Ananthika Sanilkumar Interview About Romanchakam
చిన్నప్పటి నుంచే కళతో స్నేహం… డ్యాన్స్‌తో మొదలైన ప్రయాణం నటన వైపు అడుగులు… భాష ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలనే తపన… ‘8 వసంతాలు’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్.. ఇప్పుడు పూర్తి భిన్నమైన షేడ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అనంతికకు నటన అంటే కేవలం వృత్తి మాత్రమే కాదు… కళే తన జీవితం అని చెప్పేంత ప్రేమ.
Ananthika Sanilkumar Interview About Romanchakam
బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రోమాంచకం’లో సుమంత్ ప్రభాస్ సరసన ఆమె కథానాయికగా నటించారు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలబోసిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘రోమాంచకం’, తన పాత్ర, కెరీర్, భవిష్యత్ ప్రణాళికల గురించి అనంతిక సనిల్ కుమార్ పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే…
Ananthika Sanilkumar Interview About Romanchakam
‘8 వసంతాలు’ తర్వాత ఎన్నో స్క్రిప్ట్స్ విన్నాను. కానీ ఏ కథ కూడా నన్ను పూర్తిగా ఎగ్జైట్ చేయలేదు. ఆ సమయంలో ‘రోమాంచకం’ కథ నా దగ్గరకు వచ్చింది. స్క్రిప్ట్ విన్న వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి సినిమాలోనే నటించాలని అనుకున్న ఫీలింగ్ కలిగింది. ఇందులో నేను చాలా బబ్లీగా, సరదాగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నిజానికి ఇలాంటి క్యారెక్టర్ చేయాలనేది నా డ్రీమ్. యూత్ బాగా రిలేట్ అయ్యే అంశాలతో సినిమా ఉంటుంది. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు… ప్రేమతో పాటు హాస్యం, ఉత్కంఠ కూడా బలంగా ఉంటాయి.’
‘రోమాంచకం’లో నేను తమిళ అమ్మాయిగా కనిపిస్తాను. ప్రస్తుత తరానికి సంబంధించిన చాలా కాంటెంపరరీ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. యువత జీవితాల్లో సహజంగా జరిగే విషయాలను చాలా ఎంటర్టైనింగ్గా చూపించారు. ప్రేమ కథే అయినప్పటికీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాను ఎంజాయ్ చేయగలరు.
సుమంత్ ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా రోజులు వర్క్‌షాప్స్ చేశారు. నేను ఆయనతో పోలిస్తే తక్కువ వర్క్‌షాప్స్ చేశాను. సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నా పాత్ర కూడా ఆయనకు ఏమాత్రం తగ్గకుండా పోటీ పడేలా డిజైన్ చేశారు. మా ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలు చాలా నేచురల్‌గా ఉంటాయి. నిజంగా ఒక జంట మాట్లాడుకుంటున్నట్లే ప్రేక్షకులకు అనిపిస్తుంది. ముఖ్యంగా సీన్స్‌లో ఎక్కడా ల్యాగ్ ఉండదు. కథ చాలా స్పీడ్‌గా ముందుకు వెళ్తూ ఎంటర్టైన్ చేస్తుంది.’
‘8 వసంతాలు’తో పోలిస్తే ‘రోమాంచకం’ పూర్తిగా భిన్నమైన జానర్. ‘8 వసంతాలు’లో ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటే, ఈ సినిమాలో ఫన్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా ఎంత సరదాగా ఉంటుందో మా షూటింగ్ కూడా అంతే సరదాగా సాగింది. రెండు సినిమాల అనుభవాలు పూర్తిగా విభిన్నమైనవి. ఈ కథ చెప్పినప్పుడు నాకు నా పాత్ర బాగా నచ్చింది. అంతేకాదు దర్శకుడు ఈ సినిమాను ఎలా తెరకెక్కించాలనే విషయంలో చాలా క్లారిటీతో ఉండటం కూడా నన్ను ఆకట్టుకుంది.’
నాకు మ్యూజికల్ డ్రామా సినిమాలంటే చాలా ఇష్టం. ‘రోమాంచకం’లో కూడా సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాలో ‘రాధారమణ’ పాట నాకు చాలా ఇష్టం. సినిమా చేయడానికి ఒప్పుకోవడానికి కథ, పాత్ర, దర్శకుడి విజన్‌తో పాటు ఇలాంటి మ్యూజికల్ ఎలిమెంట్స్ కూడా ఒక కారణం.
