Bobby Gets Emotional on Chiru158 Sets
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులోని పొల్లాచ్చిలో తొలి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన చిత్రబృందం, సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది.
ఈ సందర్భంగా పొల్లాచ్చి షెడ్యూల్‌కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోను మేకర్స్ విడుదల చేశారు. వీడియోలో సెట్స్‌పై నెలకొన్న ఉత్సాహభరితమైన వాతావరణం, ప్రతి సన్నివేశం వెనుక ఉన్న కసరత్తు, సినిమాను అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్న తీరు ఆకట్టుకుంటున్నాయి. వీడియోలో చిరంజీవి హుందాగా, హై-ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ షూటింగ్లో పాల్గొన్న దృశ్యాలు కూడా కనిపించాయి.
Bobby Gets Emotional on Chiru158 Sets
అయితే ఈ BTS వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దర్శకుడు బాబీ కొల్లి స్పందన. ఓ కీలక సన్నివేశంలో చిరంజీవి పూర్తిగా పాత్రలో లీనమై నటించడాన్ని చూసిన బాబీ భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే “జీవించేశారు అన్నయ్యా” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఒక్క క్షణమే సినిమాపై అభిమానుల్లో అంచనాలను మరింత పెంచింది.
పొల్లాచ్చి షెడ్యూల్లో హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న కొత్త షెడ్యూల్లో కథకు కీలకమైన టాకీ పార్ట్స్, ప్రధాన యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించనున్నారు. మెగాస్టార్ కెరీర్లో 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు స్క్రీన్‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు సంభాషణలు రాస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాశ్ కొల్లా, ఎడిటింగ్‌ను ఆంటోని ఎల్. రూబెన్ చేపట్టారు.
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. చిరంజీవిని ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు.