Fahadh Faasil DontTroubleTheTrouble Release on Oct 2
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఇండస్ట్రీ హిట్ ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్‌తో, షోయింగ్ బిజినెస్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్టైనర్ను అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
Fahadh Faasil DontTroubleTheTrouble Release on Oct 2
‘ప్రేమలు’ చిత్రాన్ని తొలిసారిగా డిస్ట్రిబ్యూట్ చేసి ఘన విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ, ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో కలిసి ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఒక వినూత్నమైన ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. విభిన్నమైన కథాంశం, ఆసక్తికరమైన పాత్రలు, వినోదాత్మక అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని మూవీ టీమ్ చెబుతోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచగా, ఇటీవల విడుదల చేసిన ‘కేకు వాకు’ వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్లో ఫహాద్ ఫాజిల్ మెట్లపై కూర్చుని ఉండగా, ఆయన పక్కనే చిన్నారి స్సారా కనిపిస్తోంది. చేతిలో కలర్ స్టిక్ పట్టుకున్న స్సారా ఇంద్రజాలం చేస్తున్నట్లుగా ఉండగా, చుట్టూ డబ్బు వర్షంలా కురుస్తున్న దృశ్యం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అద్భుతాన్ని చూసిన ఫహాద్ ఫాజిల్ ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన భావాలతో కనిపించడం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వినోదం, ఫాంటసీ, మ్యాజికల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రం అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.