ఈ సినిమాలో కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నటిస్తున్నప్పుడే మనలో తెలియని ఆనందం కలిగే సందర్భాలు ఉంటాయి. ఆ జాయ్‌ను మనమే ఫీల్ అవుతుంటాం. అలాంటి సీన్స్ ‘రోమాంచకం’లో చాలా ఉన్నాయి. నా పర్ఫార్మెన్స్ చూసి సందీప్ గారు అప్రిషియేట్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
సుమంత్ ప్రభాస్‌ను మొదటిసారి ఆఫీస్‌లో చూసిన రోజే మేమిద్దరం చాలా మాట్లాడుకున్నాం. అప్పుడే ఒక ఫ్రెండ్ అనే ఫీలింగ్ వచ్చింది. కొన్ని లెంగ్తీ సీన్స్ కోసం కలిసి రిహార్సల్స్ చేశాం. ఆ ప్రాసెస్ వల్లే మా మధ్య మంచి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఏర్పడింది. ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి గారిని మొదటిసారి చూసినప్పుడు ఆయన చాలా సీరియస్‌గా ఉంటారేమో, కోపం ఎక్కువేమో అనుకున్నాను. కానీ తర్వాత ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా సరదాగా ఉంటారని తెలిసింది.
ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగులో నటిస్తున్నాను. అవకాశాలను బట్టి మంచి కథలను ఎంచుకుంటున్నాను. ఏ భాషను ప్రత్యేకంగా పక్కన పెట్టడం లేదు. ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడ పనిచేయాలనుకుంటున్నాను.
చిన్నప్పటి నుంచే ఆర్ట్ నా జీవితంలో ఒక భాగం. నిజం చెప్పాలంటే కళ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. డ్యాన్స్, ఫైట్స్ వంటి వివిధ ఆర్ట్ ఫామ్స్ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ వచ్చాను. ఎల్కేజీ నుంచే ఏదో ఒక కళను నేర్చుకోవడం అలవాటైంది. ఊరికే ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు. దేవుడు నాకు రోజులో చాలా ఎక్కువ సమయం ఇచ్చాడేమో అనిపిస్తుంటుంది. అందుకే ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాను.
డ్యాన్స్ నాకు నటిగా ఎంతో ఉపయోగపడింది. డ్యాన్స్‌లో కృష్ణుడు, సత్యభామ వంటి విభిన్న పాత్రలను ప్రదర్శిస్తాం. సినిమాలో కూడా అలానే ఎన్నో పాత్రల్లో జీవించాల్సి ఉంటుంది. అందుకే డ్యాన్స్ ద్వారా నటనలో కూడా ఎంతో మెరుగయ్యానని భావిస్తాను.
‘8 వసంతాలు’ సినిమా నాకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ‘రోమాంచకం’ కూడా నాకు మాత్రమే కాదు, హీరో సుమంత్ ప్రభాస్‌కు కూడా మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. అయితే ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. నటిగా ఇకపై కొత్త తరహా పాత్రలు, విభిన్న జానర్స్‌లో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డ్యాన్స్ ఆధారిత సినిమాలు వచ్చినా తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో నటిస్తున్న సమయంలో నాకు సంతృప్తి కలగాలి. ఆ క్యారెక్టర్ నన్ను హ్యాపీగా ఉంచాలి. అదే నాకు ముఖ్యమైన విషయం.
‘రోమాంచకం’లో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ… ఈ మూడు ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి. వ్యక్తిగతంగా ఈ మూడింటిలో నాకు ఉత్కంఠ చాలా నచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ ఉత్కంఠ కూడా ప్రేమ వల్లే వస్తుంది. అది ఎలా జరుగుతుంది అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలి.
నేను ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోలిస్తే ‘రోమాంచకం’లో నా పాత్ర చాలా డిఫరెంట్. మేము ఈ సినిమా షూటింగ్‌ను ఎంత హ్యాపీగా, సరదాగా చేశామో… థియేటర్స్‌లో ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వాటి వివరాలు తెలుస్తాయి.