Jayakrishna Ghattamaneni character Introduction
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో తరం తెలుగు తెరకు అడుగుపెడుతోంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా నటిస్తుంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జయకృష్ణ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
‘‘హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. తాతయ్య కృష్ణ గారు నాకు దేవుడితో సమానం. ఆయన ఆశీస్సులే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి’’ అంటూ జయకృష్ణ ఎమోషనల్ అయ్యాడు. అలాగే ‘‘నేను మహేష్ బాబాయ్‌కు డైహార్డ్ ఫ్యాన్‌ని. ఈ సినిమా విషయంలో ఆయన ఎప్పటికప్పుడు నాకు సలహాలు, ప్రోత్సాహం అందిస్తున్నారు” అని చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు. ‘ఈ చిత్రంలోని ఈ క్యారెక్టర్ ద్వారా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చని, నటుడిగా నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని భావించాను. అజయ్ భూపతి గారితో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమాకే ఆయనలాంటి దర్శకుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. దత్తు గారు మా తాతగారితో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ మహేష్ బాబు గారితో ‘రాజకుమారుడు’ చేశారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. దీంతో ఘట్టమనేని కుటుంబం, వైజయంతీ మూవీస్ మధ్య ఉన్న అనుబంధం మరోసారి తెరపై కనిపిస్తుంది”అని అన్నారు.
Jayakrishna Ghattamaneni character Introduction
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ నాకు వైజయంతి మూవీస్‌తో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్‌లో కృష్ణ గారితో చేసిన ‘అగ్నిపర్వతం’ పెద్ద సంచలన విజయం సాధించింది. తర్వాత మహేష్ బాబుతో చేసిన ‘రాజకుమారుడు’ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అదే వైజయంతి మూవీస్‌లో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే ‘శ్రీనివాస మంగాపురం’ అనే పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయం. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. రోజూ వెంకటేశ్వర స్వామి హుండీలో ఎన్ని కోట్లు పడతాయో, అన్ని కోట్ల కలెక్షన్లు ఈ సినిమాకు రావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
అశ్వనీ దత్ మాట్లాడుతూ ‘‘ ఈ సినిమా జూలై 9 మీ ముందుకు వస్తోంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 52 సంవత్సరాలు అయింది. రాఘవేంద్రరావు గారు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నాకు సహకరించిన హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ నా కృతజ్ఞతలు. ఎన్టీఆర్ గారు, కృష్ణ గారితో సినిమాలు చేశాను. ఆ తర్వాత నేను పరిచయం చేసిన మహేష్ బాబు, అల్లు అర్జున్ వరకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు”అని అన్నారు.
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ‘‘ మా రమేష్ బాబు ఎక్కడ ఉన్నా జయకృష్ణను ఆశీర్వదిస్తాడని భావిస్తున్నాను. అలాగే అన్నయ్య కృష్ణ గారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. జయకృష్ణ న్యూయార్క్‌లో ఫిల్మ్ కోర్స్ చదివాడు. దత్తు గారి ద్వారా పరిచయం అయితే బాగుంటుందని అనుకున్నాం. అశ్వినీ దత్ గారు ఈ సినిమాకు కావాల్సిన ప్రతిదీ ఎక్కడా రాజీ పడకుండా సమకూర్చారు. అజయ్ భూపతి, జీవీ ప్రకాష్ కుమార్ వంటి అద్భుతమైన టెక్నీషియన్లు ఈ చిత్రంలో పనిచేశారు. కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది”అని అన్నారు.
దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ, ‘‘కృష్ణ గారు చేసిన ధైర్యమైన ప్రయోగాల లక్షణాలు జయకృష్ణలో కనిపిస్తున్నాయి. అతను కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు” అని ప్రశంసించారు.
ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. జయకృష్ణతో కలిసి నటించడం మంచి అనుభవమని చెప్పిన ఆమె, తెలుగు భాష నేర్చుకోవడంలో జయకృష్ణ ఎంతో సహకరించాడని వెల్లడించింది.
కార్యక్రమంలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతూ బెస్ట్ విషెస్ చెప్పారు.
Jayakrishna Ghattamaneni character Introduction
కుటుంబ వారసత్వం, తాతయ్యపై అపారమైన అభిమానం, తండ్రి జ్ఞాపకాలు, బాబాయ్ మహేష్ బాబు ప్రోత్సాహం… ఈ భావోద్వేగాలన్నింటినీ హృదయంలో పెట్టుకుని జయకృష్ణ తెలుగు సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. ‘శ్రీనివాస మంగాపురం’తో ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన ఈ కొత్త హీరో ప్రేక్షకుల మనసుల్లో ఎంతటి స్థానం సంపాదిస్తాడో చూడాలి.