రివ్యూ : కర : కదలకుండా చూడాలంటే కష్టమే.. ఓపిక చాలా అవసరం
నటీనటులు :- ధనుష్, మమిత బైజు, కేఎస్ రవికుమార్, కరునాస్, జయరామ్, సూరజ్ వెంజరమూడు, ఆడుకాలం నరేన్ తదితరులు
దర్శకత్వం : విఘ్నేష్ రాజా
నిర్మాత : ఇషరి కె గణేష్
సినిమాటోగ్రఫీ : తేని ఈశ్వర్
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
మ్యూజిక్ -: జీవీ ప్రకాష్ కుమార్
విడుదల తేదీ : ఏప్రిల్ 30, 2026
నిడివి : 2 గంటల 41 నిమిషాలు
కథ విషయానికొస్తే..
1990ల నేపథ్యంలో కథ ప్రారంభమవుతుంది. దొంగతనాలు చేస్తూ జీవించే ఓ యువకుడు కర స్వామి (ధనుష్). చిన్నప్పుడే ఇంట్లో నుంచి డబ్బులు దొంగిలించి పారిపోతాడు. తర్వాత ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం కేసులో జైలుకెళ్తాడు. అప్పటికే మల్లితో (మమిత బైజు) పెళ్లి చేసుకుని ఉండటంతో జైలు నుంచి తప్పించుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. వేరే ఊరికి వెళ్లి ఒక చిన్న మెస్‌లో పని చేయడం ప్రారంభిస్తాడు. కొంతకాలానికి తనకంటూ సొంతంగా మెస్ పెట్టాలని అనుకుంటాడు. దీనికోసం బ్యాంక్ లోన్ కోసం అప్లై చేస్తాడు. కానీ ష్యురిటీ ఉంటేనే లోన్ ఇస్తామని బ్యాంక్ వారు చెప్పడంతో ష్యూరిటీ కోసం అతను తన తండ్రి కంద స్వామిని (కే ఎస్ రవి కుమార్) కలవడానికి తిరిగి గ్రామానికి వెళ్తాడు. ఇక్కడ నుంచి కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. కంద స్వామి ఒక కష్టపడే రైతు. తన కొడుకు తప్పు దారిలో నడిచినా, అతనిపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అప్పటికే పొలం తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఎలాగైనా పొలం అమ్మి అప్పులు తీర్చి మిగిలిన డబ్బుతో కరస్వామి ఓ మెస్ పెట్టాలనుకుంటాడు. కానీ పొలం అమ్మడానికి తండ్రి ఒప్పుకోడు. ఈ పరిస్థితుల్లో పొలం తాకట్టు పెట్టి తీసుకున్న లోన్‌కు ఇంటరెస్ట్ చెల్లించకపోవడంతో బ్యాంకు జప్తు నోటీసులు జారీ చేస్తుంది. ఈ అప్పుల ఒత్తిడి తండ్రిని తీవ్రంగా కలచివేస్తుంది. ఈ షాక్ తట్టుకోలేక కంద స్వామి గుండెపోటుతో చనిపోతాడు. కర స్వామి తన తండ్రి మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టడానికి తీసుకెళ్తాడు. కానీ బ్యాంక్ అధికారులు జప్తు నోటీసులు అతికించి, ఆ పొలాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉంటారు. బ్యాంక్ రీజినల్ మేనేజర్ (జయరాం) చట్టం పేరుతో ఎలాంటి కనికరం చూపించడు.
