India Joy 2026 – Tollywood Goes Global
తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచ సినీ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాలకు హైదరాబాద్‌ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఇండియా జాయ్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
India Joy 2026 – Tollywood Goes Global
ఈ నేపథ్యంలో బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇండియా జాయ్ – చిత్రరంగ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు సురేష్ బాబు, సి. కళ్యాణ్, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, దర్శకులు వీఎన్ ఆదిత్య, హరీష్ శంకర్, రాహుల్ రవీంద్రన్, సాయి రాజేష్ తదితరులు హాజరయ్యారు. ఇండియా జాయ్ నిర్వహణ, తెలుగు పరిశ్రమ భాగస్వామ్యం, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు లభించనున్న గుర్తింపు వంటి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండియా జాయ్ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులంతా ఈ సమావేశానికి హాజరయ్యారని, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించడం సంతోషకరమని అన్నారు. ఈ సమ్మిట్ విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేస్తామని దిల్ రాజు వెల్లడించారు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తెలుగు చిత్ర పరిశ్రమ తరలివచ్చినప్పటి నుంచి ఇక్కడి ప్రభుత్వాలు సినిమా రంగానికి అండగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం ఆలోచనలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఇక ఇండియా జాయ్ 2026 కేవలం సినీ కార్యక్రమానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ రంగాల కలయికకు వేదిక కానుంది. లక్షకు పైగా అతిథులు పాల్గొనే ఈ వేడుకలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, ఈఏ స్పోర్ట్స్, యూబిసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ప్రముఖ సంస్థలు భాగస్వాములు కానున్నాయి. వందకు పైగా గ్లోబల్ ఇన్వెస్టర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, అంతర్జాతీయ స్టూడియోలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
ఈ వేడుకలో భాగంగా వీఎఫ్ఎక్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ఇండియన్ ఫిల్మ్ కాంక్లేవ్, హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న రెడ్ కార్పెట్ ఈవెంట్, డిసెంబర్ 9న కాన్సర్ట్ ఎరీనా కార్యక్రమం జరగనున్నాయి. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కాన్సర్ట్ ఎరీనా ఈవెంట్‌ను ప్రారంభించనున్నారు.