Rashmika Ranabali and Mysaa Back-to-Back Release
రష్మిక మందన్న నటిస్తున్న రెండు విభిన్నమైన భారీ చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న చారిత్రక నేపథ్య చిత్రం ‘రణబాలి’ అక్టోబర్‌లో విడుదల కానుండగా, రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘మైసా’ నవంబర్‌లో ప్రేక్షకులను పలకరించనుంది. కేవలం నెల రోజుల వ్యవధిలో రెండు క్రేజీ ప్రాజెక్టులతో రష్మిక థియేటర్లలో సందడి చేయనుండటం విశేషం.
Rashmika Ranabali and Mysaa Back-to-Back Release
అక్టోబర్‌లో ‘రణబాలి’
విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’. ఈ సినిమాను దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న తొలి చిత్రం కావడం ‘రణబాలి’కి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు.
నవంబర్‌లో ‘మైసా’
మరోవైపు రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మైసా’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రష్మిక గోండ్ గిరిజన మహిళ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ, నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. రిలీజ్ డేట్ పోస్టర్లో రష్మిక ఒక భారీ ఈటె పట్టుకుని నిలబడి ఉండగా, ముఖంపై గాయాలతో, వెనుక భారీ జనసమూహం, మండుతున్న పరిసరాలతో అత్యంత ఇంటెన్స్‌గా కనిపించింది. ఈ పోస్టర్ సినిమాకు సంబంధించిన యాక్షన్, ఎమోషనల్ టోన్‌ను ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల షూటింగ్లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొని ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఆమె పోర్షన్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరో 15 రోజులు షూటింగ్ చేస్తే ఈ రెండు చిత్రాల టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుందని సమాచారం. మరోవైపు ఈ రెండు చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా శరవేగంగా జరుగుతున్నాయి.
Rashmika Ranabali and Mysaa Back-to-Back Release
నెల గ్యాప్‌లో రెండు విభిన్న పాత్రలు
రష్మిక మందన్న కెరీర్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన దశ నడుస్తోంది. ఆమె నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టులు కేవలం నెల రోజుల వ్యవధిలో విడుదల కానుండటంతో రష్మిక అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు చిత్రాల్లోనూ రష్మిక పూర్తిగా భిన్నమైన పాత్రల్లో కనిపిస్తుండటంతో, ఈ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు ఆమె కెరీర్లో మరో ప్రత్యేక ఘట్టంగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.