తండ్రి శవాన్ని కూడా అక్కడ పాతిపెట్టలేని దిక్కుతోచని స్థితిలో కర స్వామి తన తండ్రి మృతదేహాన్ని హాస్పిటల్ ఫ్రీజర్‌లో ఉంచుతాడు. ఎలాగైనా డబ్బులు కట్టి తన తండ్రిని తమ పొలంలోనే పాతిపెట్టాలనుకుంటాడు. దీనికోసం వదిలేసిన దొంగతనాలు మళ్లీ చేయాలనుకుంటాడు. ఈసారి తండ్రి లోన్ తీసుకున్న బ్యాంక్‌లోనే దొంగతనానికి ప్రయత్నాలు చేస్తాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. బ్యాంక్‌లు నేషనలైజ్డ్ కాకముందు ఎలా ఉండేవి, వడ్డీలకు అప్పులిచ్చి ఎలా రాబట్టుకునేవారు, ఆస్తులను ఎలా జప్తుచేసుకునే వారో చూపించారు. గ్రామంలో దాదాపు అందరూ బ్యాంకు లోన్ తీసుకుని ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ క్రమంలో కరస్వామి తన తండ్రి కోసం ఏం చేశాడు, ఊరి ప్రజలకు ఏం చేశాడనేది కథ.
ఎవరెలా చేశారంటే :
కరస్వామిగా ధనుష్ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోనూ ఆయన పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా ఉంటుంది. ఇంటెన్స్ పాత్రలో ఎమోషన్స్ పండించాడు. మల్లి పాత్రలో మమిత బైజు ఇప్పటిరవకు కనిపించని డీ గ్లామరస్ లుక్‌లో కనిపించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే ఉన్నా.. పరిమితి మేర నటించింది. ఇక కరస్వామి తండ్రిగా కందస్వామిగా దర్శకుడు కేఎస్ రవికుమార్ విభిన్న పాత్రలో అలరించారు. ఇల్లు వదిలేసి వెళ్లి వచ్చిన కొడుకుపై ఆ తండ్రి చూపించే ప్రేమ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. డీఎస్పీ క్యారెక్టర్లో పవర్‌ఫుల్‌గా సూరజ్ కనిపించారు. జయరాం బ్యాంక్ రీజినల్ మేనేజర్‌గా కథను మలుపు తిప్పే పాత్ర పోషించారు. ఆడుకాలం నరేన్ కేవలం పది నిమిషాల స్ర్కీన్‌కే పరిమితం అయ్యారు. ఓవరాల్‌గా నటీనటులు యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్కరూ తమకిచ్చిన పాత్రకు న్యాయం చేశారు.
ఎలా ఉందంటే :
వాస్తవానికి ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది. బ్యాంకులో అప్పులు తీసుకుని రైతులు పడే కష్టాలను చూపించారు. అలాగే సిస్టమ్ లోని అన్యాయం పాయింట్‌తో కథ రాసుకున్న తీరు ఆకట్టుకుంది.
మారాలని ప్రయత్నించిన మనిషిని తిరిగి తప్పు దారిలోకి నెట్టే పరిస్థితులు గ్రిప్పింగ్‌గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కాస్త ఎంగేజింగ్‌గా ఉన్నా.. కథ రివీల్ అయ్యాక సెకండాఫ్‌లో ల్యాగ్‌లా అనిపిస్తుంది. దొంగతనాల్లో దొరికిన డబ్బుకు ఇంకాస్త ఎక్కువ చూపే దొంగ పోలీసులు, బ్యాంకు దొంగతనాల్లో అధికారుల చేతివాటం లాంటి ఎలిమెంట్స్‌ను రియలిస్టిక్‌గా ఉంటాయి. కానీ అప్పు తీసుకున్న బ్యాంకులోనే తిరిగి దొంగతనం చేయాలనుకోవడం, అక్కడే లోన్ క్లియర్ చేయాలనుకోవడం సిల్లీగా అనిపించినా, నోట్ సీక్వెన్స్‌లను గుర్తించకుండా మళ్లీ వేరే చోట ఆ నోట్లను మార్చడం బ్రిలియంట్‌గా ఉంటుంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కథను మరింత ఎలివేట్ చేస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
ధనుష్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్
జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
కథను ముందే ఊహించడం
ఫైనల్‌గా : కర సినిమాను రెండు గంటల నలభై నిమిషాలు కదలకుండా చూడాలంటే కష్టమే.. ఓపిక చాలా అవసరం. హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే కొంచెం నిరాశ అయ్యే అవకాశం ఉంది.
రేటింగ్ : 2.25/5







