Kiran Abbavaram’s Reality Glimpse
ఒకప్పుడు సినిమాల్లో హీరోకు ‘హై మూమెంట్’ అంటే భారీ యాక్షన్ సీన్, పవర్ఫుల్ డైలాగ్, ప్రేమలో గెలుపు లేదా విలన్‌పై విజయం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విజయాలే అసలైన హై మూమెంట్స్ అని చెప్పే కథలు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాయి. కిరణ్ అబ్బవరం హీరోగా, తొలిసారి దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ చూస్తే ఇదే భావన కలుగుతోంది.
Kiran Abbavaram’s Reality Glimpse
‘KA13’గా ఇప్పటివరకు ఆసక్తి పెంచిన ఈ సినిమాకు ఇప్పుడు ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో ఆనందం పాత్రలో కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నాడు. పేరు మాత్రమే కాదు.. అతడి ఆలోచనా విధానం కూడా ఆనందాన్ని చుట్టూనే తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆనందం వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్‌ను నడుపుతూ..
కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాడు.
“ఈ రోజుటితో నాకు కానీ నా కుటుంబానికి కానీ ఒక్క రూపాయి కూడా అప్పు లేదు.. నాలాంటోడికి ఇంతకంటే పెద్ద హై మూమెంట్ ఏముంటుంది?” అని కిరణ్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే లైఫ్‌లో మనం వెతుక్కునే ఆనందం పెద్ద విషయాల్లో ఉండకపోవచ్చు.. ఒక అప్పు తీరడం, కుటుంబం సంతోషంగా ఉండటం, మన వల్ల ఇంకొకరు సంతోషపడటం.. ఇవే అసలైన హై మూమెంట్స్ కావచ్చు.
గ్లింప్స్‌లో హోటల్ బ్యాక్‌డ్రాప్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. హీరో కేవలం హోటల్ నడిపే వ్యక్తిగా కాకుండా, ఆ ప్రదేశంతో భావోద్వేగంగా కనెక్ట్ అయిన వ్యక్తిగా చూపించే ప్రయత్నం కనిపిస్తోంది. వంటగది, కుటుంబ సభ్యులతో కలిసి ఉండే సన్నివేశాలు, సరదా క్షణాలు.. ఇవన్నీ సినిమా చాలా సహజమైన ప్రపంచంలో సాగుతుందనే ఫీలింగ్ ఇస్తున్నాయి.
ముఖ్యంగా గ్లింప్స్‌లో కనిపించిన అరటి ఆకులు పట్టుకుని కిరణ్ అబ్బవరం చేసే సందడి సినిమా టోన్‌ను చెప్పకనే చెబుతోంది. పెద్ద ఎలివేషన్స్ కంటే పాత్రలోని సహజత్వాన్ని, సరదాను చూపించడానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. అలాగే ‘భజ గోవిందం’ అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింపుల్ ఫ్యామిలీ ఎమోషన్స్‌కు భక్తి గీతం టచ్ ఇవ్వడం ద్వారా సినిమాకు ఒక రూటెడ్ ఫీల్ తీసుకొచ్చారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, విజువల్స్‌లో కూడా పల్లెటూరి/మధ్యతరగతి జీవనశైలికి దగ్గరైన వాతావరణం కనిపిస్తోంది.
‘రియాలిటీ’లో మరో పెద్ద ఆసక్తికర అంశం కిరణ్ అబ్బవరం దర్శకుడిగా పరిచయం కావడం. హీరోగా కెమెరా ముందు కనిపించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. అంటే ఈ సినిమా కిరణ్‌కు కేవలం మరో సినిమా కాదు.. తనలోని మరో క్రియేటివ్ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం. డిసెంబర్ 25న ‘రియాలిటీ’ థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ హాలిడేను టార్గెట్ చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అవకాశం ఉంది.