ పాత్ర మాత్రం మిగతా పాత్రలతో పోలిస్తే కొంత ప్రత్యేకంగా అనిపిస్తుంది.
టెక్నీకల్ టీమ్ గురించి..
రూరల్ బ్యాక్‌డ్రాప్, తెలంగాణ సంస్కృతి, గ్రామీణ ఆచారాలను తెరపై చూపించాలనే ప్రయత్నం దర్శకుడి నుంచి కనిపిస్తుంది. అయితే కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లే స్క్రీన్‌ప్లే లోపించడంతో ఆ ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలించలేదు. సినిమాటోగ్రఫీ కొన్ని సన్నివేశాల్లో నిరాశపరుస్తుంది. గ్రామీణ వాతావరణాన్ని మరింత సహజంగా చూపించాల్సిన అవసరం ఉంది. కొన్ని సన్నివేశాల్లో కెమెరా వర్క్ కథకు తగ్గ ఇంపాక్ట్ ఇవ్వదు. సంగీతం మాత్రం సినిమాకు ఉన్న కొద్దిపాటి ప్లస్ పాయింట్లలో ఒకటి. పాటల్లో ఒకట్రెండు వినసొంపుగా అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల సన్నివేశాలకు బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో సాగతీతను తగ్గించి ఉంటే సినిమా కొంత మెరుగ్గా అనిపించేది.
సినిమా ఎలా ఉందంటే..
‘మారెమ్మ’కు ఆసక్తికరమైన కథా పాయింట్ ఉంది. గ్రామీణ విశ్వాసాలు, ఆచారాలు, జంతుబలి చుట్టూ కథను నడిపించే ప్రయత్నం కూడా కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ పాయింట్‌ను బలమైన కథనంగా మార్చడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. ప్రారంభంలో కథ ఏదో విభిన్నమైన అనుభూతిని ఇవ్వబోతోందనే ఆసక్తి కలుగుతుంది. కానీ కథ ముందుకు వెళ్లేకొద్దీ సన్నివేశాలు ఊహించదగినవిగా మారతాయి. పాత్రల మధ్య సంఘర్షణకు సరైన బలం లేకపోవడం, ఎమోషన్ సరిగా పండకపోవడం ప్రధాన సమస్యలుగా మారాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపించినా, సెకండాఫ్‌లో కథనం మరింత నీరసంగా మారుతుంది. ముఖ్యంగా కీలకమైన మలుపులు ప్రేక్షకుడిని థ్రిల్ చేయలేకపోతాయి. క్లైమాక్స్‌కు చేరుకునే సమయానికి కథ చెప్పాలనుకున్న విషయంపై కూడా పూర్తి స్థాయి ప్రభావం కనిపించదు.
ప్లస్ పాయింట్స్ :
కథా నేపథ్యం
తెలంగాణ గ్రామీణ వాతావరణం
ఒకట్రెండు పాటలు
కొన్ని సహజమైన సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
బలహీనమైన స్క్రీన్‌ప్లే
హీరో నటన, డైలాగ్ డెలివరీ
సెకండాఫ్‌లో సాగతీత
ఎమోషన్ పండకపోవడం
ఊహించదగిన సన్నివేశాలు
బలహీనమైన కెమెరా వర్క్
కొన్ని పాత్రలకు సరైన ప్రాధాన్యత లేకపోవడం
ఫైనల్‌గా చెప్పాలంటే..
గ్రామీణ విశ్వాసాలు, ఆచారాలు, దైవభక్తి నేపథ్యంలో ‘మారెమ్మ’కు మంచి పాయింట్ దొరికింది. కానీ ఆ పాయింట్‌కు తగ్గట్టుగా బలమైన కథనం, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలను జోడించడంలో సినిమా తడబడింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలోని నెమ్మదైన కథనం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కొన్ని పాటలు మినహా పెద్దగా మెప్పించే అంశాలు కనిపించవు. మొత్తంగా.. మంచి పాయింట్ ఉన్నా, సరైన ఎగ్జిక్యూషన్ లేక ‘మారెమ్మ’ మెప్పించలేకపోయింది.