Pithapuramlo Ala Modalaindi Release Date
ప్రేమ, హాస్యం, సెంటిమెంట్‌తో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రధానంగా చూపిస్తూ తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. ‘ప్రేయసి రావే’ ఫేమ్ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
Pithapuramlo Ala Modalaindi Release Date
డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మాతలుగా వ్యవహరించారు.
‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ గురించి దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ.. ప్రేమ, సున్నితమైన హాస్యం, సెంటిమెంట్‌తో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధం, యువతకు ఉపయోగపడే మంచి సందేశం సినిమాలో ఉంటాయని తెలిపారు. మన చుట్టూ నిత్యం కనిపించే మనుషులు, సహజమైన సంఘటనలనే కథలో భాగంగా తీసుకున్నామని, అందుకే సినిమా చాలా నేచురల్‌గా అనిపిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేలా సినిమాను రూపొందించినట్టు చెప్పారు.
హాస్య బ్రహ్మ డా. బ్రహ్మానందం అందించిన వాయిస్ ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని దర్శకుడు తెలిపారు. నిజంగా కెమెరా పెట్టి చుట్టూ జరుగుతున్న జీవితాన్ని చిత్రీకరించినట్టుగా సినిమా ఉంటుందని, సహజమైన కథాంశాలతో తెరకెక్కే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని మహేష్ చంద్ర అభిప్రాయపడ్డారు.
కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయని, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’, ‘విశ్వనాథం అండ్ సన్స్’, ‘మా ఇంటి బంగారం’ వంటి కుటుంబ కథా చిత్రాల తరహాలో ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు.