Dulquer Salmaan Birthday Updates
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ డబుల్ ట్రీట్ అందించారు. ఒకవైపు పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేయగా, మరోవైపు దర్శకుడు రవి నెలకుదిటి తెరకెక్కిస్తున్న ‘శ్రీ శ్రీ’ చిత్రం నుంచి తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ను విడుదల చేసి మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు.
Dulquer Salmaan Birthday Updates
‘ఆకాశంలో ఒక తార’ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్లో దుల్కర్ సల్మాన్‌ను కృష్ణ పాత్రలో పరిచయం చేస్తూ, “నవ్వు, ఆప్యాయత, మ్యాజిక్కు ప్రతిరూపమైన దుల్కర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
Dulquer Salmaan Birthday Updates
ఇక దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నూతన దర్శకుడు రవి నెలకుదిటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, ఇది నిర్మాణ సంస్థకు 10వ చిత్రంగా రూపొందుతోంది. ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘బొమ్మ బొమ్మ’ పాటలో రైల్వే స్టేషన్లో మొదలయ్యే దుల్కర్, పూజా హెగ్డేల ప్రేమ ప్రయాణాన్ని ఎంతో అందంగా చూపించారు. ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టిన పూజా హెగ్డేను చూసిన తొలి క్షణం నుంచే ఆమెపై మనసుపడే యువకుడిగా దుల్కర్ కనిపిస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాగే అందమైన ప్రేమ క్షణాలు, స్నేహితులతో కలిసి సాగిన ప్రయాణాన్ని దర్శకుడు విజువల్‌గా అద్భుతంగా ఆవిష్కరించారు.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మరోసారి మెలోడీ మ్యాజిక్‌ను చూపించారు. ఆహ్లాదకరమైన ట్యూన్, అందమైన ఆర్కెస్ట్రేషన్‌తో పాట వినసొంపుగా నిలిచింది. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం ప్రేమలో మునిగిపోయిన యువకుడి మనసును కవితాత్మకంగా పలికించగా, కపిల్ కపిలన్ తన మధురమైన గాత్రంతో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. రామ్ మాస్టర్ కొరియోగ్రఫీ, అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేల మధ్య కనిపించిన సహజమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి ఫ్రేమ్‌ను రొమాంటిక్‌గా మార్చగా, క్యాచీ ట్యూన్, విజువల్స్ కలిసి ఈ పాటను మరో వైరల్ చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి.
‘శ్రీ శ్రీ’ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ‘ఆకాశంలో ఒక తార’, ‘శ్రీ శ్రీ’ చిత్రాలు ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ రెండు అప్డేట్స్ అభిమానుల్లో సినిమాలపై మరింత ఆసక్తిని పెంచాయి.